పాటల్లో పాడుకోవడమే తప్ప నిజంగా చందమామను అందుకోగలమని మనిషి అప్పటివరకూ ఊహించలేదు. ‘చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు’ అన్న పాట అమెరికన్లు చంద్రుడి మీద కాలు పెట్టకముందు వెలువడిందో తరవాత వెలువడిందో తెలియదు. ఒకవేళ ముందే ఈ పాట రాసి ఉన్నట్లయితే ‘మనవాళ్లు ముందే చెప్పారు’ అని గర్వంగా చెప్పుకోవచ్చునేమో!
పసి పిల్లల్ని మాయపుచ్చి జోకొట్టడానికి అద్దం చూపి చంద్రుడిని కిందికి దింపిన తల్లులు మనిషే ఎగిరి వెళ్ళి చంద్రుడిని అందుకున్నాడని తెలిసి ఎలా ఫీలై ఉంటారో ఆ రోజుల్లో! చంద్రుడు మీద కాలు పెట్టడం మాత్రం మానవ జాతి వికాసంలో ఓ మూల మలుపు అనడంలో సందేహం లేదు. సిద్ధాంత రాద్ధాంతాలతోనూ, శక్తివంతమైన టెలిస్కోపుల తోనూ మాత్రమే చంద్రుడు ఓ గ్రహమని నిర్ధారించినప్పటికీ మనిషి స్వయంగా కాలు పెట్టి మరీ చంద్రుడు నిజంగానే గ్రహమని రుజువైన ఆ రోజున భూ గ్రహవాసులు ఎంతటి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారో తలచుకుంటే కాస్త ఈర్ష్య కలగక మానదు.
జులై 16, 1969 తేదీన సరిగ్గా 45 సంవత్సరాల క్రితం చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం కట్టాడు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైఖేల్ కొలిన్స్, ఎడ్విన్ ఇ. ఆల్ద్రిన్ జూనియర్… ఈ ముగ్గురు అమెరికన్ ఆస్ట్రోనాట్ లు అపోలో 11 కృత్రిమంగా మనిషి తయారు చేసిన రోదసీ నౌకలో ప్రయాణం కట్టి విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపారు. జులై 20 తేదీన అపోలో 11 నౌక కెప్టెన్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రుడిపై కాలు మోపి మానవ సాంకేతిక పరిజ్ఞానం సాధించిన అభివృద్ధికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయాడు.
ఈ దృశ్యాన్ని ప్రపంచ వ్యాపితంగా టి.విల్లో ప్రసారం అయిందని కింది ఫోటోల ద్వారా తెలుస్తోంది. అప్పటికింకా టెలివిజన్ సెట్ కలిగి ఉండడం అతి పెద్ద లగ్జరీగా చెలామణి అవుతున్న రోజులు. కనుక ప్రపంచ వ్యాపితంగా టి.వి లలో వీక్షించినది తక్కువ మందే కావచ్చు. కానీ పత్రికల ద్వారా ఈ వార్తను తెలుసుకున్న ప్రజలు ఆనాటి అద్భుతాన్ని తలచుకుని మురిసిపోయే ఉంటారు.
అపోలో 11 మిషన్ కు ముందు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి అనేక వైఫల్యాల ద్వారా అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకుని మానవ జాతి అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేశారు. అనేక ప్రమాదకర ప్రయోగాలు అయ్యాక గానీ మొట్టమొదటి చంద్రయానం సాధ్యం కాలేదన్నది ఇప్పటి తరం తెలుసుకోవలసిన విషయం. రెండు గంటల పాటు చంద్రుడిపై నడిచి, తమ పాద ముద్రలను రికార్డు చేసి మరీ ముగ్గురు రోదసీ ప్రయాణీకులు తిరిగి వచ్చారు. వస్తూ వస్తూ అక్కడి మట్టి, రాళ్ళు వెంటబెట్టుకుని తెచ్చి చంద్రుడూ ఒక (ఉప) గ్రహమేనని తేల్చి చెప్పారు.
చంద్రయానం జరిగి 45 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ది అట్లాంటిక్ పత్రిక వాళ్ళు ఈ కింది ఫోటోలను అందించారు.























