గడ్కారీ బెడ్రూంతో పాటు ఇంటింటికీ బగ్ అమర్చాలి -కార్టూన్


Tele bugging

“మన సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటింటికీ బగ్ అమర్చాలి…”

***

బి.జె.పి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఇంట్లో రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి ఉన్న సంగతి వెల్లడి అయింది. 2009లో బి.జె.పి అధ్యక్షుడుగా పదవి చేపట్టిన అనంతరం ఆయనకు అధికారిక నివాసాన్ని కేటాయించారు. ఆయన ఇప్పటికీ ఆ ఇంట్లోనే కొనసాగుతున్నారు. ఆయన నిద్రించే బెడ్ రూమ్ లో సంభాషణలు వినే పరికరం రహస్యంగా అమర్చినట్లు వెల్లడి కావడంతో కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాలు విచారణ కోసం డిమాండ్ చేస్తున్నాయి.

టెలిఫోన్ తదితర సంభాషణలను వినేందుకు రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చడాన్ని బగ్గింగ్ అంటారు. ప్రభుత్వం గడ్కారీ ఇంట్లో బగ్గింగ్ పై విచారణకు తిరస్కరిస్తోంది. బగ్గింగ్ జరగలేదని, అన్నీ ఊహలేనని బి.జె.పి నేతలు, కేంద్ర మంత్రులు చెబుతున్నారు.  బగ్గింగ్ జరిగిన విషయాన్ని గడ్కారీ పూర్తిగా తిరస్కరించకుండా అనుమానాలు ఇంకా పెంచుతున్నారు. తన ఇంట్లో బగ్గింగ్ పరికరాలు ఏమీ దొరకలేదని చెప్పడం తప్పించి వార్తలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు చెప్పడం లేదు. తద్వారా పరోక్షంగా బగ్గింగ్ జరిగిన సంగతిని అంగీకరిస్తున్నారు.

బి.జె.పి నేతలపై అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం నిర్వహించిన విషయం ఇటీవల ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. అమెరికా రాయబారికి సమన్లు పంపి పిలిపించుకుని అటువంటి వ్యవహారం మునుముందు జరగబోదని హామీ తీసుకున్నామని కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు మాత్రం విచారణకు నిరాకరిస్తోంది.

నిజంగా బగ్గింగ్ జరిగిందా లేదా అన్న సంగతిని తాము పరిశోధించామని టైమ్స్ ఆఫ్ ఇండియా (టి.ఓ.ఐ) పత్రిక తెలిపింది. బగ్గింగ్ జరిగిన సంగతి నిజమే అని తమ పరిశోధనలో తేలిందని పత్రిక తెలిపింది. గత మే నెలలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో గడ్కారీ బెడ్ రూమ్ లో ఎలక్ట్రానిక్ పరికరాన్ని యాదృచ్ఛికంగా కనుగొన్నారని పత్రిక తెలిపింది.

అప్పటికి ఇంకా యు.పి.ఏ ప్రభుత్వమే కొనసాగుతోంది. దానితో గడ్కారీ ప్రైవేటు డిటెక్టివ్ లతో ఇల్లంతా సోదా చేయిస్తే మరో రెండు పరికరాలు దొరికాయని, అప్పటి నుండి ఇంటి వద్ద ప్రైవేట్ భద్రతా సిబ్బందిని గడ్కారీ నియమించుకున్నారని టి.ఓ.ఐ తెలిపింది. బి.జె.పి నేతలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారని పత్రిక స్పష్టం చేసింది.

మరి బగ్గింగ్ జరిగిన విషయాన్ని బహిరంగంగా ఎందుకు ఇప్పుకోవడం లేదు? దానికి కూడా టి.ఓ.ఐ సమాధానం చెప్పింది. బహిరంగంగా అంగీకరిస్తే ఆ విషయంపై కేసు పెట్టాల్సి వస్తుంది. కేసు పెట్టాక నిందితులను గుర్తించాలి. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలి. విచారణ చెయ్యాలి. అలా చేస్తే దేశీయంగా ఒక రకం సంక్షోభం ఎదుర్కోవాలి. అంతే కాకుండా అంతర్జాతీయంగా (అమెరికాతో) రాయబార సంక్షోభం ఎదుర్కోవాలి. ఇది బి.జె.పి ప్రభుత్వానికి ఇష్టం లేదని అందుకే బగ్గింగే జరగలేదని చెబుతున్నారని టి.ఓ.ఐ తెలిపింది.

ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వీలుగా గతంలో కొందరు రాజులు ఓ గంటను ఏర్పాటు చేసేవారని ప్రతీతి. సమస్య ఉన్నవారు వెళ్ళి ఆ గంట మోగిస్తే రాజుగారు పరుగున వచ్చి వారి సమస్యను తీర్చేవారుట.

సాంకేతిక పరిజ్ఞానం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో అలాంటి గంట అవసరం లేదనీ, గడ్కారీ ఇంట్లో అమర్చినట్లు ఇంటింటికీ ఒక (బహిరంగ) బగ్ అమర్చితే జనం సమస్యలు తేలికగా తెలుసుకోవచ్చని కార్టూనిస్టు వ్యంగ్యంగా సూచిస్తున్నారు.

వ్యంగ్యం ఎందుకంటే జనంలో తలెత్తే ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనలు, కార్యకలాపాలు తెలుసుకోవడానికి ప్రభుత్వాలు బగ్గింగ్ (ఉదా: ఇంటర్నెట్ గూఢచర్యం) చేస్తాయి గానీ జనం సమస్యలు తెలుసుకోవడానికి మాత్రం అలాంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఆలోచన చేయవని కార్టూనిస్టు పరోక్షంగా సూచిస్తున్నారు.

లేకపోతే ఎన్నికల్లో అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడానికీ, వివిధ రకాలుగా ప్రభావితం చెయ్యడానికి వేల కోట్లు ఖర్చు పెట్టే పార్టీలు అధికారంలోకి వచ్చాక సమస్యలు తెలుసుకునే ప్రయత్నమే చేయకపోవడం ఎలా అర్ధం చేసుకోవాలి? వ్యాపార వర్గాల కోసం మంత్రుల సంఖ్యను తగ్గించేసి, ప్రభుత్వాన్ని కుదించేసి, సబ్సిడీలు తెగ్గోసి, పన్నులు మినహాయించేసి…. సంతృప్తి పరుస్తున్న కేంద్రం జనం విషయం వచ్చేసరికి వాళ్లెవరో తెలియనట్లే గడిపేస్తాయి.

వ్యాఖ్యానించండి