ప్రశ్న: UNSC శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగం?


UNSC

వి లక్ష్మి నారాయణ:

ఐక్యరాజ్య సమితి బద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇండియాకి ఎందుకు మెంబర్ షిప్ ఇవ్వలేదు, సభ్యత్వం కోసం వేరే సభ్య దేశాలు రికమెండ్ చేయాలా? ఈ టాపిక్ గురించి తెలియ చేయగలరు. ఇంతకుముందు చర్చించి ఉంటె ఆ లింక్ షేర్ చేయండి.

సమాధానం:

ఈ టాపిక్ ఇంతకు ముందు ప్రత్యేకంగా కవర్ చేయలేదు. అయితే, ఇతర ఆర్టికల్స్ లో భాగంగా కొంత రాశాను.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (United Nations Security Council) లో శాశ్వత సభ్యత్వం ఐదు దేశాలకు మాత్రమే ఉంది. అవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. ఈ ఐదు దేశాలను కలిపి P5 (Permanent Five) అని కూడా పిలుస్తారు. శాశ్వత సభ్యత్వం కలిగి ఉండడాన్నే వీటో పవర్ కలిగి ఉండడంగా వాడుకలో చెబుతున్నారు.

నిజానికి వీటో అధికారం అనే పద ప్రయోగం భద్రతా మండలి నియమ నిబంధనల్లో ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలిలు తీసుకునే ఏ నిర్ణయం అయినా ఈ ఐదు దేశాల తప్పనిసరి ఆమోదంతో తీసుకోవాలన్న నిబంధన ఉంది. అనగా ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా సదరు నిర్ణయం లేదా తీర్మానం వీగిపోతుంది. ఇలా మిగిలిన అన్ని సభ్య దేశాల నిర్ణయాన్ని తిరస్కరించడానికి ఉన్న హక్కునే వీటో అధికారం గా వాడుకలోకి వచ్చింది.

ఇలాంటి వీటో అధికారం ఐరాస ముందరి సంస్ధ నానాజాతి సమితి (League of Nations) నుండి వారసత్వంగా వచ్చింది. కాకపోతే నానాజాతి సమితిలో సభ్య దేశాలన్నింటికీ అలాంటి అధికారం ఉండేది. సమితిలో ఏ ఒక్క సభ్య దేశం వ్యతిరేకించినా నిర్ణయం జరిగేది కాదు. ఆ విధంగా అన్ని దేశాలకు సమాన అధికారం ఉండేది. కానీ ఆచరణలో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది పెద్ద ప్రతిబంధకంగా మారిందని ఒక గుణపాఠంగా తీసుకున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఇలాంటి అధికారం ఉండాలని భావిస్తూ శాశ్వత సభ్యత్వం అనే ప్రాతిపదికను ఏర్పాటు చేశారు.

ఆనాటికి ప్రపంచంలో ప్రధాన శక్తులుగా ఉన్న దేశాలకు శాశ్వత సభ్యత్వం కట్టబెట్టారు. ప్రధానంగా రెండో ప్రపంచ యుద్ధంలో విజేతలయిన దేశాలు అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ లు శాశ్వత సభ్యత్వ హోదాను పొందాయి. మూడో ప్రపంచ దేశాల ప్రతినిధిగా రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్.ఒ.సి) కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు.

ఆర్.ఒ.సి అంటే ఇప్పటి ప్రధాన భూభాగం చైనా కాదు. చైనాకు ఆగ్నేయ మూలలో సముద్రంలో ఉన్న చిన్న ద్వీపం తైవాన్ ని ఆనాడు ఆర్.ఒ.సి గా పిలిచారు. చైనాలో 1949లో మావో నాయకత్వంలో జపాన్ సామ్రాజ్యవాదంతో పాటు దేశంలోని భూస్వామ్య యుద్ధ ప్రభువులను, పశ్చిమ దేశాల తైనాతీ అయిన చియాంగ్-కై-షేక్ జాతీయ ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తూ నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయింది. చైనా నుండి పారిపోయి వెళ్ళిన పెట్టుబడిదారీ, భూస్వామ్య శక్తులు చియాంగ్-కై-షేక్ నేతృత్వంలో తైవాన్ లో సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు.

