డి.ఎం.కె కోసం అవినీతి జడ్జిని యు.పి.ఏ పొడిగించింది -కట్జు


Justice Katju

యు.పి.ఏ హయాంలో ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ గా నియమితుడయిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు కేంద్ర ప్రభుత్వం మార్పుతో కొత్త ప్రభుత్వాన్ని కాకా పట్టే పనిలో పడ్డారా? ఎప్పుడో పదేళ్ళ నాటి జడ్జి నియామకపు అవకతవకల్ని ఆయన ఇప్పుడు తవ్వి తీస్తుండడంతో ఈ అనుమానం కలుగుతోంది. డి.ఎం.కె ఒత్తిడికి లొంగిన యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి జడ్జికి మూడుసార్లు పొడిగింపు ఇచ్చిందని కట్జు తాజాగా ఆరోపించారు. పనిలో పనిగా తాజా తమిళనాడు ముఖ్యమంత్రి ఏనాడూ కోర్టు విధుల్లో జోక్యం చేసుకోలేదని ఆయన ఓ సర్టిఫికేట్ పడేశారు.

యు.పి.ఏ ఒత్తిడికి లొంగి, ముగ్గురు సుప్రీం చీఫ్ జస్టిస్ లు సదరు అవినీతి జడ్జికి పొడిగింపు ఇచ్చారని కట్జు ఆరోపించారు. తమిళనాడు హై కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న సదరు అవినీతి జడ్జిపై పలు ఆరోపణలు ఉన్నాయని అయినప్పటికీ మూడు సార్లు పదవీ పొడిగింపు పొందాడని ఆయన తెలిపారు. జస్టిస్ ఆర్.సి.లహోటి, జస్టిస్ వై.కె.సబర్వాల్, జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ కేంద్రం ఒత్తిడికి లొంగి అవినీతి జడ్జి పదవీ కాలాన్ని పొడిగించారని తెలిపారు.

“ఈ ముగ్గురు ప్రధాన న్యాయ మూర్తులు అసంబద్ధ రీతిలో రాజీలకు పాల్పడ్డారు. జస్టిస్ లోహిత్ దానిని ప్రారంభించగా జస్టిస్ సబర్వాల్, ఆ తర్వాత జస్టిస్ బాల కృష్ణన్ పొడిగించారు. ఈ ముగ్గురు చీఫ్ జస్టిస్ లు లొంగుబాటుకు గురయినవారు. రాజకీయ ఒత్తిళ్లకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లొంగుతారా లేదా?” అని జస్టిస్ మార్కండేయ కట్జు ప్రశ్నించారు. నవంబర్ 2004లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయిన జస్టిస్ కట్జు తన హయాంలో తాను పొందిన అనుభవాలను వరుసగా వెల్లడిస్తానని ఈ సందర్భంగా చెప్పారు.

అడిషనల్ జడ్జి పైన తనకు అనేక ఫిర్యాదులు అందాయని కట్జు తెలిపారు. అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తనకు పలు ఫిర్యాదులు అందడంతో ఆందోళన చెంది ఆయనపై ఇంటలిజెన్స్ బ్యూరో చేత రహస్య విచారణ జరిపించాలని అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ లహోటికి విన్నవించానని తెలిపారు. జడ్జిపై వచ్చిన ఆరోపణలు నిజమే నంటూ ఐ.బి. నివేదిక ఇచ్చిందని, ఆయనను వెంటనే తొలగించాలని కూడా సిఫారసు చేసిందని కట్జు తెలిపారు.

అడిషనల్ జడ్జిగా 2 సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని, అది ముగింపుకు వస్తున్నందున ఐ.బి. నివేదిక నేపధ్యంలో ఆయనకు ఇక పొడిగింపు ఇవ్వరని తాను భావించారని కట్జు చెప్పారు. “కానీ నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఒకపక్క ప్రతికూల ఐ.బి. నివేదిక ఉండగానే ఆయనకు మరో పొడిగింపు ఇచ్చారని తెలిసింది” అని ఆయన చెప్పారు.

దీనంతటికీ కారణం యు.పి.ఏ-1 ప్రభుత్వంపై తమిళనాడులోని ఒక పార్టీ తీవ్ర స్ధాయిలో ఒత్తిడి తేవడమే నాని తనకు ఆ తర్వాత తెలిసిందని కట్జు వెల్లడించారు. యు.పి.ఏ ప్రభుత్వం మనుగడ తన మిత్రపక్షాలపై ఆధారపడి ఉండడంతో తమిళనాడు లోని తన మిత్రపక్ష పార్టీ ఒత్తిడికి లొంగిపోయినట్లు తెలిసిందన్నారు. వాస్తవానికి అడిషనల్ జడ్జి శాశ్వత జడ్జి కాదని ఆయన నియామకం రూఢి (confirm) అయితే కావచ్చు, కాకపోనూ వచ్చని, కానీ రాజకీయ పార్టీ అండతో ఆయన రూఢీకరణ పొందారని చెప్పారు.

“మొదట ఒక సం. పాటు పొడిగింపు ఇచ్చారు. ఆ తర్వాత రెండేళ్ల పొడిగింపు ఇచ్చారు. దీనిని ఎటువంటి సమర్ధనీయ కారణమూ లేదు. సం. పొడిగింపు ఇచ్చిన జస్టిస్ లహోటి అనంతరం రిటైర్ అయ్యారు. జస్టిస్ సబర్వాల్ కూడా రెండేళ్లు పొడిగింపు ఇచ్చి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత జస్టిస్ బాలకృష్ణన్ ఆయనను శాశ్వత జడ్జిగా నిర్ధారించారు. అయితే మరో హై కోర్టుకు ఆయనను బదిలీ చేశారు” అని కట్జు తెలిపారు.

