దక్షిణ చైనా సముద్రంలో మరోసారి ఉద్రిక్తతలు రేపడానికి అమెరికా చేసిన ప్రయత్నం విఫలం అయినట్లు కనిపిస్తోంది. సముద్రంలో చైనా ప్రారంభించిన చమురు డ్రిల్లింగ్ కార్యకలాపాలను స్తంభింపజేయాలని అమెరికా ప్రతిపాదించగా ASEAN దేశాలు సదరు ప్రతిపాదనను తాము చర్చించనేలేదు పొమ్మన్నాయి. అసలు దక్షిణ చైనా సముద్రంలో సమస్యలు ఉన్నాయని ఎవరన్నారని చైనా ప్రశ్నించింది. ASEAN గ్రూపు దేశాలే అమెరికా ప్రతిపాదనను పట్టించుకోకపోవడంతో అమెరికా పరువు గంగలో కలిసినట్లయింది.
ASEAN రీజినల్ ఫోరం సమావేశాలు మియాన్మార్ రాజధానిలో ఈ వారాంతంలో జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ASEAN కూటమి సభ్య దేశాలతో పాటు ఇండియా, అమెరికా, జపాన్ తదితర దేశాలను పరిశీలక దేశాలుగా ఆహ్వానాలు అందుకున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా కార్యకలాపాల పైకి సమావేశాల దృష్టిని మళ్లించి మరోసారి ఉద్రిక్తతలు రేపేందుకు అమెరికా ఎత్తు వేసింది. దానిలో భాగంగా దక్షిణ చైనా సముద్రంలో కార్యకలాపాలను స్తంభింపజేయాలని ప్రతిపాదిస్తున్నట్లుగా అట్టహాసంగా ప్రకటించింది. కానీ ఆ ప్రతిపాదనకు ఎవరూ స్పందించకపోగా అసలు ప్రాముఖ్యత లేనట్లుగా ప్రకటనలు జారీ చేశాయి.
గత మే నెలలో ద.చై.సముద్రంలో చమురు రిగ్గును చైనా తరలించింది. ఆ సందర్భంగా ఫిలిప్పైన్స్ (ASEAN సభ్య దేశం, అమెరికాకు నమ్మినబంటు), అమెరికాలు చైనా చర్యను నిరసిస్తున్నట్లుగా ప్రకటనలు జారీ చేశాయి. చైనా తన చర్యను విరమించుకోవాలని ఆ దేశాలు కోరాయి. అయితే చైనా సదరు నిరసనలను పట్టించుకోలేదు.
ASEAN రీజినల్ ఫోరం (ARF) సందర్భంగా అదే అంశాన్ని తిరిగి అమెరికా లేవనెత్తింది. అమెరికా ప్రతినిధి, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఇప్పటికే మియాన్మార్ రాజధాని చేరుకున్నారు. చైనా, రష్యా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ దేశాల విదేశీ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. భారత దేశం తరపున విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆమె 4 రోజుల పాటు ఈ పర్యటనలో పాల్గొంటారు. ARF తో పాటు తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలోనూ (EAS – East Asia Summit) ఆమె పాల్గొంటారు. చైనా, ఆస్ట్రేలియాలతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. ఇండియా-ASEAN లు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
“కీలకమైన సముద్ర, భూ, నౌకాశ్రయ మార్గాల భద్రతను పరిరక్షించే బృహత్తర బాధ్యత అమెరికా, ASEAN లపై ఉంది. దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలను నివారించడానికి, శాంతియుతంగా నిర్వహించడానికి మనం కలిసి కట్టుగా పని చేయాలి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇది జరగాలి” అని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ తనకు తానే ఆసియా బాధ్యతలను నెత్తి మీద వేసుకున్నారు.