ఐరాస ఏర్పడిన 1945 నాటికి చైనా అంతా ఒకటే. అప్పటికి దేశంలో కమ్యూనిస్టులకు, చియాంగ్-కై-షేక్ సైన్యాలకు తీవ్ర అంతర్యుద్ధం జరుగుతోంది. విప్లవం దాదాపు చివరి దశలో ఉన్నప్పటికీ అధికారికంగా చియాంగ్-కై-షెక్ ప్రభుత్వమే అంతర్జాతీయంగా గుర్తింపులో ఉంది. ఆ విధంగా ఆయన ప్రభుత్వమే చైనా ప్రతినిధులను నియమించింది. 1949లో చియాంగ్-కై-షేక్ నేతృత్వంలో పెట్టుబడిదారీ, భూస్వామ్య శక్తులు తైవాన్ ద్వీపం వరకే పరిమితం అయినప్పటికీ దాని శాశ్వత సభ్యత్వం కొనసాగింది.

1971 అక్టోబర్ లో ఐరాస జనరల్ అసెంబ్లీ 2/3 వంతు మెజారిటీతో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరుతో ఉన్న కమ్యూనిస్టు చైనానే అసలైన సభ్య దేశంగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించింది. (ఈ తీర్మానానికి అమెరికా మద్దతు ఇచ్చింది) అప్పటి నుండి తైవాన్ కు బదులు చైనా శాశ్వత సభ్యత్వ హోదాలో కొనసాగుతోంది. ఒక పేరుతో రెండు సభ్యత్వాలు ఉండవు కనుక  ఆర్.ఓ.సి (తైవాన్) ని ఐరాస నుండి బహిష్కరించారు. 2007లో తైవాన్ పేరుతో సభ్యత్వం తీసుకోవాలని తైవాన్ ప్రయత్నించింది. కానీ 1971 నాటి తీర్మానానికి అది విరుద్ధం అని చెప్పి బాన్-కి-మూన్ దానిని తిరస్కరించాడు.

భద్రతా సమితిలో 15 సభ్య దేశాలు ఉంటే అందులో 5 శాశ్వత సభ్యత్వ దేశాలు. మిగిలిన 10 స్ధానాలకు ప్రాంతాల ప్రాతిపదికన రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశాల్లో ఇండియా కూడా ఒకటి.

శాశ్వత సభ్యత్వ హోదా అంటే ఏ తీర్మానాన్నయినా అడ్డుకోగల అధికారం కలిగి ఉండడం అని పైన చెప్పుకున్నాం. ఈ హోదా ఉంటే ప్రపంచంలో జరిగే వివిధ రాజకీయ, భౌగోళిక, ఆర్ధిక తగాదాల్లో పెత్తనం చెలాయించే అవకాశం వస్తుంది. అందుకే శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా పాకులాడడం. ఇండియాతో పాటు బ్రెజిల్, జపాన్, జర్మనీ దేశాలు కూడా శాశ్వత సభ్యత్వం కోసం అడుగుతున్నాయి.

మారిన ప్రపంచ పరిస్ధితులను భద్రతా సమితి తగిన విధంగా ప్రతిబింబించడం లేదని ఈ నాలుగు దేశాలు వాదిస్తున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఇవి జి4 అన్న గ్రూపును కూడా ఏర్పాటు చేశాయి. కానీ ఇది పెద్దగా పని చేస్తున్నట్లు లేదు. వారి కోరికను P5 దేశాలు మన్నించడం లేదు. పైకి చెప్పడానికి ఇండియాకు మద్దతు ఇస్తున్నామని అమెరికా చెబుతుంది. కానీ ఆచరణలో అందుకు ప్రయత్నం ఏమీ చేయదు.

