ఇజ్రాయెల్ వ్యతిరేక వార్త, అమెరికా విలేఖరుల తొలగింపు


Ayman Mohyeldin

Ayman Mohyeldin

గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష యుద్ధానికి సంబంధించి వాస్తవ వార్త ప్రసారం చేసినందుకు పశ్చిమ వార్తా సంస్ధలు తమ విలేఖరులను తప్పించాయి. ఒక వార్తా సంస్ధ విలేఖరిని ఇంటికే పంపిస్తే మరో వార్తా సంస్ధ న్యూస్ ప్రజెంటర్ ను తప్పించి ఇతర బాధ్యతలకు బదిలీ చేసింది. ఆ రెండు వార్తా సంస్ధలు సాదా సీదావి కావు. భారీ కార్పొరేట్ వార్తా సంస్ధలు. ప్రజాస్వామ్య సంస్ధాపన కోసం అమెరికా చేసే అడ్డపైన పనుల్ని నెత్తిన పెట్టుకుని మోసే కంపెనీలు.

రెండింటిలో ఒకటి ఎన్.బి.సి వార్తా సంస్ధ. ఈజిప్టులో పుట్టి అమెరికాలో స్ధిరపడిన ఐమన్ మోహిల్దిన్ ఎన్.బి.సిలో పని చేస్తున్నాడు. ఆయనకు విలేఖరిగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. 2008-2009లో ఇప్పటివలే ఇజ్రాయెల్ గాజాపై హంతక దాడి చేసిన సందర్భంగా యుద్ధ క్షేత్రం నుండి (అనగా గాజా నుండి) ఎప్పటికప్పుడు వార్తలు కవర్ చేసినందుకు ఆయనకు అవార్డు కూడా వచ్చింది. ఈజిప్టు-గాజా మధ్య పాలస్తీనా ప్రజలు వినియోగించే భూగర్భ సొరంగాలపైన ఆయన విస్తృతంగా రిపోర్ట్ చేశారు. సద్దాం హుస్సేన్ ఉరితీత, ఈజిప్టులో చెలరేగిన సో కాల్డ్ అరబ్ విప్లవం, తదితర ఘర్షణలపైన ఆయన ఆల్ జజీరా ఇంగ్లీష్, సి.ఎన్.ఎన్, ఎన్.బి.సి సంస్ధల కోసం పని చేశారు.

గత జులై 16 తేదీన గాజా బీచ్ లో ఫుట్ బాల్, దాగుడు మూతలు (హైడ్ అండ్ సీక్), ఆటలు ఆడుకుంటున్న నలుగురు పిల్లలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసి మరీ చంపేసింది. బీచ్ ఒడ్డునే ఉన్న ఒక హోటల్ లో అంతర్జాతీయ వార్తా సంస్ధల విలేఖరులు బస చేసి ఉన్నారు. ఇజ్రాయెలీ గన్ బోట్లు చేసిన మిసైల్ దాడిని ప్రత్యక్షంగా చూసిన అయిమన్ మొహిల్దిన్ ఈ హత్యలపై రిపోర్టు చేశాడు. ఇజ్రాయెల్ చెప్పినట్లు మిసైల్ దాడి జరిగిన చోట హమాస్ మిలిటెంట్ల స్ధావరం ఉన్నట్లుగానీ, మిలిటెంట్లు ఉన్నట్లు గానీ ఎటువంటి సాక్ష్యం లేదని ఐమన్ వెల్లడించాడు.

గాజా నుండి నేరుగా రిపోర్ట్ చేసినప్పటికీ ఐమన్ ఇచ్చిన సమాచారం అమెరికాకు బదులు టెల్ అవీవ్ (ఇజ్రాయెల్ రాజధాని) నుండి ఎన్.బి.సి ఛానెల్ లో ప్రసారం అయింది. దానితో ఐమన్ తన సమాచారాన్ని ట్విట్టర్ లో వరుస ట్వీట్ ల ద్వారా పోస్ట్ చేశాడు. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు హృదయ విదారకంగా దుఃఖిస్తున్న దృశ్యాలను వీడియో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు. “ఇజ్రాయెల్, వైమానిక దాడితో మా హోటల్ పక్కనే ఆడుకుంటున్న నలుగురు పాలస్తీనా పిల్లలను చంపేసింది. వారు చనిపోవడానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు నేను వారితో బంతిని తన్ని ఆడుకున్నాను” అని ఆయన పోస్ట్ చేసిన ఒక ట్వీట్ పేర్కొంది.

మరో ట్వీట్ లో ఆయన అమెరికా విదేశాంగ శాఖ చేసిన ప్రకటన విశ్వసనీయతను ప్రశ్నించాడు. “ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు, నలుగురు పిల్లల హత్యలకు కాల్పుల విరమణకు అంగీకరించని హమాస్ దే అంతిమ బాధ్యత అని అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇంతకు ముందే చెప్పారు. ఆ పిల్లలు 9-11 సం.ల మధ్య వయసు ఉన్న కజిన్ సోదరులు. ఈ ప్రకటన విశ్వసనీయత గురించి మీలో మీరే చర్చించుకోండి” అని ఆయన ట్వీట్ పేర్కొంది.

