జులై 16 తేదీన ముగిసిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాల అనంతరం సభ్య దేశాధినేతలు చేసిన ప్రకటనతో ‘నూతన అభివృద్ధి బ్యాంకు’ (న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు) లాంఛనప్రాయంగా ఉనికిలోకి వచ్చింది. బ్యాంకుకు తుదిరూపు ఇస్తూ ఐదు వర్ధమాన దేశాల కూటమి బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) శిఖరాగ్ర సమావేశాలు బ్రెజిల్ నగరం ఫోర్టాలెజా లో ముగిశాయి. గత సంవత్సరం దక్షిణాఫ్రికా నగరం దర్బన్ లో జరిగిన సమావేశాలలో నిర్ణయించినట్లుగానే బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు తమదైన అభివృద్ధి బ్యాంకును విజయవంతంగా ఏర్పాటు చేశాయి.
నూతన బ్యాంకు ఆవిర్భావంతో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతిష్ట నూతన స్ధాయికి ఎగబాకింది. ప్రపంచ జనాభాలూ సగానికి పైగా బ్రిక్స్ దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ జి.డి.పి లో ఐదో వంతు ఈ ఐదు రాజ్యాల సొంతం. అలాంటి దేశాలు నిరంతరం అభివృద్ధి చెందిన దేశాల ముందు దేహీ అంటూ నిలబడకుండా నూతన అభివృద్ధి బ్యాంకు ఇతోధికంగా దోహదపడుతుందనడంలో సందేహం లేదు.
బ్రిక్స్ కూటమి ఆవిర్భావం నుండి పశ్చిమ రాజ్యాల కార్పొరేట్ పత్రికలు, విశ్లేషకులు బ్రిక్స్ కూటమిని అప్రతిష్టపాలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. సభ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని ఒకరంటే ఒకరికి పడదని వార్తలు రాశాయి. చైనా ఆధిపత్యం వహిస్తుందేమోనని ఇతర సభ్య దేశాలకు తీవ్ర భయసందేహాలున్నాయని అందువల్ల కూటమి విఫలం కాక తప్పదని విశ్లేషించారు. కూటమి ఏర్పాటై ఒకటిన్నర దశాబ్దం గడిచినా సాధించిందేమీ లేదని గేలి చేశారు. ఈ విమర్శలను, వెక్కిరింపులను పూర్వపక్షం చేస్తూ ఐదు వర్ధమాన దేశాధినేతలు నూతన అభివృద్ధి బ్యాంకును ప్రకటించారు. ‘బ్రిక్స్ డెవలప్ మెంట్ బ్యాంకు’ గా గతంలో ప్రకటించిన పేరును ‘న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్’ గా మార్చాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ఇండియా సూచన మేరకే ఈ పేరు మార్పు జరగడం గమనార్హం.
ప్రపంచ ఆర్ధిక రంగంలో సరికొత్త శక్తిగా అవతరించిన బ్రిక్స్ కూటమి అభివృద్ధి బ్యాంకుతో పాటు ద్రవ్య సంస్ధకు కూడా రూపకల్పన చేసింది. ‘అత్యవసర సంచితనిధి ఏర్పాటు’ (కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్ మెంట్) గా బ్రిక్స్ నేతలు పేర్కొన్న ఈ వ్యవస్ధను మరో ఐ.ఎం.ఎఫ్ గా పరిశీలకులు ఏకాభిప్రాయం ప్రకటించారు. నూతన అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకుకు పోటీ అయితే కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్ మెంట్, ఐ.ఎం.ఎఫ్ కు పోటీ అని అంతర్జాతీయ విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం.
ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులకు 2010 నాటి జి20 గ్రూపు సమావేశాలు ఆమోదించిన సంస్కరణలను ఇప్పటికయినా అమలు చేయాలని సమావేశాల అనంతరం బ్రిక్స్ దేశాధినేతలు కోరారు. తద్వారా మారిన ప్రపంచ పరిస్ధితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు స్పష్టం చేశారు. దీనినిబట్టి పరిశీలకుల అభిప్రాయం ఎంత నిజమో గ్రహించవచ్చు. బ్యాంకు ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉండాలని నిర్ణయించగా మొదటి 5 సం.లు భారతీయ అధికారి, అనంతరం రష్యా అధికారి సి.ఇ.ఓ గా వ్యవహరిస్తారు. ఆ తర్వాతే ఆ పదవిని చైనా స్వీకరిస్తుంది. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ తదితర పదవులు ఇతర దేశాలు పంచుకున్నాయి.