డి.ఎం.కె, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ల మధ్య నడించిన మంత్రాంగాన్ని కూడా జస్టిస్ కట్జు వెల్లడి చేశారు. జడ్జి పొడిగింపుకు తాను అభ్యంతరం చెప్పడంతో తనకు ఆ సంగతులు తెలిసాయని చెప్పారు. “ఆ సమయంలో న్యూయార్క్ లో జరుగుతున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని మన్మోహన్ బయలుదేరి వెళ్తున్నారు. ఆయన విమానాశ్రయంలో ఉండగా తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రులు ఆయన్ని కలిశారు. న్యూయార్క్ నుండి తిరిగి వచ్చేనాటికి కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుందని ఆ మంత్రులు ఆయనను హెచ్చరించారు. దానితో మన్మోహన్ ఆందోళన చెందారు. ఒక సీనియర్ కాంగ్రెస్ మంత్రి ప్రధానిని ఆందోళన చెందవద్దని నచ్చజెప్పారు. తాను అన్నీ దగ్గరుండి చూసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఆయన జస్టిస్ లహోటిని కలిశారు. అడిషనల్ జడ్జికి పొడిగింపు ఇవ్వకపోతే ‘సంక్షోభం’ సంభవిస్తుందని చెప్పారు” అని జస్టిస్ కట్జు తెలిపారు.

ఫలితంగా అడిషనల్ జడ్జికి పొడిగింపు ఇస్తూ జస్టిస్ లహోటి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. ఆ విధంగా అవినీతి జడ్జికి పొడిగింపు ఇచ్చారని జస్టిస్ లహోటి ఈ నిర్ణయానికి ముందు తన సహచర కొలీజియమ్ సభ్యులతో సంప్రదించారా లేదా తనకు తెలియదని కట్జు తెలిపారు.

ఇన్నాళ్లూ ఆగి ఇప్పుడేందుకు వెల్లడి చేస్తున్నారని విలేఖరులు ప్రశ్నించగా అది అప్రస్తుతం అని జస్టిస్ కట్జు దాటవేశారు. జస్టిస్ కట్జు వెల్లడిని సుప్రీం లాయర్ రామ్ జేఠ్మలాని సమర్ధించగా కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మాజీ న్యాయ మంత్రి వీరప్ప మొయిలీ తనకు జస్టిస్ కట్జుపైన గౌరవం ఉందని కానీ ఆయన ఇప్పుడేందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. పదవిలో ఉండగానే చెప్పినట్లయితే చర్యలు తీసుకునేవారు కదా అని ప్రశ్నించారు.

డి.ఎం.కె పార్టీని పరోక్షంగా తప్పు పట్టిన జస్టిస్ కట్జు జయలలితను ఆకాశానికి ఎత్తారు. ఆనాటి ముఖ్యమంత్రిగా జయలలిత ఎన్నడూ న్యాయ వ్యవస్ధ జోలికి రాలేదని చెప్పారు. “జయలలిత గారి గురించి నేను చెప్పి తీరాలి. జడ్జిల నియామకంలో ఆమె ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. ఫలానా వ్యక్తిని జడ్జిగా నియమించాలని ఆమె ఎన్నడూ నన్ను కోరలేదు. న్యాయ వ్యవస్ధ పనిలో కూడా ఆమె ఎన్నడూ కలుగజేసుకోలేదు. ఆమె న్యాయ వ్యవస్ధ స్వతంత్రతను గౌరవించడంతో మద్రాస్ హై కోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నన్నాళ్లూ నాకు ఏ సమస్యా రాలేదు” అని జస్టిస్ కట్జు చెప్పారు.

“కానీ జడ్జిగా నియమించడానికి తగరని నేను భావించిన వ్యక్తులను నియమించాలని తమిళనాడులోని మరో రాజకీయ పార్టీ (డి.ఏం.కె) నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. వారిలో కొందరు ఏనాడూ కోర్టుకు వచ్చిన పాపాన పోలేదు. అయినప్పటికీ మద్రాస్ హై కోర్టును తన మనుషులతో నింపేయాలని ఆ పార్టీ సంకల్పించి ఒత్తిడిలు తెచ్చింది. కానీ నేను వాటికి లొంగలేదు. నేను సిఫారసు చేసిన 20 మందిలో 17 మంది జడ్జిలుగా నియమించారు. ఈ నియామకాలను అడ్డుకోవడానికి డి.ఏం.కె తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి లార్స్ అసోసియేషన్ ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం, సుప్రీం కోర్టు సైతం ఆదేశాలు ఇవ్వడంతో వారు జడ్జిలుగా నియమితులయ్యారు” అని జస్టిస్ కట్జు వెల్లడి చేశారు.

అడిషనల్ జడ్జిగా నియమితులయిన సదరు జడ్జి ఒక డి.ఏం.కె నేతకు అంతకు ముందు బెయిల్ ఇవ్వడం వలన ఆ పార్టీ ఆయనకు మద్దతుగా వచ్చిందని పత్రికలు సీచించాయి. జస్టిస్ కట్జు వెల్లడిపై పార్లమెంటు సభల్లో అలజడి చెలరేగింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేశాయి.

వ్యాఖ్యానించండి