
U.S. Senator John McCain waves to members of the media after his meeting with Foreign Minister Sushma Swaraj in New Delhi July 2, 2014. REUTERS/Adnan Abidi
కరడు గట్టిన యుద్ధోన్మాది, అమెరికా సెనేటర్ జాన్ మెక్ కెయిన్ ఇండియా పర్యటన కోసం వేంచేశారు. దేవయాని ఖోబ్రగదే వ్యవహారం వల్ల చెడిన ఇండియా-అమెరికా సంబంధాలను తిరిగి పట్టాలు ఎక్కించడానికి మెక్ కెయిన్ పర్యటన ఉద్దేశించబడింది. మెక్ కెయిన్ రాకకు మునుపు బి.జె.పి పార్టీపై గూఢచర్యం నిర్వహించడానికి అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనుమతి సంపాదించిందన్న సమాచారాన్ని ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసినప్పటికీ అమెరికాతో దృఢమైన సంబంధాల పెంపుదలకు మోడి ప్రభుత్వానికి ఏమీ ఆటంకం కాలేకపోయింది.
పత్రికల సమాచారం ప్రకారం జాన్ మెక్ కెయిన్ తో జరిపిన సమావేశంలో, అమెరికాతో తలెత్తిన విభేదాలను పక్కన బెట్టి ఆర్ధిక బంధాన్ని దృఢతరం చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడి ఆసక్తి కనబరిచారు. అమెరికాతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికే తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు. మోడి ప్రధానిగా ఎన్నికయినప్పటి నుండీ ఆయన ప్రభుత్వంతో సంబంధాల కోసం ఒబామా ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉందని పత్రికలు చెబుతూ వచ్చాయి.
“వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా విస్తరించడానికి గల కోరికను మోడి ప్రభుత్వం (జాన్ మెక్ కెయిన్కు) తెలియజేసింది” అని భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. వచ్చే సెప్టెంబర్ లో మోడి అమెరికా పర్యటించడానికి ఇప్పటికే ముహూర్తం ఖరారయింది. ముందు చూపుతో కూడిన, ఫలితాలు రాబట్టుకోగల సందర్శనను సదరు పర్యటనను మార్చుకోవడానికి మోడి ఎదురు చూస్తున్నారని కూడా ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ఇది యు.పి.ఏ విధానం కొనసాగింపు మాత్రమే. యు.పి.ఏ ఆమోదించిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం మోడి హయాంలో మరింత ఊపుతో అమలు చేయడానికి రంగం సిద్ధం అవుతోందని భారత్, అమెరికా ప్రభుత్వాల ప్రకటనలు తెలియజేస్తున్నాయి. యు.పి.ఏ కంటే మెరుగయిన పాలన అందిస్తామన్న మోడి వాగ్దానానికి అర్ధం ఇదేనా అని భారత ప్రజలు ప్రశ్నించాల్సిన సందర్భం ఇది.
జాన్ మెక్ కెయిన్ గత వారం సెనేట్ లో మాట్లాడుతూ భారత దేశ ఆర్ధిక, మిలట్రీ అభివృద్ధికి అమెరికా ఇతోధికంగా సహాయం చెయ్యాలనీ, నూతన ప్రభుత్వం హయాంలో సంబంధాలు మెరుగుపడడంపై భారీ ఆశలు తాను పెట్టుకున్నానని చెప్పారు. భారత్ మిలట్రీ అభివృద్ధికి అమెరికా సహాయం చెయ్యడం అంటే అమెరికా మరిన్ని ఆయుధాలను ఇండియాకు అమ్మజూస్తోందని అర్ధం.