ట్వీట్ లు పోస్ట్ చేసిన అనంతరం మొహిల్డిన్ ను గాజా రిపోర్టింగ్ నుండి ఎన్.బి.సి తప్పించింది. ఆయనకు బదులుగా ఆయన వార్తా నివేదికను టెల్ అవీవ్ నుండి ప్రసారం చేసిన కరెస్పాండెంట్ రిచర్డ్ ఎంగెల్ ని నియమించింది. ఈ తొలగింపును స్వతంత్ర వార్తా సంస్ధలు తీవ్రంగా నిరసించాయి. ఐమన్ ను ఎందుకు తొలగించారో చెప్పాలని ఎన్.బి.సి యాజమాన్యాన్ని నిలదీసాయి. విమర్శలకు ఎన్.బి.సి సమాధానం ఏమీ ఇవ్వలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయింది.

అమెరికన్ ఎన్.ఎస్.ఏ ఇంటర్నెట్ గూఢచర్యాన్ని వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్ తో పని చేస్తున్న మరో అమెరికన్ గ్లెన్ గ్రీన్ వాల్డ్  ఐమన్ తొలగింపుకు కారణాలు చెప్పాడు. ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ ఆపరేషన్ పైన ఐమన్ మొదటి నుండి విమర్శనాయుతంగా వార్తలు నివేదించారని ఆయన వార్తలను అమెరికాలోని యూదు అనుకూల మితవాద గ్రూపులు, యూదు లాబీలు పదే పదే ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆయనను హమాస్ ప్రతినిధిగా నిందించారని చెప్పాడు. 17 లక్షల మంది గాజన్లు ఎటూ పోవడానికి వీలు లేని పరిస్ధితుల్లో ఉన్నప్పటికీ బాంబులతో మోదడం ద్వారా ఉమ్మడి శిక్షను అమలు చేస్తున్నారని ఐమన్ వ్యాఖ్యానించిన తర్వాత ఎన్.బి.సి పై ఒత్తిడి పెరిగిందని దానికి తాజా రిపోర్టింగ్ తోడు కావడంతో తొలగించారని గ్లెన్ గ్రీన్ వాల్డ్ వెల్లడి చేశాడు.

Diana Magnay

Diana Magnay

ఇజ్రాయెల్ విధులనుండి తప్పించబడిన మరో విలేఖరి డయానా మాగ్నే. ఆమె సి.ఎన్.ఎన్ లో పని చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడిని కవర్ చేయడానికి నియమించబడిన డయానాను జులై 18 తేదీన ఇజ్రాయెల్ విధుల నుండి తప్పించి మాస్కోకు బదిలీ చేశారు. గాజాపై బాంబు దాడులను ఉత్సాహంతో తిలకిస్తూ సంతోషాతిరేకాలు ప్రకటిస్తున్న ఇజ్రాయెలీయులను స్కం (తుచ్ఛులు) అని పేర్కొంటూ ట్వీట్ చేయడమే ఆమె చేసిన తప్పు. “గాజాలో బాంబుల మోగుతుంటే స్డెరోట్ కొండపైన ఉన్న వాళ్ళు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. నేను ఒక్క మాట తప్పు అన్నా నా కారును నాశనం చేస్తామని వదరుతున్నారు. తుచ్ఛులు” అని ఆమె తన ట్వీట్ లో పేర్కొంది.

సదరు ట్వీట్ ను సి.ఎన్.ఎన్ వెంటనే తొలగించి క్షమాపణలు చెప్పుకుంది. ఆమె ట్వీట్ లకు క్షమాపణ చెప్పడం ద్వారా తాము డయానాను ఎందుకు బదిలీ చేశామో సి.ఎన్.ఎన్ యాజమాన్యం స్పష్టం చేసింది. కాబట్టి బదిలీకి ప్రత్యేక వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది.

పశ్చిమ పత్రికలు గాజాపై జరుగుతున్న అమానుష దాడిని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాయో ఈ ఇద్దరు విలేఖరుల పరిస్ధితి చెబుతుంది. ఇజ్రాయెల్ ఏకపక్ష దాడిని “ఆత్మ రక్షణ చేసుకునేందుకు ఆ దేశానికి గల సహజ హక్కు”గా అమెరికా నిస్సిగ్గుగా సమర్ధిస్తోంది. ఇజ్రాయెల్ అనుకూల వైఖరికి ఏ మాత్రం వ్యతిరేకంగా ఉన్నా, వారు విలేఖరులుగా పశ్చిమ వార్తా సంస్ధలకు అవసరం లేదు. ఎందుకంటే మధ్య ప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలను కాపాడేది ఇజ్రాయెలే. చమురు కోసం ఎన్ని ప్రాణాలు గల్లంతయినా, సామూహిక హత్యలకు పాల్పడినా అది న్యాయబద్ధమే అని అమెరికా అవగాహన. అమెరికా విదేశాంగ విధానాన్ని ద్వేషించడానికి ఇంకా వివరణ కావాలా?

2 thoughts on “ఇజ్రాయెల్ వ్యతిరేక వార్త, అమెరికా విలేఖరుల తొలగింపు

  1. ఆ పిల్లలు 9-11 సం.ల మధ్య వయసు ఉన్న కజిన్ సోదరులు
    కజిన్ సోదరులు అనేది కరక్ట్ యూసేజ్ ఏనా?

  2. “Cousin siblings” is not correct usage. ఇందియాలో కజిన్ మేరేజెస్ నిషిద్ధం కనుక ఇక్కడ కజిన్స్‌ని కూడా సిబ్లింగ్స్‌ని చూసినట్టు చూస్తారు. విదేశీయులకి ఆ పట్టింపులు ఉండవు.

వ్యాఖ్యానించండి