అణు ఒప్పందం పురోగతిపై అమెరికా నిస్పృహ!?


Nisha Biswal

Nisha Biswal

2008లో ఇండియా, అమెరికాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం ఎటువంటి పురోగతి లేకుండా స్తంభించిపోవడం పట్ల అమెరికా నిస్పృహగా ఉందిట. అంతర్జాతీయ అణు ఏకాకితనం నుండి ఇండియాను బైటపడేసినా అమెరికాకు ఇంతవరకూ పైసా ప్రయోజనం లేకపోవడం అమెరికా నిస్పృహకు కారణం. కానీ ఈ వ్యవహారంలో దోషులు ఎవరన్న విషయంలో అమెరికా అమాయకత్వం నటించడమే ఆశ్చర్యకరం.

అణు రియాక్టర్, తదితర అణు పరికరాలు లోప భూయిష్టమైనవి సరఫరా చేసినందువల్ల అణు ప్రమాదం సంభావిస్తే అందుకు ఆ పరికరాలు అమ్మిన కంపెనీ నుండి నష్టపరిహారం వసూలు చేయాలని భారత పార్లమెంటు చట్టం ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం అణు ప్రమాదం దరిమిలా వసూలు చేసే నష్టపరిహారం గరిష్టంగా రు. 1500 కోట్లు మాత్రమే. మిగిలినదంతా ఆపరేటర్ (భారత కంపెనీ) చెల్లించాలి.

ఈ మాత్రం పరిహారం చెల్లించడానికి కూడా అమెరికా కంపెనీలు ఒప్పుకోవడం లేదు. అమెరికా కంపెనీలను ఈ చట్టం నుండి మినహాయించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అమెరికా డిమాండ్ మేరకు పార్లమెంటు ఆమోదించిన చట్టంలో మార్పులు చేయడానికి మన పాలకులకు అభ్యంతరం అయితే లేదు గానీ ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారు.

ఫలితంగా అమెరికా కోరిన మినహాయింపు ఇవ్వడానికి యు.పి.ఏ ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఎన్.డి.ఏ ప్రభుత్వం అయినా ఈ అడ్డంకిని తొలగిస్తుందని అమెరికా ఆధికారులు ఆశిస్తున్నట్లు ఆ దేశ అధికారుల మధ్య జరుగుతున్నా చర్చల ద్వారా తెలుస్తోంది.

ఉదాహరణకి భారత నూతన ప్రభుత్వంతో ఇటీవల చర్చలు జరిపి వెళ్ళిన ఇద్దరు అధికారుల మధ్య జరిగిన చర్చలను పరిగణించవచ్చు. అమెరికా ఉప విదేశీ మంత్రి (అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్) నిశా బిశ్వాల్, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీకి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. రిపబ్లికన్ పార్టీ సీనియర్ సెనేటర్ జాన్ మెక్ కెయిన్ ఈ సందర్భంగా భారత్ తో కుదుర్చుకున్న అణు ఒప్పందం గురించి నిషా బిశ్వాల్ ను నిలదీశారు.

ప్రధాన మంత్రి మోడి, ఇతర భారత నాయకులు ఆఫ్ఘన్ నుండి అమెరికా సైన్యాలను పూర్తిగా ఉపసంహరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారని సమావేశంలో చెప్పిన మెక్ కెయిన్, భారత అణు పరిహార చట్టం నేపధ్యంలో ఇండియా-అమెరికా వ్యూహాత్మక అణు ఒప్పందం పురోగతి గురించి ఆరా తీశారు. ఒప్పందం అనంతరం కూడా వ్యాపారం జరగకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.