అమెరికా, ఇండియాల మధ్య వాణిజ్య అంశాల్లోనూ కొన్ని విభేదాలు తలెత్తాయి. వీటిని విభేదాలు అనడం కంటే తాను కోరుతున్న పెత్తనాన్ని సజావుగా సాగించలేకపోతున్నామన్న అమెరికా దుగ్ధగా పేర్కొనడం సరైనది. ముఖ్యంగా అమెరికా ఔషధ కంపెనీల పేటెంట్ హక్కులను బేఖాతరు చేస్తూ మరిన్ని మందులను అత్యవసర ఔషధ జాబితాలోకి భారత్ చేర్చడం అమెరికాకు నచ్చలేదు. ఇండియాలో కాస్త శక్తివంతంగా ఉన్న ఔషధ కంపెనీల లాబీని అణచివేయడానికి అమెరికా ప్రయత్నాలు సాగిస్తోంది. దానికి మేధో సంపత్తి హక్కులను అడ్డం తెచ్చుకుంటోంది. వాణిజ్య రక్షణ విధానాలను (protectionism) కూడా ఇండియా పాటిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఆటంకాలను అధిగమించేందుకు అమెరికా నూతన ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచనుంది. మోడి ప్రభుత్వం కూడా సంబంధాలను బలీయం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నందున బహుశా అమెరికా మాట చెల్లుబాటు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మెక్ కెయిన్ పర్యటనకు ఒక రోజు ముందు అమెరికా మాజీ ఎన్.ఎస్.ఏ మరియు సి.ఐ.ఏ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ బి.జె.పి పై ఎన్.ఎస్.ఏ సాగించిన గూఢచర్యం సాగించిన సంగతిని వెల్లడి చేసినప్పటికీ జాన్ మెక్ కెయిన్ పర్యటన నిరాఘాటంగా సాగిపోతోంది. ఢిల్లీలోని అమెరికా రాయబారిని బుధవారం పిలువనంపిన కేంద్ర ప్రభుత్వం బి.జె.పి పై గూఢచర్యం నిర్వహించినందుకు వివరణ కోరిందని, భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పని చేయబోమన్న హామీ తీసుకుందని పత్రికలు చెప్పాయి.
ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ.
అన్నట్లు అమెరికా తన బుద్ధిని వదులుకునే సమస్యే ఉండదు. దానికి అనుగుణంగా ఇతరులు సర్దుబాటు చేసుకోవడం తప్ప మరో గత్యంతరాన్ని అమెరికా మిగల్చదు.
కరడుగట్టిన యుద్ధోన్మాది అయిన జాన్ మెక్ కెయిన్ నిజానికి రిపబ్లికన్ పార్టీ సెనేటర్. అయినప్పటికీ డెమోక్రటికి పార్టీ అధ్యక్షుడు బారక్ ఒబామా ఇండియా నూతన ప్రభుత్వంతో చర్చలకు ఆయనను ఎంపిక చేసుకోవడం కాకతాళీయం కాదు. కనపడిన దేశాలన్నింటిమీదా దాడి చేసి యుద్ధం చేయాలని డిమాండ్ చేసే మెక్ కెయిన్ తో బి.జె.పి నేతలకు మెరుగైన సంబంధాలు ఉన్నాయని కొన్ని పత్రికలు సూచిస్తున్నాయి. అది ఎంత వరకు నిజమో రాబోయే రోజుల్లో ఇండియా-అమెరికా సంబంధాల అభివృద్ధి ద్వారా తెలియగలదు.

eluka toka tecci Edaadi utikinaa……..
> ఎలుక తోక పట్టి గోదారి ఈదినా నలుపు నలుపే గానీ తెలుపు కాదు అన్నట్లు
ఇదేమి చిత్రం. అసలు రూపం “ఎలుగుతోలు దెచ్చి ఎంతెంత ఉతికినా, నలుపు నలుపే కాని తెలుపు కాదు” అని వేమన పద్యంలో పలుకుబడి.. ఇక గోదారి ఈదటం మీది సామెత “కుక్కతోక పట్టి గోదారి ఈదటం” అనేది. మీరు ఈ రెంటినీ కలగాపులగం చేసేసారు. దయచేసి గమనించి సరిదిధ్దుకోగలరు.
నాగరాజు, శ్యామలరావు గార్లకు
తప్పు సవరించాను. కానీ నేను మొదట విన్నపుడు అలాగే విన్నాను. అంటే మొదట వినడమే తప్పు విన్నాను అన్నట్లు.