కానీ ASEAN సెక్రటరీ జనరల్ లీ లౌంగ్-మిన్ మాత్రం కెర్రీ మాటలను సున్నితంగా తోసిపుచ్చారు. అమెరికా ప్రతిపాదనను ASEAN సభ్య దేశాలు చర్చించలేదని తేల్చేశాడు. వివాదాస్పద ద్వీపాలలో నిర్మాణాలు, భూ భూభాగాల పునఃవ్యాజ్యాలు తదితర అంశాల పరిష్కారానికి ASEAN దేశాలకు సొంతంగా కొన్ని సూత్రాలు, వ్యవస్ధలు ఏర్పరుచుకున్నాయని స్పష్టం చేశాడు. కాబట్టి బైటి దేశాలు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని, బాధ్యత నెత్తి మీద వేసుకోవలసిన అవసరం లేదని పరోక్షంగా సూచించాడు.
ఆయన అంతటితో ఆగలేదు. ASEAN కూటమి, చైనాల మధ్య 2002 లోనే ఒక ఒప్పందం జరిగిందని గుర్తు చేస్తూ, ఏమన్నా వివాదాలు ఉంటే తాము నేరుగా చైనాతోనే చర్చించుకుంటామని చెప్పారు. సముద్ర వివాదాలకు సంబంధించి తమ మధ్య నియమావళి ఉన్నదని, దానిని అనుసరించడం ద్వారా తమ వివాదాలు పరిష్కరించుకుంటామని చెప్పారు. “అమెరికా ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలా లేదా తిరస్కరించాలా అన్నది మా దృష్టిలో లేదు. దానికంటే మా మధ్య ఒప్పందాన్ని తగిన విధంగా అమలు చేయాలని చైనాను కోరే బాధ్యత పూర్తిగా ASEAN కూటమి పైనే ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. మా బాధ్యత మేము చూసుకుంటాం, మీ కెందుకు ఆందోళన అని ఆయన అమెరికాను ప్రశ్నించారని భావించవచ్చు.
2002 నాటి ఒప్పందాన్ని సభ్య దేశాలన్నీ ఉల్లంఘించాయని, అందువల్లనే ఇక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయని పశ్చిమ పత్రికలు వార్తలు గుప్పిస్తున్నాయి. మా మధ్య సమస్యలు లేవని, ఉంటే వాటిని చక్కగా పరిష్కరించుకుంటామని ASEAN నేతలు ఒక పక్కన చెబుతున్నప్పటికీ తమ మాటల్ని వారి నోళ్లలో దూర్చడానికి పశ్చిమ పత్రికలు శతధా ప్రయత్నిస్తున్నాయి.
గత మే నెలలో అమెరికాతో గొంతు కలిపిన ఫిలిప్పైన్స్ కూడా ఇప్పుడు అమెరికా ప్రతిపాదనతో ఏకీభవించలేదు. ఫిలిప్పైన్స్ విదేశీ మంత్రి ఆల్బర్ట్ డెల్ రోజారియో వివాదాలను పరిష్కరించుకోవాలని మాత్రం చెప్పి ఊరుకున్నారు. ఫిలిప్పైన్స్ మారిన వైఖరి గురించి పత్రికలు అమెరికా ప్రతినిధులను ఆరా తీసాయి. మేము చెప్పిందే ఫిలిప్పైన్స్ చెప్పిందని, కాకపోతే మా ప్రతిపాదన నుండి తమ ప్రతిపాదనను వేరు చేసుకునేందుకు భాష మార్చి ఉండవచ్చని అమెరికా ప్రతినిధులు సర్ది చెప్పుకున్నారు. కనీసం వేరు పరుచుకునే ప్రయత్నం ఫిలిప్పైన్స్ చేసిందని అమెరికా అంగీకరించక తప్పలేదు.
ఆసియా ఖండానికి ఆగ్నేయ మూలలో ఉన్న 10 ఆగ్నేయాసియా దేశాలు ASEAN కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. బ్రూనె, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మియాన్మార్, సింగపూర్, ధాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పైన్స్ లు ఈ కూటమిలో సభ్య దేశాలు. ఈ కూటమితో సంబంధాల కోసం ఇండియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొన్ని వేదికలను కూడా ఇరు పక్షాలు ఏర్పాటు చేసుకున్నాయి.
