2013లో రేపిస్టుల్లో 95 శాతం బాధితులకు తెలిసినవారే


Crimes against women

ప్రతి 100 మంది రేపిస్టుల్లో 95 మంది బాధితులకు తెలిసినవారేనని జాతీయ నేర నమోదు సంస్ధ (National Crime Record Bureau -NCRB) తెలిపింది. ‘2013లో భారత దేశంలో నేరాలు’ పేరుతో ఎన్‌సి‌ఆర్‌బి నివేదికను విడుదల చేసింది. నివేదికలో మహిళలపై నేరాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలను పొందుపరిచింది.

నివేదిక ప్రకారం అత్యాచార నేరాలకు సంబంధించి ఐ.పి.సి సెక్షన్ 376 కింద 2013 సంవత్సరంలో దేశవ్యాపితంగా 33,707 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 31,807 కేసుల్లో నిందితులందరూ బాధితులకు బాగా తెలిసినవారే. వారిలో కూడా గణనీయమైన సంఖ్యలో సొంత బంధువులే కావడం అత్యంత ఆందోళన కలిగించే విషయం.

మొత్తం అత్యాచారం కేసుల్లో 33.9 శాతం కేసులు పొరుగువారు బాధితులపై నేరాలకు పాల్పడ్డారు. 7.3 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు బంధువులు. సొంత రక్త సంబంధీకులే అభం శుభం ఎరుగని పిల్లలపై అత్యాచారానికి ఒడిగడుతున్నారని నివేదిక తెలిపింది.

పైగా ఇలా రక్త సంబంధీకులే అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు అంతకు ముందు సంవత్సరం కంటే పెరిగిపోయాయి. 2012లో 392 మంది తమ సంబధీకులపై అత్యాచారాలకు పాల్పడ్డారు. 2013లో ఈ సంఖ్య 536 కు పెరిగింది. ఈ కేసుల్లో బాధిత బాలికలు 10 నుండి 18 సం.ల వయసు కలిగినవారు కావడం దిగ్భ్రాంతి కలిగించే విషయం.

దగ్గరి బంధువులు, పొరుగువారు ఆడ పిల్లలపై అత్యాచారం జరగడం అంటే సాంఘిక వ్యవస్ధ మరింతగా పతనం అవుతోందనడానికి సంకేతం అని నిపుణులు భావిస్తున్నారు. “ఇలాంటి పరిస్ధితిని కేవలం చట్టాల వల్లనే నివారించడం సాధ్యం కాదు. సమాజమే గట్టి చొరవ తీసుకోవాల్సి ఉంటుంది” అని హిమాచల ప్రదేశ్ మాజీ గవర్నర్, మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ వి.ఎస్.కోక్జే అన్నారని ది హిందూ తెలిపింది.

డిసెంబర్ 16 తేదీన ఢిల్లీ నగరంలో కదులుతున్న బస్సులో అమానుషమైన అత్యాచారానికి పాల్పడ్డ ఘటన దేశంలో పెద్ద ఎత్తున చర్చను ప్రేరేపించినప్పటికీ పరిస్ధితిలో మార్పు లేకపోగా మరింత విషమించడం ఆందోళన కలిగించే విషయం. రేపిస్టులకు మరణ శిక్ష వేయాలని పార్లమెంటు సభ్యులతో సహా అనేకమంది డిమాండ్ చేశారు. అయితే మహిళా సంఘాలు మాత్రం మరణ శిక్ష వల్ల బాధితుల ప్రాణాలకు అదనపు ప్రమాదం నెలకొనడం తప్ప లాభం లేదని హెచ్చరించారు.

వారి సూచనల ఫలితంగానే మరణ శిక్ష సిఫారసు చేయకుండా జస్టిస్ వర్మ కమిటీ సంయమనం పాటించింది. కానీ పార్లమెంటు మాత్రం కఠినమైన చట్టం పేరుతో మరణ శిక్షను నిర్భయ చట్టంలో పొందుపరిచారు. అయినప్పటికీ సదరు చట్టం నేరాలను అరికట్టకపోగా మహిళా సంఘాలు చెప్పినట్లు అత్యాచార బాధితులను చంపేయ్యడం పెరిగిపోయింది. ఉత్తర ప్రదేశ్ బడౌన్ అత్యాచారం వరకూ అనేక ఘటనలు ఆ సంగతినే రుజువు చేశాయి.

అత్యంత తేలికగా అందుబాటులో ఉన్న బూతు సాహిత్యం, ఆడియో, వీడియోలు నిద్రాణంగా ఉన్న లైంగిక కోరికలను ప్రేరేపించి విచక్షణారహిత ప్రవర్తనకు దోహదం చేస్తున్నాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ లో ఇలాంటివి అందుబాటులోకి రావడం పరిస్ధితిని తీవ్రం చేసిందని వారు చెబుతున్నారు. “తక్షణం కోరిక తీర్చుకోవాలన్న ఈ ఇచ్ఛ వారి మెదళ్ళకు నిరంతరం సంకేతాలు పంపుతూ ఉంటుంది. ఫలితంగా సంబంధిత మహిళ/బాలిక తనపై ఉంచిన నమ్మకాన్ని ఉల్లంఘించడానికి సైతం వారు వెనుదీయరు” అని ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్తను ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది.

కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే అన్నది నిష్టుర సత్యం. అసలు బూతు సాహిత్యం, మీడియా విచ్చలవిడిగా అందుబాటులో ఉండడానికి సహకరిస్తున్న శక్తులు ఏవి? మనిషి వినియోగానికి సంబంధించిన ప్రతి అంశమూ సరుకీకరణ (commodify) కావించి లాభాలు సంపాదించాలనే మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలు లేదా పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్ధలు ఇటువంటి వాతావరణాన్ని పోషిస్తాయన్నది కాదనలేని నిజం.

కొకైన్ లాంటి మత్తు మందు వ్యాపారాన్ని కూడా జి.డి.పి లో లెక్కించేందుకు సిద్ధమైన మార్కెట్ ఎకానమీ దేశాలు ఈ నిజాన్ని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. బాధితులకే రక్షణ అన్న పేరుతో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసిన దేశాలే ఇప్పుడు మత్తుమందుల తయారీ, అమ్మకాలను చట్టబద్ధం చేస్తున్నాయి. ఇటువంటి దుర్మార్గపు వ్యవస్ధలు త్వరలో మాఫియా రాజ్యాలను చట్టబద్ధ వ్యవస్ధలుగా గుర్తించినా ఆశ్చర్యం లేదు. సరిగ్గా ఇలాంటి శక్తులే సమాజంలో అత్యాచార నేరాలు జరగడానికి కావలసిన పరిస్ధితులను సృష్టిస్తున్నాయి.

అత్యాచార నేరాన్ని అప్పటికప్పుడు జరిగిన ఒంటరి ఘటనగా చూడడానికి బదులు విశాల సామాజిక దృక్పధం నుండి పరికించే చూపు మెజారిటీ జనానికి కరువయింది. ఫలితంగా బాధితుల తరపున తామే ప్రతీకారం తీర్చుకునే మైండ్ సెట్ తో నేరస్ధులను అప్పటికప్పుడు ఉరి తీయాలనీ, బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవేవీ సమస్యను పరిష్కరించలేవని ఎన్.సి.ఆర్.బి నివేదిక నిర్ద్వంద్వంగా రుజువు చేస్తోంది.

వ్యాఖ్యానించండి