దేశంలోని మార్కెట్, సహజ వనరులను ఒక్కటోక్కటిగా పశ్చిమ దేశాలకు తాకట్టు పెడుతూ దానినుండి భారత ప్రజల దృష్టి మళ్లించడానికి శాశ్వత సభ్యత్వ హోదాకు మద్దతుగా పశ్చిమ దేశాధినేతలతో ప్రకటనలు ఇప్పించుకోవడం భారత పాలకులు ఒక అలవాటుగా చేసుకున్నారు. అంతకు మించి ఇండియాకు ఐరాసలో ప్రత్యేక గుర్తింపు ఏమీ ప్రస్తుతం లేదు. అలీన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రోజుల్లోనే కాస్త రాజకీయ గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఆ ఉద్యమాన్ని ఇండియా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆ మేరకు రాజకీయ గుర్తింపును కోల్పోయింది.

ఐరాస తన తీర్మానాలను ప్రధానంగా తన ఆధ్వర్యంలోని శాంతి సైనికుల ద్వారా అమలు చేస్తుంది. శాంతి సైనికులను ఐరాస శాంతి పరిరక్ష్ణ బలగాలు (UN Peace Keeping Force) అంటారు. ఈ బలగాలలో అత్యధిక సైనికులను పంపుతున్న దేశాల్లో బ్రెజిల్, ఇండియాలు ముందున్నాయి. భారత జనాభా ప్రపంచంలో రెండో స్ధానం. ఆ విధంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయింది. కాగా, భౌగోళిక విస్తరణ పరంగా బ్రెజిల్ ఐదో స్ధానంలో ఉంది. ఐరాసకు అత్యధికంగా నిధులు ఇస్తున్న దేశాల్లో జపాన్, జర్మనీలు ఉన్నాయి. అమెరికా తర్వాత ఎక్కువ నిధులు ఇస్తున్న దేశం జపాన్ కాగా జర్మనీ మూడో స్ధానంలో ఉంది. ఈ కారణాలు చూపుతూ ఈ దేశాలు వీటో అధికారం డిమాండ్ చేస్తున్నాయి.

కొత్తగా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలంటే UN ఛార్టర్ సవరించాలి. అందుకు 2/3 వంతు జనరల్ అసెంబ్లీ ఆమోదం ఉండాలి. దానితో పాటు P5 దేశాలన్నీ అంగీకరించాలి. కాబట్టి శాశ్వత సభ్యత్వం మరో దేశానికి ఇవ్వడం ఇప్పటి పరిస్ధితుల్లో దాదాపు అసాధ్యం. భద్రతా సమితి సంస్కరణలు నిజమైన అర్ధంలో కోరుకునేవారు ప్రపంచ శాంతి భద్రతలను నిజంగా ఏ పరిస్ధుతుల్లో సాధ్యం అవుతుందో అలాంటి పరిస్ధితుల కోసం కృషి చేయాలి. మరిన్ని దేశాలకు వీటో అధికారం ఇస్తే ఆమేరకు పెత్తనం చేసే దేశాల సంఖ్య పెరుగుతుంది తప్ప అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు.

పాలస్తీనాపై ఘోరంగా, అమానవీయంగా దాడులు చేస్తూ 1000 మందికి పైగా పౌరులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్ చర్యలను ఖండించడమే భారత పాలకుల వల్ల కాలేదు. ఇక వీటో అధికారం సంపాదించి ఏం సాధిద్దామని? తగినంత శక్తి, అంతర్జాతీయ మద్దతు సంపాదించుకుని ఆ తర్వాత వీటో అధికారం సంపాదిస్తే నిజమైన శాంతి కోసం ప్రయత్నిస్తారన్న ఆశయినా ఉంటుంది. ఆర్ధికంగా, రాజకీయంగా పశ్చిమ దేశాలు, వారి కంపెనీల ప్రయోజనాలకు కట్టుబడి పనిచేస్తూ వీటో ఇస్తే ఏదో చేస్తామనడమే పెద్ద జోక్!

5 thoughts on “ప్రశ్న: UNSC శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగం?

  1. Exactly! వీటో అంతటి అప్రజాస్వామిక అధికారం మరొకటుండదు. తొంభైతొమ్మిదిమంది అంగీకరించిన ఒక విధాన నిర్ణయాన్ని ఒక్క దేశం తనకున్న విశేషాధికాల్నుపయోగించి బేదఖలుపరుస్తుందా? అదా ప్రజాస్వామ్యం?

