జాత్యహంకార నీడలో నిలువెల్లా గాయాల గాజా -ఫోటోలు


గాజా ప్రజ మరోసారి రక్తం ఓడుతోంది. యూదు జాత్యహంకారం విసురుతున్న ఆధునిక క్షిపణి పంజా దెబ్బలకు అతి పెద్ద బహిరంగ జైలుగా ప్రసిద్ధి గాంచిన గాజా నిలువెల్లా గాయాలతో నిస్సహాయగా నిలిచి ప్రపంచ వ్యవస్ధల చేతగానితనాన్ని నిలదీసి ప్రశ్నిస్తోంది. పౌరుల ఆవాసాలనే యుద్ధ క్షేత్రాలుగా మిగిల్చిన దశాబ్దాల ఇజ్రాయెల్ దురాక్రమణ ముందు తానే దురాక్రమణదారుగా చిత్రీకరించబడుతున్న వైనాన్ని నివ్వెరపోయి చూస్తోంది. తోడేలు న్యాయానికి గొర్రెలను అప్పగిస్తున్న పులుల ఆటవిక న్యాయానికి సాక్షిగా నిలబడి సో కాల్డ్ ప్రజాస్వామిక ప్రపంచానికి సవాలు విసురుతోంది.

అమానవీయ దాడులకు ఇజ్రాయెల్ చూపిన సాకు ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల కిడ్నాప్, హత్య! ఇస్లామిక్ జిహాది సంస్ధ తానే హత్యలకు బాధ్యురాలినని ప్రకటించినా ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కళ్ళూ, చెవులూ మూసుకుని హమాస్ సంస్ధదే బాధ్యత అని ప్రకటిస్తూ గాజా పౌరులపై ప్రతీకారం అమలు చేస్తున్నాడు. సమానుల మధ్య పోటీ అన్న ఆధునిక సూత్రాన్ని గేలి చేస్తూ హోమ్-మేడ్ రాకెట్లకు అత్యాధునిక ఐరన్ డోమ్ మిసైల్ రక్షణ వ్యవస్ధను ప్రయోగిస్తున్నాడు.

అత్యంత హాస్యాస్పద విషయం ఏమిటంటే కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రతిపాదించగా హమాస్/పాలస్తీనా నిరాకరించిందట! కాల్పుల విరమణకు అంగీకరించనందుకు శిక్షగా దాడులను కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సిగ్గు విడిచి ప్రకటిస్తున్నాడు.

విచ్చలవిడిగా దాడి చేసి చంపుతున్న పులి రాజుగారితో సంధి చేసుకుంటే గొర్రెలకు దక్కేది ఏమిటి? పులికి ఎవరు ఆహారంగా వెళ్లాలో నిర్ణయించుకునే హక్కు గొర్రెలకే దక్కడం! విచ్చలవిడి హత్యలు కావాలా, లేదా క్రమబద్ధమైన హత్యలు కావాలా అని అడుగుతున్న ఇజ్రాయెల్ తో సంధి చేసుకుని గాజా/పాలస్తీనా పొందే ప్రయోజనం ఏమిటి? యుద్ధం అన్నది గాజా ప్రజలకు నిన్న మొన్నటి వాస్తవం కాదు. అది వారికి ఏడున్నర దశాబ్దాల నిరంతర జీవితం. వారి జీవితమే ఒక దీర్ఘకాలిక మహా యుద్ధం.

ఇజ్రాయెల్ సైనికులు నిత్యం సాగించే హత్యలనుండి స్వజనాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఇంటినీ యుద్ధ శిక్షణా శిబిరంగా మలుచుకోవలసిన దుర్గతి ఎందుకు దాపురించింది? యూదుల రోడ్డుపై నడిస్తే శిక్ష. ఇజ్రాయెలీ సైనికుడికి అనుమానం వస్తే పాలు తాగే పిల్లగాడైనా హమాస్ టెర్రరిస్టే. ప్రతిరోజూ పనిలోకి వెళ్లాలంటే యూదు కాపలా సైనికులు ఒళ్ళంతా తడిమితే తప్ప పనిలోకి వెళ్లలేని పాలస్తీనా స్త్రీకి పైసా, పైసా యుద్ధమే కాదా? బాంబు దాడుల మధ్యనే పుట్టి పెరిగే గాజా పౌరుడికి బాంబుకీ బాంబుకీ మధ్య విరామమే శాంతి అయిన పరిస్ధితుల్లో కాల్పుల విరమణకు గాజన్లు అంగీకరించలేదని ఆరోపించడం అంత హాస్యాస్పద వ్యాఖ్యానం ప్రపంచ రాజకీయ, యుద్ధ చరిత్రలో మరొకటి ఉంటుందంటే అనుమానమే.

తాజా మారణకాండలో పాలస్తీనా పౌరుల మరణాల సంఖ్య 210 దాటింది. కాగా హమాస్ చేస్తోందని చెబుతున్నా రాకెట్ల ప్రవాహంలో కనీసం గాయపడిన ఇజ్రాయెల్ సైనికుడే లేడు. ఇలాంటి యుద్ధంలో కాల్పుల విరమణకు అంగీకరించవలసింది గాజానా లేదా ఇజ్రాయేలా?

ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.

Photos: The Atlantic

 

 

2 thoughts on “జాత్యహంకార నీడలో నిలువెల్లా గాయాల గాజా -ఫోటోలు

  1. ఇజ్రాయెలీ సైనికుడికి అనుమానం వస్తే పాలు తాగే పిల్లగాడైనా హమాస్ టెర్రరిస్టే. ప్రతిరోజూ పనిలోకి వెళ్లాలంటే యూదు కాపలా సైనికులు ఒళ్ళంతా తడిమితే తప్ప పనిలోకి వెళ్లలేని పాలస్తీనా స్త్రీకి పైసా, పైసా యుద్ధమే కాదా? బాంబు దాడుల మధ్యనే పుట్టి పెరిగే గాజా పౌరుడికి బాంబుకీ బాంబుకీ మధ్య విరామమే శాంతి!!!!!!!!!!!111
    గాజాలో నివాసముంటున్న పాలాస్థీనా వాసుల కస్టాలను వివరించడానికి ఇంతకంటే సజీవసాక్ష్యాలు(అక్షరాలు) లేవేమూ అన్నట్టుగా తెలిపారు!
    హ్యాట్సాఫ్ ,సర్!!!

వ్యాఖ్యానించండి