నూతన అభివృద్ధి బ్యాంకు ప్రారంభ పెట్టుబడి 5000 కోట్ల డాలర్లుగా శిఖరాగ్ర సమావేశాలలో నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ఒక్కో సభ్య దేశం 1000 కోట్ల డాలర్ల చొప్పున, ఐదు సభ్య దేశాలు సమానమొత్తాల్లో సమకూర్చుతాయి. బ్యాంకులో అధిక వాటా పొందడానికి చైనా ప్రయత్నించిందని, బ్రెజిల్, ఇండియాలు ఆ ప్రయత్నాలను నిలువరించాయని పశ్చిమ వార్తా సంస్ధలు రాశాయి. కానీ సభ్య దేశాల నుండి గానీ, నిస్పాక్షిక పరిశీలకుల నుండి గానీ ఇటువంటి పరిశీలన ఏదీ వ్యక్తం కాలేదు. పైగా పశ్చిమ దేశాల ఆర్ధిక పెత్తనానికి విరుగుడుగా సొంత ప్రత్యామ్నాయ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నందుకు పలువురు పరిశీలకులు అభినందించి ఆహ్వానించారు. చర్చలు చివరి నిమిషం వరకు జరిగిన మాట నిజమే. కానీ అంతర్జాతీయ స్ధాయిలో ఏర్పడే బహుళ దేశాల కూటములలో ఇది సర్వ సాధారణం. జి7, ఓ.ఇ.సి.డి, డబ్ల్యూ.టి.ఓ లాంటి సంస్ధల సమావేశాలు ఒక్కోసారి ఏ నిర్ణయమూ లేకుండానే వాయిదా పడిన ఉదంతాలు అనేకం.
బ్యాంకు ప్రారంభ పెట్టుబడిని క్రమంగా 10,000 కోట్ల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ప్రారంభ పెట్టుబడిలో 1000 కోట్ల డాలర్లను ఏడేళ్లలో డబ్బు రూపేణా, మిగిలిన 4000 కోట్లను గ్యారంటీల రూపంలో జమ చేస్తారు. బ్యాంకు నిధులను ప్రధానంగా సభ్య దేశాలలో మౌలిక నిర్మాణాల రంగానికి వినియోగిస్తారు. రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు, విద్యుత్ లైన్లు, ఆహార మరియు వ్యవసాయ గిడ్డంగులు, కమ్యూనికేషన్ లైన్లు, విమానాశ్రయాలు, సరుకు రవాణా వ్యవస్ధలు మొదలైనవన్నీ మౌలిక సౌకర్యాల కిందికి వస్తాయి. బ్రిక్స్ దేశాల్లో దీర్ఘకాలికంగా మౌలిక నిర్మాణాల కోసం కనీసం 80,000 కోట్ల డాలర్లు అవసరం అవుతుందని బ్రెజిల్ నిపుణులు అంచనా వేశారు. ఈ అవసరాన్ని బ్రిక్స్ బ్యాంకు తీర్చగలదని బ్రిక్స్ దేశాలు ఆశిస్తున్నాయి.
ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధకైనా మౌలిక నిర్మాణ రంగం అత్యంత కీలకం. భారత దేశంలో ఈ రంగం బలహీనంగా ఉంది. ఈ రంగం కోసమే గత ప్రభుత్వం ‘ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బాండ్ల’ పేరుతో ప్రత్యేకంగా నిధులు సేకరించడానికి ప్రయత్నించింది. మౌలిక రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్రంలోని ప్రభుత్వాలు పలు ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాయి. తక్షణ లాభాలు, వేగవంతమైన లాభాలు వచ్చే స్టాక్ మార్కెట్ లాంటి ద్రవ్య మార్కెట్లు మాత్రమే విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉంటాయి తప్ప దేశ అవసరాలను తీర్చే రంగాలు కాదని ఇన్నేళ్ల అనుభవం చెబుతున్న సత్యం. ప్రపంచ బ్యాంకు వద్ద రుణాలు తీసుకుంటేనేమో అది విధించే విషమ షరతుల వల్ల దశాబ్దాల తరబడి మనం నిర్మించుకున్న వ్యవస్ధలు విదేశీ కంపెనీలపరం అయ్యే దుస్ధితి దాపురిస్తోంది.