    అదలా ఉంచితే ప్రాన్స్, జర్మనీ లాంటి దేశాలైనా ఒక్కోసారి తప్పిజారి మంచిగా వ్యహరించవచ్చుగానీ (ఇరాక్ యుధ్ధం విషయంలో వ్యవహరించినట్లుగా), అమెరికన్ ఉప్పుకు భారత్ మాత్రం పొరబాట్నకూడా ద్రోహంచెయ్యదు. ఆ ఇచ్చేదేదో ఏ భూటనుకో ఇస్తే ఆ విశేషాధికారాలను కనీసం వాళ్ళ పరిస్థితిని చక్కదిదుకోడానికి వాడుకుంటారు. Let’s hope such a power would not be wasted on a nation that is nothing but a vassalage of USA.

  2. ఐ.రా.స లో1949 నుండి కొసరు ప్రభుత్వమేనాయకత్వం వహిస్తూఉంటే,1971 వరకు పి5 కు అర్ధమేలేదుకదా!!
    1949-71 వరకు ఐ.రా.స లో తైవాన్ ప్రతినిధులు సాధించిన ఘనకార్యాలు ఏమైనా ఉన్నయా?
    సర్,తెలుపగలరు?

  3. ఆర్.ఓ.సి ఒకే ఒక్కసారి వీటో ప్రయోగించింది. మంగోలియాకు ఐరాస సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకోవడానికి. మంగోలియాను కూడా చైనాలో భాగంగా ఆర్.ఓ.సి గుర్తించేది. అందువల్ల ఆ దేశానికి సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకుంది. ఆ తర్వాత సోవియట్ రష్యా మెలికతో ఎప్పటికో గాని మంగోలియాకు సభ్యత్వం దక్కలేదు. మంగోలియాకు సభ్యత్వం ఇవ్వకపోతే ఆఫ్రికాలో నూతనంగా స్వతంత్రం పొందిన దేశాల సభ్యత్వాన్ని అడ్డుకుంటానని సోవియట్ రష్యా మెలిక పెట్టడంతో ఇతర దేశాలు ఆర్.ఓ.సి పై ఒత్తిడి తెచ్చాయి. దానితో ఆర్.ఓ.సి వెనక్కి తగ్గింది.

    ఐరాస స్ధాపించే నాటికి పి.ఆర్.సి (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఏర్పడలేదు. అప్పటికి చైనా అంతా ఒకటే. అప్పటి ప్రతినిధులే పి.ఆర్.సి తర్వాత ఏర్పడ్డ తర్వాత కూడా ఐ.రా.స లో కొనసాగారు. ఆ విధంగా ఆర్.ఓ.సి కి వీటో పవర్ దక్కింది. ఇప్పటికీ ఐరాసలో అసలు చైనా ఏదన్నా వివాదం కొనసాగుతోంది. ఆ వివాదం పునాదిగానే తైవాన్ వివాదాన్ని అమెరికా భౌగోళిక రాజకీయాల్లో ఒక తురుపు ముక్కగా ప్రయోగిస్తూ ఉంటుంది. నీ జుట్టు నా చేతిలో ఉంది సుమా అని పరోక్షంగా హెచ్చరిస్తూ ఉంటుంది.

  4. అసలు ఐరాసలో ప్రజాస్వామ్యం ఉందని అంటే నేను నమ్మను. ఐదు దేశాలు తమ ఇష్టంగా వ్యవహరిస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడిది. కనీసం అమాయకులపై దాడుల్ని ఆపలేని ఐరాస ఎందుకు. అమెరికా, బ్రిటన్‌లకు ఊడిగం చేయడం తప్పా ఇంకే పనిచేయని ఐరాస బదులు భారత్‌ ఆలీన విధానాన్ని ఇంకా ప్రచారంలోకి తీసుకువస్తే బాగుండే ది. కానీ ఏం చేస్తాం పశ్చిమదేశాలకు లొంగిపోయిన భారత పాలకులు ఆలీన విధానానికి స్వస్తి చెప్పారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s