హెలికాప్టర్ల కుంభకోణంలో సి.బి.ఐ విచారణకు నోచుకున్న గవర్నర్ల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ కూడా చేరిపోయారు. కుంభకోణానికి దారి తీసిన నిర్ణయం జరిగిన కీలక సమావేశంలో అప్పటి ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ కూడా పాల్గొనడంతో సి.బి.ఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆ మేరకు సి.బి.ఐ బృందం ఒకటి హైద్రాబాద్ వచ్చి గవర్నర్ కు విచారించింది.
అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో యు.పి.ఎ నియమించిన ఇద్దరు గవర్నర్లను సి.బి.ఐ ఇప్పటికే విచారించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్, గోవా గవర్నర్, ఎస్.పి.జి మాజీ అధిపతి బి.వి.వాంఛూలను సి.బి.ఐ విచారించిన కొద్ది రోజులకే వారిద్దరూ రాజీనామా చేశారు. సాక్షులుగా విచారించారని చెప్పినప్పటికీ సదరు గవర్నర్లు రాజీనామా చేయవలసి వచ్చింది.
ఇప్పుడు ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ను కూడా సాక్షిగానే విచారిస్తున్నామని సి.బి.ఐ చెబుతోంది. ఎందుకు విచారించినా గవర్నర్ ను తప్పించడానికే కేంద్రం సి.బి.ఐ విచారణ మార్గాన్ని ఎంచుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. అందువల్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ కూడా మరికొద్ది రోజుల్లో రాజీనామా చేయవచ్చని వారు విశ్లేషిస్తున్నారు.
హెలికాప్టర్ కుంభకోణంలో హెలికాప్టర్ ఎగరగల గరిష్ట ఎత్తును తగ్గించడమే కీలకంగా సి.బి.ఐ భావిస్తోంది. మొదట సర్వీసింగ్ హైట్ ను 6,000 మీటర్లుగా నిర్ధారించారు. వివిధ భద్రతా సంస్ధల అధిపతులతో 2003 నాటి పి.ఎం.ఓ అధికారులు జరిపిన సమావేశంలో ఈ ఎత్తును 4,500 మీటర్లకు తగ్గించాలని సూత్రబద్ధంగా నిర్ణయించారు. అనంతరం యు.పి.ఎ హయాంలో జరిగిన సమావేశంలో వాస్తవంగా ఎత్తు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండో సమావేశంలో బి.వి.వాంఛూ, నరసింహన్, నారాయణన్ తదితరులు పాల్గొన్నారు. పదవీ విరమణ అనంతరం ఈ ముగ్గురిని యు.పి.ఎ గవర్నర్లుగా నియమించింది.
బి.జె.పి ప్రభుత్వం అధికారం చేపట్టినందున యు.పి.ఎ చేసిన రాజకీయ నియామకాలను ముగించి వారి స్ధానంలో సొంత నేతలను నియమించాలని బి.జె.పి తలపెట్టగా రాజీనామాకు ఈ గవర్నర్లు నిరాకరించారు. తమ పంతం నెగ్గించుకునేందుకే గవర్నర్లను ప్రశ్నించే కార్యక్రమాన్ని సి.బి.ఐ చేత కేంద్రం నడిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక నరసింహన్ సైతం రాజీనామా చేయవచ్చన్న ఊహాగానాలు ప్రస్తుతం జోరందుకున్నాయి.
హైద్రాబాద్ వచ్చిన సి.బి.ఐ అధికారులు ఉదయం 11:30 నుండి గవర్నర్ ను ప్రశ్నించడం ప్రారంభించారని, ఈ విచారణ 3 లేదా 4 గంటల సేపు కొనసాగవచ్చని పత్రికలు తెలిపాయి.

మరి తమిళనాట తెలుగు గవర్నర్ గిరి మీద రోసం తెచ్చే విచారణ రోశయ్యగారి మీద పొడిగిస్తే అక్కడితో బి.జె.పి. కి కంటకంగా వుండే యు.పి.ఎ. గవర్నర్ల జాబితా ముగ్సినట్లే.