అసమానుల తగాదా: నిస్పక్షపాతమూ పక్షపాతమే -కార్టూన్


Both are friends

ఓహ్… ఇద్దరూ మనకు మిత్రులే కదా!

***

పోటీ అన్నది ఎప్పుడూ సమానుల మధ్య జరగడమే న్యాయం. ఆటలో ఒక పక్షం తొండాట ఆడుతున్నారని తెలిసీ నిస్పక్షపాతం అంటూ గిరి గీసుకు కూర్చుంటే అది చివరికి తొండాటకు మద్దతుగా తేలుతుంది. ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమం విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇలాగే ఉంది.

ఇజ్రాయెల్ అన్ని విధాలుగా బలీయమైన రాజ్యం. అనేక దశాబ్దాలుగా అమెరికా, ఐరోపాల పోషణలో ఉన్న ఇజ్రాయెల్ మధ్య ప్రాచ్యంలో భారీ మిలట్రీ శక్తి. అరబ్బు రాజ్యాల చమురు సంపదలపై నియంత్రణ సాధించడానికి బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలు కుట్ర చేసి పాలస్తీనా భూభాగాలను లాక్కుని ఇజ్రాయెల్ రాజ్యాన్ని నెలకొల్పాయి.

ఇజ్రాయెల్ స్ధాపించింది లగాయితు ఆ దేశం చెయ్యని గూండాయిజం లేదు. అంతర్జాతీయ చట్టాలను, తీర్మానాలను పచ్చిగా ఉల్లంఘించడమే ఇజ్రాయెల్ విదేశాంగ విధానం. ఇస్లామిక్ ఉగ్రవాదం నిరంతరం ప్రపంచ వ్యాపితంగా కార్యకర్తలను సంపాదించడానికి ప్రధాన కారణం పాలస్తీనాను ఆక్రమించి ఇజ్రాయెల్ కు అప్పగించడం.

తమ సొంత ప్రయోజనాలు ఉన్నందునే ఇజ్రాయెల్ ఏం చేసినా చెల్లుబాటు చేయడంలో అమెరికా, పశ్చిమ రాజ్యాలు వెనకేసుకొచ్చాయి. పాలస్తీనా ప్రజలపై అది సాగించే అణచివేత, అక్రమ అరెస్టులు, హత్యలు, యుద్ధ నేరాలు ఐరాసలో చర్చ జరిగినప్పుడు వీటో అధికారం ప్రయోగించి తీర్మానాలు అమలు కాకుండా అడ్డుకున్నాయి.

గాజా ఒక చిన్న ప్రాంతం వెస్ట్ బ్యాంక్ కాకుండా పాలస్తీనీయులు నివసించే రెండో భూభాగం అది. కేవలం 40 కి.మీ పొడవు, 10 కి.మీ వెడల్పు ఉండే గాజాలో 17 లక్షలమంది నివసిస్తున్నారు. 2006లో అక్కడ ఫతాను ఓడించి హమాస్ ప్రభుత్వం ఏర్పరిచ్చినప్పటి నుండి గాజాపై దాడులను ఇజ్రాయెల్ మరింత తీవ్రం చేసింది.

యాసర్ అరాఫత్ నేతృత్వంలో ఫతాకు, పాలస్తీనా పోరాటానికి ప్రపంచ వ్యాపిత మద్దతు రావడంతో దానికి విరుగుడుగా హమాస్ ను పశ్చిమ రాజ్యాలు రంగం మీదికి తెచ్చాయి. క్రమంగా హమాస్ ను ఉగ్రవాద సంస్ధగా ముద్ర వేసి ఆ పేరుతో పాలస్తీనా ప్రజల పోరాటాన్ని నెత్తురుటేరుల్లో ముంచడం ప్రారంభించింది ఇజ్రాయెల్.

ఇజ్రాయెల్ కు అమెరికా క్రమం తప్పకుండా మిలట్రీ సాయం అందిస్తుంది. ద్రవ్య సహాయమూ చేస్తుంది. అత్యంత ఆధునిక ఆయుధాలను సరఫరా చేసి శక్తివంతమైన రాజ్యంగా తయారు చేసింది. అమెరికాకు తెలియకుండా సొంతగా అణ్వస్త్రాలను సైతం ఇజ్రాయెల్ తయారు చేసుకుంది. ఇజ్రాయెల్ అణు పరిశ్రమను ఐ.ఏ.ఇ.ఏ చేత తనీఖి చేయాలని సంకల్పించినందునే అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్.కెన్నడి హత్యకు గురయ్యారని ఎవరూ చెప్పడానికి ఇష్టపడని రహస్యం.

