ఓ చెక్క (లేదా ప్లాస్టిక్) బల్లపైన నిలబడి నీటి అలల పైన తేలియాడుతూ పోయే క్రీడ సర్ఫింగ్. సర్ఫింగ్ క్రీడాకారులకు ఇష్టమైన స్ధలాల్లో అలాస్కా కుక్ ఇన్ లెట్ ఒకటి. సన్నని జల మార్గాల్లో ఏర్పడే బోర్ టైడ్ లు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో అలాస్కా కుక్ ఇన్ లెట్ అయినందున ఉత్తర అమెరికాలోని సర్ఫింగ్ క్రీడాకారులకు ఇది ఫేవరెట్ గా మారింది. భారత దేశంలో కలకత్తాకు సమీపంలో పారే హుగ్లీ నది కూడా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బోర్ టైడ్ ప్రాంతాల్లో ఒకటి.
సన్నని నది లేదా సముద్ర పాయకు చెందిన జల మార్గంలో నీటి ప్రవాహానికి అలలు ఎదురు వెళ్లినప్పుడు బోర్ టైడ్ లు ఏర్పడతాయి. ఇవి అత్యంత బలంతో విరుచుకుపడతాయి. ఒక్కోసారి 10 అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడతాయి. శక్తివంతంగా ప్రయాణించడం వలన భీకరంగా కూడా ఉంటాయి. అందువలన బోర్ టైడ్ లపైన సర్ఫింగ్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి.
అలాస్కా అఖాతం నుండి సముద్రం అలాస్కా భూ ఖండంలోపలికి పాయలు పాయలుగా చొచ్చుకు వెళ్ళినట్లు ఉంటుంది. అలాంటి పాయల్లో ఒకటి కుక్ ఇన్ లెట్. కుక్ ఇన్ లెట్ మళ్ళీ రెండు ప్రధాన పాయలుగా చీలి ఉంటుంది. ఒకటి టర్న్ అగైన్ ఆర్మ్ Turnagain Arm), రెండవది నిక్ ఆర్మ్ (Knick Arm). టర్న్ అగైన్ ఆర్మ్ లో ఏర్పడ్డ బోర్ టైడ్ లపై సాహస సర్ఫర్లు సర్ఫింగ్ చేస్తున్న దృశ్యాలే ఈ కింది ఫోటోలు.
కుక్ ఇన్ లెట్ వెంబడి అలాస్కా పర్వత శ్రేణులు విస్తరించి ఉంటాయి. దానితో అక్కడ ప్రకృతి అత్యంత సుందరంగా ఉంటుంది. సర్ఫర్లను రా రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా కనిపించే అలాస్కా కుక్ ఇన్ లెట్ అందాల కోసమైనా సర్ఫింగ్ క్రీడాకారులు అక్కడికి వెళ్లాలని భావిస్తారు.
టర్న్ అగైన్ పాయలో బోర్ టైడ్ లు ఒక్కోసారి ఎంత బలంగా ఉంటాయంటే సర్ఫర్లను ఏకబిగిన 5 మైళ్ళ వరకు తీసుకెళ్తాయి. ఎటువంటి ఇంధనం లేకుండా కేవలం ఒక చెక్క బల్లపైన నిలబడి 5 మైళ్ళు ప్రయాణించే అనుభవం ఎవరిని మాత్రం ఊరించదు? కాస్త జారుడు నేల ఉంటేనే నాలుగడుగులు జారుతూ వెళ్లడానికి పిల్లలు (పెద్దలు కూడా అనుకోండి) ఉబలాటపడతారు. అలాంటిది మైళ్ళకు మైళ్ళు నీటి అలలపై తేలుతూ వెళ్ళడం అంటే మాటలా?
బోర్ టైడ్ లు మోసుకొచ్చే మట్టి, ఇసుకలు కుక్ ఇన్ లెట్ ఒడ్డును చదునైన మైదానంగా మార్చి వేస్తుంది. ఈ మైదానాల్లో షికారు చేయడం మరో రకం అనుభవం(ట).
ఈ ఫోటోలు చూస్తే మనం కూడా ఓ సారి అలాస్కా బోర్ టైడ్ లపై ప్రయాణం చేసి వచ్చిన అనుభవాన్ని కాస్తన్నా మిగుల్చుతాయి. మీరూ ఓసారి ట్రై చెయ్యండి!