దానికి సమాధానం ఇస్తూ నిషా బిశ్వాల్ “గత ఆరేళ్లుగా ఎలాంటి పురోగతి లేకపోవడంపై మీ నిస్పృహను మేము కూడా పంచుకుంటున్నాము. గత ప్రభుత్వం హయాంలో కాస్త పురోగతిని సాధించాం. నూతన ప్రభుత్వం హయాంలో మరింత విస్తృతమైన పురోగతి ఉండగల అవకాశాలను మేము చూస్తున్నాం” అని నిషా తెలిపారు. అణు పరిహార చట్టాన్ని మొత్తంగా రద్దు చేయడం గానీ లేదా అమెరికా కంపెనీలను చట్టం నుండి మినహాయింపు ఇవ్వడం గానీ మాత్రమే అమెరికా దృష్టిలో పురోగతి. ఇలాంటి పురోగతి నూతన ప్రభుత్వం హయాంలో ఉంటుందని అమెరికా ప్రభుత్వం ఆశిస్తున్న విషయాన్ని నిషా బిశ్వాల్ చెబుతున్నారు. ఆమె ఒక విడత ఇప్పటికే ఇండియా పర్యటించి వెళ్లినందున ఆమె ఆశలకు ఆధారం ఏమిటో గ్రహించవచ్చు.

మోడి ప్రభుత్వంతో వివరమైన చర్చలు ఇంకా జరగనప్పటికీ అమెరికా కంపెనీల ఆందోళన తీర్చడానికి తగిన ప్రయత్నాలు జరుగుతాయన్న ఆశాభావాన్ని నిషా వ్యక్తం చేశారు. “అణు పరిహార సమస్యలకు సంబంధించి కొన్ని మార్గాలు తెరుచుకోవచ్చని మేము భావిస్తున్నాం. చట్టపరమైన నిర్మాణం (లీగల్ ఫ్రేమ్ వర్క్) ద్వారా గాని లేదా ఇతర అవకాశాల ద్వారా గానీ మరింత స్పష్టత వస్తుందని, తద్వారా అమెరికా కంపెనీలు అపరిమిత పరిహారం చెల్లించవలసి వస్తుందేమోనన్న అనుమానాలు నివృత్తి అవుతాయని భావిస్తున్నాం” అని నిషా బిశ్వాల్ తెలిపారు.

అమెరికా-ఇండియాల మధ్య రక్షణ సహకారం ఇప్పటికే వెనక్కి వెళ్లలేని స్ధితికి చేరుకుందని రక్షణ శాఖ ఉప కార్యదర్శి అమీ సీ రైట్ సమావేశంలో చెప్పడం గమనార్హం. అమెరికా సహకారం అంటే పెత్తనం. స్నేహం అంటే దృత రాష్ట్ర కౌగిలి. అలాంటి స్నేహ, సహకారాలు ఇక వెనక్కి వెళ్లలేని స్ధితికి చేరాయంటే ఇండియా ఏ స్ధానంలో నిలబడి ఉన్నదో మనకి మనం ఊహించుకోవలసిందే.

రక్షణ రంగంలో సంస్కరణలకు సంబంధించి భారతీయ వ్యవస్ధలను తగిన విధంగా మార్చేయాలని, అమెరికా విదేశీ మిలట్రీ అమ్మకాల మార్గం పూర్తిగా తెరుచుకునే విధంగా ఈ మార్పులు ఉండాలని కమిటీ సూచించగా ఆ దిశలో అమెరికా పూర్తి ప్రయత్నాలు సాగిస్తోందని అమీ సీ రైట్ స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల అవసరాలకు తగిన విధంగా భారత ఆర్ధిక వ్యవస్ధను మార్చడం అంటే ఇదే. భారత రక్షణ రంగం కొనుగోళ్ళు భారత దేశ రక్షణ అవసరాలు కాకుండా అమెరికా కంపెనీల మార్కెట్ అవసరాలు నిర్దేశిస్తాయన్నమాట!

ఇటువంటి స్నేహ, సహకార సంబంధాలను వృద్ధి చేయడంలో యు.పి.ఏ, ఎన్.డి.ఏ లు రెండూ భాగస్వాములేనని భారత ప్రజలు గుర్తించవలసిన విషయం.

వ్యాఖ్యానించండి