“బహుశా సామాన్యుడికి ఎంతో కొంత జారిపడుతుందేమో…”
***
మోడి-జైట్లీల బడ్జెట్ పై సునిశిత విమర్శ ఈ కార్టూన్!
పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు ‘ట్రికిల్ డౌన్ ధియరీ” అని ఒక తలకు మాసిన సిద్ధాంతాన్ని చెబుతుంటారు. ఈ సిద్ధాంతం అంటే పెట్టుబడిదారీ కంపెనీలకు చెప్పలేనంత ఇష్టం. ఉన్నదంతా తమకే దోచి పెట్టమని చెప్పే సిద్ధాంతం వారికి ఎందుకు ఇష్టం ఉండదు.
ఆర్ధిక పిరమిడ్ లో పైన ఉన్న కొద్ది మందికి బడ్జెట్ లో అధిక మొత్తాన్ని ఇచ్చేస్తే అది బొట్లు బొట్లుగా కింది వర్గాలకు జారి పడిపోతుందని, కాబట్టి కింది వర్గాలకు ప్రత్యేకంగా కేటాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదని సదరు సిద్ధాంతం చెబుతుంది. అలాగే వివిధ సరుకుల ధరలు మొదట ఎక్కువగానే ఉన్నప్పటికీ అవి క్రమంగా తగ్గిపోతాయని కూడా ఈ సిద్ధాంతం చెబుతుంది. ఉన్నత వర్గాలను అనుకరించే కింది వర్గాలు పైవారు వినియోగించే సరుకుల్ని వాడడం మొదలు పెడతారని దానితో అవి పైవారిని ఆకర్షించడం మాని అందరికీ అందుబాటులోకి వస్తాయని చెబుతుంది.
వనరులు అన్నీ కంపెనీలకే అప్పజెప్పడాన్నీ, చిన్న ప్రభుత్వం పేరుతో ప్రభుత్వ పాత్రను అన్నిరంగాల్లో కుదించివేయడాన్నీ సమర్ధించుకోవడానికి ఈ తలకు మాసిన సిద్ధాంతాన్ని కనిపెట్టారు. కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే ఉద్దేశిస్తూ తయారు చేసే లగ్జరీ సరుకుల తయారీని సమర్ధించుకునేందుకు సైతం ఇది అక్కరకు వస్తుంది.
వాస్తవంలో ఈ సిద్ధాంతం అసలు పని చేయదని అమెరికా, ఐరోపాలలో నిత్యం సంభవించే ఆర్ధిక సంక్షోభాలు, పెరిగిపోతున్న దరిద్రం, నిరుద్యోగం, సామాజిక అబధ్రతలు చెబుతాయి.
అరుణ్ జైట్లీ బడ్జెట్ లో సామాన్యుడికని చెప్పుకోవడానికి ఏమీ లేదని కార్టూనిస్టు సూచిస్తున్నారు. ఉన్నదంతా లేదా అధిక భాగం కంపెనీలకు వివిధ రూపాల్లో కేటాయించారని, బహుశా కింది వారికి అది క్రమంగా బొట్లు బొట్లుగా జారిపడుతుందని ఆయన ఆశించి ఉండవచ్చనీ కార్టూన్ సూచిస్తోంది.
కానీ అబాకస్ లో ఎక్కడి పూసలు అక్కడే ఉంటాయి తప్ప కిందికి జారవు. ఆ విధంగానే ఆచరణలో జైట్లీ బడ్జెట్ కింది తరగతులకు మొండి చేయి చూపారని కార్టూన్ పరోక్షంగా సూచిస్తోంది.

ఉన్నత వర్గాలకు దేశ సంపద అప్పనంగా అప్పగించాలి. వారు వనరుల్ని గంప గుత్తగా అనుభవించాలి. కానీ మెజారిటీ కింది వర్గాల ప్రజలకు మాత్రం బొట్లు బొట్లుగా.. రావాలా.?
ఎవడండీ ట్రికిల్ డౌన్ సిద్దాంతం కనిపెట్టింది. అటువంటి దాన్ని కూడా ఓ సిద్ధాంతం అనేది. బహుశా దేశంలోని వనరుల్ని…కోట్లాది మంది ప్రజల శ్రమను దోచుకోవడానికి చెప్పుకునే ఓ వంక అది. ఐనా ఈ ఆర్థిక వేత్తల సిద్ధాంతాలు అనేక సార్లు తప్పని నిరూపితమైంది. వాళ్లు బంగారం ధర తగ్గొచ్చు అంటే పెరిగిన సందర్భాలు అనేకం. పెరుగుతుందంటే తగ్గిన సందర్భాలు లేకపోలేదు. అంతెందుకు నిన్న ప్రకటించిన ఇన్ ఫ్లేషన్ గణాంకాల్లో…దేశంలో సరకులు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి కాబట్టి ఇన్ ఫ్లేషన్ తగ్గిందట. కానీ ఆచరణలో జరుగుతుందేమిటి. ఉల్లిగడ్డలు, టమాటాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అలా ఉంటుంది పరిస్థితి.
చందు తులసి గారు,
పెట్టు బడి దారి ఆర్ధిక వ్యవస్తలో అన్ని శ్రమలు అని వార్యంగా వారి (పెట్టు బడి దారి) లాభం చేకూర్చే విధంగానే ఉంటాయి. అందులో మేదో శ్రమ కూడా ఇమిడి వుంటుంది గా! 90 శాతం ఆర్దిక వేత్తలు వారికి అనుకూలంగానే తీర్పు చెబుతారు.