1 వరల్డ్ వార్: జల యుద్ధం -ఫోటోలు


మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పత్రికలు ఆ నాటి యుద్ధ రీతులను చర్చలోకి తెస్తున్నాయి. ఈ యుద్ధం సందర్భంగానే జల తల యుద్ధానికి ఎనలేని ప్రాముఖ్యత వచ్చి చేరింది. అనేక కొత్త కొత్త యుద్ధ నావల ప్రాధమిక రూపాలు మొదటి ప్రపంచ యుద్ధంలో వాడుకలోకి తెచ్చారు.

ఆనాటికి నౌకా బలగంలో బ్రిటన్ పెట్టింది పేరు. నావల ద్వారానే ఖండాంతరాలకు ప్రయాణం కట్టి వ్యాపారం పేరుతో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల దేశాలను వలసలుగా మార్చుకున్న యూరోపియన్ దేశాలు (ప్రధానంగా బ్రిటన్, ఫ్రాన్స్, హాలండ్, స్పెయిన్, పోర్చుగల్) తమ వ్యాపార నౌకలను యుద్ధ నౌకలుగా మలుచుకోవడంలో ముందు నిలిచాయి. నీటి అడుగున ప్రయాణించే జలాంతర్గాముల వినియోగం సైతం మొదటి ప్రపంచ యుద్ధంలోనే విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి.

మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధ నౌకలకు జీబ్రా చారల తరహాలో నలుపు తెలుపు చారలను పెయింటింగ్ వేసేవారు. దానిని Dazzle Camouflage అని పిలిచారు. ఆ విధంగా చేయడం వలన శత్రు బలగాలకు నౌకల దిశ, వేగం, దూరం అంతుబట్టేది కాదుట. ముఖ్యంగా జలాంతర్గాములలో అమర్చి ఉండే పెరిస్కోపు ద్వారా యుద్ధ నౌకలను పసిగట్టి వాటి దూరాన్ని, వేగాన్ని, దిశను అంచనా వేస్తూ బాంబు గోళాలను ప్రయోగించి నాశనం చేసేవారు. దూరం, వేగం, దిశలను అంచనా వేయడంలో విఫలం అయితే గనుక మందు గుండు వృధా కావడం తప్ప ఫలితం ఉండదు. పైగా మన ఉనికిని శత్రు బలగాలకు తెలిపినట్లు అవుతుంది. ప్రధాన యుద్ధ నౌకలకు ఇలా జీబ్రా చారల తరహాలో పెయింటింగ్ వేసి ఉండడం కింది ఫొటోల్లో గమనించవచ్చు. 

ప్రపంచం అంతవరకూ కనీవినీ ఎరుగని మహా మానవ విధ్వంసాన్ని మొదటి ప్రపంచ యుద్ధం మానవ సమాజానికి రుచి చూపింది. అయినప్పటికీ యుద్ధోన్మాద వ్యాపార శక్తులు పాఠాలు నేర్చుకోకపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం అనివార్యం అయింది. రెండో ప్రపంచ యుద్ధం అయినా పాఠాలు నేర్పిందా అంటే ‘లేదు, లేదు’ అని అమెరికా, ఐరోపా దేశాలు సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలు చాటుతున్నాయి. దురాక్రమణలకు గురవుతున్న దేశాలు బలహీనమైన మూడో ప్రపంచ దేశాలు కాబట్టి మరో ప్రపంచ యుద్ధానికి దారితీయగల విధంగా ప్రతిఘటన కరువయింది గానీ లేదంటే ఎన్ని రెండు ప్రపంచ యుద్ధాలకు మించిన మహా మహా విధ్వంసం చూసి ఉండేవాళ్లం.