అదీకాక స్టాక్ మార్కెట్లు, ఇతర ద్రవ్య మార్కెట్లలోకి లోకి వస్తున్న విదేశీ పెట్టుబడులు ప్రధానంగా ‘హాట్ మనీ’ లేదా ఎఫ్.ఐ.ఐ (విదేశీ సంస్ధాగత పెట్టుబడులు). ఇవి తక్షణ లాభాల కోసం నిరంతరం చెప్పుల్లో కాళ్ళు దూర్చి ఉంటాయి. అమెరికా, ఐరోపా రాజ్యాల సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న సరళతరమైన ద్రవ్య విధానాల వల్ల (అతి తక్కువ వడ్డీ రేటు, క్వాంటిటేటివ్ ఈజింగ్ లాంటి విశృంఖల ఉద్దీపనలు మొ.వి) చౌక డాలర్లు ఇండియా లాంటి వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ఉద్దీపనలు ఉపసంహరిస్తే వచ్చినంత వేగంతో వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ఇక్కడ రూపాయి విలువ పడిపోవడం, స్టాక్ మార్కెట్లు కుదేలు కావడం, విదేశీ మారక ద్రవ్యం హరించుకుపోయి చెల్లింపుల సమతూకం సంక్షోభం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్) ఏర్పడడం, కరెంటు ఖాతా లోటు పైకి ఎగబాకడం, ఇవన్నీ చూసి మరిన్ని పెట్టుబడులు వెనక్కి పోవడం, కొత్త పెట్టుబడులు అసలే రాకపోవడం జరుగుతోంది.
ఈ పరాధీనత వల్ల సంభావిస్తున్న అస్ధిర పరిస్ధితులను నివారించేందుకు ‘అత్యవసర సంచిత నిధి’ ఏర్పాటుకు బ్రిక్స్ కూటమి శ్రీకారం చుట్టింది. అమెరికా ఉద్దీపనల ఉపసంహరణ వల్ల తలెత్తుతున్న అస్ధిరతను తమ ద్రవ్య నిధి నివారిస్తుందని బ్రెజిల్ నేత దిల్మా రౌసెఫ్ సమావేశాల అనంతరం ప్రకటించడం గమనార్హం. సంచితనిధికి ప్రారంభంలో 10,000 కోట్ల డాలర్లు సమకూర్చాలని సమావేశాలలో నిర్ణయించారు. ఇందులో చైనా 41 శాతం, ఇండియా, బ్రెజిల్, రష్యాలు తలకు 18 శాతం, సౌత్ ఆఫ్రికా 5 శాతం సమకూర్చుతాయి. అవసరం వచ్చినపుడు చైనా తన భాగంలో సగం మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. ఇండియా, బ్రెజిల్, రష్యాలు తమ వాటాకు సమాన మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. సౌత్ ఆఫ్రికా తన వాటాకు రెట్టింపు మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. ఆయా దేశాలు తమ వాటాను తమవద్దే ఉంచుకుని సంక్షోభం వచ్చినపుడు అవసరమైన దేశానికి తరలిస్తాయి. ఐ.ఎం.ఎఫ్ విధించే విషమ షరతులతో పోల్చితే ఉమ్మడి నిధిని ఉదారంగా పొందగల ఈ ఏర్పాటు ఇండియా లాంటి దేశాలకు ఎంతో ఉపశమనం!
2016 నుండి బ్యాంకు రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. అప్పటినుండే నూతన సభ్యత్వాలను స్వీకరిస్తారు. అయితే వ్యవస్ధాపక దేశాల వాటా 55 శాతానికి తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. సంచితనిధి మాత్రం 2015 నుండే రుణాలు ఇస్తుంది. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులతో విసిగిపోయిన దేశాలు నూతన అంతర్జాతీయ ద్రవ్య సంస్ధలవైపు ఆశగా చూస్తున్నాయి. ఈ ఆశలను నెరవేర్చడం ద్వారా బ్రిక్స్ దేశాలు ధనిక దేశాల పెత్తనానికి చరమగీతం పాడవలసిన అవసరం ఉంది.