షీలా ఇంటికి 31 ఏ.సిలు! -కార్టూన్


Cool Shiela

“బహుశా ఆమె ఢిల్లీ మొత్తాన్ని చల్లగా ఉంచాలని భావించి ఉంటారు!”

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసానికి ఏకంగా 31 ఏ.సి మిషన్లు అమర్చారట. పోనీ అంతటితో ఆగారా అంటే, లేదు. 31 ఏ.సిలతో పాటు 15 ఎయిర్ కూలర్లు, 16 ఎయిర్ ప్యూరిఫైయర్లు, 14 హీటర్లు కూడా షీలా ఇంటిలో అమర్చారు. ఇంతా చేసి ఆ ఇల్లు 4 పడక గదుల ఇల్లు. నాలుగు పడకగదుల ఇంట్లో ఇన్ని ఏ.సిలు, ఎయిర్ కూలర్లు అమర్చి ఏం సాధించారు? కొంపదీసి హిమాలయాల వాతావరణాన్ని సృష్టించారా?

పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (పి.డబ్ల్యూ.డి) వాళ్ళని ఆర్.టి.ఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ సమాచారం అడిగితే ఈ సమాధానం వచ్చింది. షీలా బంగ్లాలో కేవలం విద్యుత్ పరికరాల ఆధునీకరణ కోసమే 16.81 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ బంగ్లాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివసిస్తున్నారు. ఆయన చేరాక కొన్ని ఏ.సి, కూలర్లను తొలగించి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించామనీ, మరికొన్ని ఇంకా ఖాళీగా ఉన్నాయని, అవసరం అయిన చోట వాటిని వినియోగిస్తామని పి.డబ్ల్యూ.డి అధికారులు చెప్పారు.

దరిద్రం తగ్గించడానికి దారిద్ర రేఖనే కిందికి జరిపే ఈ పాలక మహాశయులు తమ విషయంలో మాత్రం దాన్ని ఆకాశంలో పెట్టేస్తారు. ఎంత ఖర్చు చేసినా ‘ఇంతే గదా’ అంటారు. కేవలం 2 లెట్రిన్ ల నిర్మాణం కోసం 5 లక్షలు ఖర్చు చేసిన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా సైతం భారత పేదలను తగ్గించడానికి నానా పాట్లూ పడతారు. జనం సొమ్ము తేరగా అనుభవించడానికి అలవాటు పడ్డ ఈ పరాన్న భుక్తులు జనం సొమ్ము జనానికి ఇవ్వడానికి మాత్రం తెగ నీల్గుతూ ఎక్కడ లేని పొదుపు సూత్రాలు వల్లిస్తారు.

4 thoughts on “షీలా ఇంటికి 31 ఏ.సిలు! -కార్టూన్

  1. కేవలం ఏసీల కోసమే ఇంత అవినీతికి పాల్పడే వారు…కోట్ల రూపాయల ప్రాజెక్టుల విషయంలో ఎంత అవినీతికి పాల్పడుతారో మనం ఊహించుకోవచ్చు. ఈ దేశంలో తేరగా సంపాయించాలంటే రాజకీయాల్లో చేరడమే ఏకైక ఉత్తమ మార్గం. బహుశా అందుకనే రాజకీయ నాయకులు తమ పిల్లలను రాజకీయాల్లోకే దించుతున్నారు.

  2. కామన్ వెల్త్ గేమ్స్ నిధుల అవక తవకల పర్యవసానం గా ‘ బాగా వేడెక్కిన ‘ షీలా దీక్షిత్ ను ‘ చల్లబరచ డానికి ‘ సురేష్ కల్మాడి చేసిన ప్రయత్నం అయి ఉంటుంది, ఈ డజన్ ల కొద్దీ AC ల భాగోతం !

వ్యాఖ్యానించండి