హమాస్ ఆధీనంలో ఉన్న గాజాకు ఎలాంటి సరుకులు అందకుండా ఇజ్రాయెల్ దిగ్బంధనం కావించింది. దానితో ఈజిప్టుకు సొరంగాలు తవ్వి వాటి ద్వారా సరుకులు తెప్పించుకుంటారు గాజా ప్రజలు. అనేకమార్లు గాజాపై బాంబులు కురిపించి ఇళ్ళు, ప్రభుత్వ భవనాలను నేలమట్టం చేసే ఇజ్రాయెల్ వాటిని పునర్నిర్మించుకునే అవకాశం కూడా ఇవ్వదు. సిమెంటు, ఇటుకలు తదితర నిర్మాణ సామాగ్రి అందకుండా అడ్డుపడుతుంది. గాజాకు చట్టబద్ధంగా జరిగే ఏకైక సరుకు వాణిజ్యం ఐరాస సహాయం. ఈ సహాయాన్ని కూడా నఖశిఖ పర్యంతం తనిఖీ చేసి గాని ఇజ్రాయెల్ అనుమతించదు. ఈ పరిస్ధితిని నివారించడానికి ఐరాస ఎన్నో తీర్మానాలు చేసింది. అవి అమలు కాకుండా అమెరికా వీటో ప్రయోగించడంతో గాజా ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా అవతరించింది.

ఈ నేపధ్యంలో ముగ్గురు ఇజ్రాయేలీయుల కిడ్నాప్, హత్యలను సాకుగా చూపిస్తూ ఇజ్రాయెల్ గత పది రోజులుగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అటు ఇజ్రాయెల్ ను గానీ, ఇటు హమాస్ ను గానీ సంప్రదించకుండా ఈజిప్టు ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదిస్తే దాన్ని ఇజ్రాయెల్ ఆమోదించింది. ఎందుకంటే ఈజిప్టు సైనిక ప్రభుత్వం అమెరికా-ఇజ్రాయెల్ లకు నమ్మినబంటు.

తమతో మాటమాత్రం చెప్పకుండా పూర్తిగా లొంగుబాటుకు గురయ్యేలా తయారు చేసిన ఒప్పందాన్ని హమాస్ తిరస్కరించింది. నిజానికి ఈ ఒప్పందం ఇజ్రాయెల్ పన్నిన ఎత్తుగడ. గాజా ప్రభుత్వంతో సంబంధం లేకుండా విషమ షరతులతో ఒప్పందం తయారు చేయించి దానిని అంగీకరించలేదని చెబుతూ భూతల యుద్ధానికి ఇజ్రాయెల్ తెగబడింది. భూతల యుద్ధానికి సాకుకోసం తయారు చేసిన ఒప్పందమే ఈజిప్టు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం.

గాజా ప్రజలకు జీవితమే నిత్య పోరాటం. బతకాలంటే వారు పోరాటం చేయాల్సిందే. లేదా ఆకలికి మాడి చావాలి. గూడు, నీడ లేక చావాలి. వారికి ఇజ్రాయెల్ తో సంధి/శాంతి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. శాంతి ఉంటే ఒకరకమైన అణచివేత, యుద్ధం అయితే మరో విధమైన అణచివేత.

ఈ పరిస్ధితుల్లో గాజాపై అమానుష దాడి జరుగుతుంటే… ఇద్దరూ మిత్రులే గనక ఎవరినీ ఖండించను, సమర్ధించను అని నీతులు వల్లిస్తే ఏమిటి అర్ధం? ఇజ్రాయెల్ రాజ్యం పట్ల హిందూత్వ సంస్ధలు ప్రదర్శించే సానుకూలత రహస్యం ఏమీ కాదు. ప్రభుత్వంగా ఆ మాట చెప్పలేక నిస్పక్షపాతం పేరుతో ఆచరణలో ఇజ్రాయెల్ కే భారత ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.

అయినా, అసమ న్యాయానికి అలవాటు పడ్డవారు బలహీనుల పక్షం వహించకపోడం ఏమన్నా కొత్త సంగతి అయితే గదా!

2 thoughts on “అసమానుల తగాదా: నిస్పక్షపాతమూ పక్షపాతమే -కార్టూన్

  1. ఇజ్రాయెల్ రాజ్యం పట్ల హిందూత్వ సంస్ధలు ప్రదర్శించే సానుకూలత రహస్యం ఏమీ కాదు
    సర్,దీనర్ధం శతృవుకు శతృవు మితృడనా? లేక ఇంకేమైనా ఉన్నదా?

వ్యాఖ్యానించండి