మానవ జాతి అభివృద్ధి చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా ఘోరమైన హింసలకు, విధ్వంసాలకు వినియోగిస్తున్న పాపం పూర్తిగా పెట్టుబడిదారీ వ్యాపార కంపెనీలదే. చివరికి ఆయుధాల అమ్మకాల కోసం కూడా వివిధ జాతులు, దేశాల మధ్య చిచ్చు రగిల్చి నిరంతర మానవ హననానికి దారితీసే పరిణామాలను సృష్టించే అమానవీయ దశకు పెట్టుబడిదారీ శక్తులు చేరుకున్నాయి. అందుకే ‘సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం’ అని లెనిన్ మహాశయుడు చెప్పవలసి వచ్చింది. సమాజాన్ని ఇక ఎంత మాత్రం ప్రగతీశీలయుతంగా, సకల మానవాభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోయే శక్తి, లక్ష్యం (destiny), ఉద్దేశ్యం పెట్టుబడిదారీ వ్యవస్ధకు లేదని లెనిన్ సూత్రీకరించింది కూడా సరిగ్గా ఇందుకే.

లాభం, మరింత లాభం, మరిన్ని మరిన్ని లాభాల కోసం పరితపించే పెట్టుబడిదారీ కంపెనీలు సామ్రాజ్యవాద దేశాల ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకుని అనేక దేశాల తలరాతలను, గమనాలను, భవిష్యత్తులను శాసిస్తున్నాయి. అందువల్ల పెట్టుబడిదారీ శక్తుల ఆధిపత్యంలో తీసుకుంటున్న మానవ సమాజాన్ని విప్లవకరంగా మార్చుకుంటే తప్ప శాంతి అనే మాటకు అసలైన అర్ధం వాడుకలోకి రాదు. తరాల తరబడి మానవులను అనేక రకాల హింసలకు గురి చేస్తున్న పెట్టుబడిదారీ శక్తుల అంతం నిస్సందేహంగా శాంతియుతంగా ఉండజాలదు. ‘పంటికి పన్ను, కంటికి కన్ను’ అంటూ సామాన్య వాడుకలతో అలాంటి అశాంతియుత తిరుగుబాట్లను, ప్రగతి కారక విప్లవాలను అభివర్ణించడం అమాయకత్వం కాగలదు.

పెట్టుబడిదారీ ఆధిపత్య శక్తులు శాంతియుతంగా ఆధిపత్యాన్ని విడనాడితే సమాజానికి అంతకు మించిన మేలు ఉండబోదు. కానీ మార్కెట్ల కోసమే ప్రపంచస్ధాయి యుద్ధాలకు, దురాక్రమణ యుద్ధాలకు తెగబడుతూ అనునిత్యం వేలు, లక్షల మంది ప్రాణాలను తృణప్రాయంగా హరించివేస్తున్న పెట్టుబడిదారీ కంపెనీలు అంత తేలికగా, శాంతియుతంగా తమ ఆధిపత్యాన్ని వదులుకుంటాయని భావించడం, సమాజ మేలును కాంక్షిస్తాయని నమ్మడం అమాయకత్వం అన్నా కావాలి, అజ్ఞానం అన్నా కావాలి తప్ప వాస్తవ పరిశీలన కాజాలదు.

సమసమాజ కాంక్షాపరులు కోరుకునేది మరెన్నటికీ యుద్ధం అవసరం లేని, అబద్ధాలు, మోసం, వంచన లాంటి అనేకానేక సామాజిక చెడుగుల ఉనికిలేని అత్యున్నత సమాజం మాత్రమే. అలాంటి సమాజం ఏర్పాటుకు ఆటంకపరుస్తున్న పెట్టుబడిదారీ శక్తుల అంతానికి జాలి, దయ, శాంతి ఎరుగని నిర్దాక్షిణ్య కార్యాచరణ తప్పనిసరి అవసరం. ఆ అవసరాన్ని మనిషి గుర్తించాడు గానీ మానవ సమాజం ఇంకా గుర్తించలేదు. సమాజం కూడా ఆ అవసరాన్ని గుర్తించే వరకూ పెట్టుబడిదారీ, భూస్వామ్య సమాజాల పెత్తనం కొనసాగుతూ మరిన్ని మానవ విధ్వంసాలు కొనసాగక తప్పదు.

వ్యాఖ్యానించండి