జాతీయ, అంతర్జాతీయ పత్రికలన్నీ పశ్చిమ రాజ్యాలు సృష్టించిన యుద్ధ భీభత్సాలపై దృష్టి పెట్టడంతో చైనాలో సంభవించిన ప్రకృతి భీభత్సం పెద్దగా ఎవరి దృష్టికీ రాలేదు. నైరుతి చైనాలోని యూనాన్ రాష్ట్రంలో ఆగస్టు 3 తేదీన చిన్నపాటి భూకంపం విరుచుకుపడింది. రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదయిన ఈ భూకంపం మామూలుగానైతే అంత భారీ భూకంపం ఏమీ కాదు. కానీ కొండలు, లోయలతో నిండి ఉన్న ప్రాంతంలో సంభవించడంతో భారీ నష్టాన్ని కలుగ జేసింది.
ఈ భూకంపంలో 600 పైగా చనిపోగా ఇంకా అనేక వందల మంది గాయపడ్డారు. వేలాది భవనాలు కుప్పకూలిపోయాయి. కొండలు, లోయల మధ్య భూకంపం రావడం వలన కొండ చరియలు, రాళ్ళు పెద్ద మొత్తంలో విరిగి పడ్డాయి. దానితో భూకంపం ముగిసినా అనంతర విధ్వంసంలో మరింత నష్టం జరిగిపోయింది.
కొండ చరియలు అక్కడి నదులు, కాలవలను మూసివేశాయి. ఫలితంగా నీరు పెద్ద మొత్తంలో వివిధ చోట్ల నిలిచిపోవడమే కాకుండా నీటి మట్టం పెరుగుతూ పోయి ఒక్కసారిగా వరదల రూపంలో కూలిపోయిన భవనాలపైకి దూకి వచ్చింది. భూకంపం వల్ల ఏర్పడిన నీటి తటాకాలు మరిన్ని ఏ క్షణంలో నైనా తెగి పోవచ్చని, మరింత నష్టం జరగవచ్చని చైనా అధికారులు, ప్రజలు భయపడుతున్నారు.
నష్టం ప్రధానంగా లుడియన్ కౌంటీలో కేంద్రీకృతం అయిందని చైనా అధికారులు తెలిపారు. 10,000 మంది సైనికులు, వందలాది మంది వాలంటీర్లు లుడియన్ కౌంటీకి చేరుకుని సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూసుకుపోయిన రోడ్లను తెరవడం పెద్ద సవాలుగా మారిందని పత్రికలు చెబుతున్నాయి. రవాణా స్తంభించడం వలన బాధితులను, గాయపడ్డవారిని తరలించడం మరో సవాలుగా మారింది. వీటన్నింటికి తోడు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి.
80,000 వరకు ఇళ్ళు పూర్తిగా నాశనం అయ్యాయని, 125,000 వరకు ఇళ్ళు తీవ్రంగా దెబ్బ తిన్నాయని చైనా ప్రభుత్వం తెలిపింది. వర్షంలో, రవాణా మార్గాలు మూసుకుపోయిన పరిస్ధితుల్లో శిధిలాల నుండి బతికి ఉన్నవారిని, మృత దేహాలను వెలికి తీయడం కష్టం అవుతోందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందజేసింది.















