సామాన్యుడి ఎద్దు పరుగు -కార్టూన్


Common man's bull run

ధూ, దీనెమ్మ, జీవితం! అని జీవితంలో ఒక్కసారన్నా విసుక్కోని సామాన్యుడు ఈ భూమి మీద ఉంటాడా?

నరేంద్ర మోడి నేతృత్వంలో బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వానికి మెజారిటీ సీట్లు వచ్చింది లగాయితు భారత స్టాక్ మార్కెట్లు ఉరుకులు పరుగులు పెడుతూ దూసుకుపోతున్న వార్తాలే రోజూ.

స్టాక్ మార్కెట్ సూచీ పెరుగుతూ పోతుంటే బుల్ మార్కెట్ అనీ, తగ్గుతూ పోతుంటే బేర్ (ఎలుగుబంటి) మార్కెట్ అనీ సంకేతాలు పెట్టుకున్నారు. షేర్ మార్కెట్లలో మధ్యతరగతి బడుగు జీవులు కూడా మదుపు చేస్తున్నప్పటికీ వారి వాటా చాలా చాలా తక్కువ. షేర్ మార్కెట్లు ప్రధానంగా ధనిక వర్గాలకు సేవ చేయడానికి ఉద్దేశించినవి.

ఆస్తుల రూపంలో సంపదలను కుప్ప పోసుకుంటే చట్టం దృష్టిలో పడడం చాలా తేలిక. అదే షేర్ మార్కెట్లలో మదుపు చేస్తే బోలెడు రాయితీలు. పైగా పదిమందికి తెలియకుండానే లక్షల కోట్ల పెట్టుబడిని దాచుకునే సౌకర్యం షేర్ మార్కెట్లు కల్పిస్తాయి.

పోర్ట్ ఫోలియో పెట్టుబడుల కోసం దేశాలు తమ ఆర్ధిక విధానాలనే మార్చుకుంటూ ‘రండి, రండి’ అంటూ బొట్టు పెట్టి పిలుస్తున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ మదుపును ఆకర్షణీయంగా మలచడానికి ప్రభుత్వాలు పోటీలు పడి మరీ రాయితీలు ఇస్తున్నందున షేర్ మార్కెట్ పెట్టుబడులు సంపదల పెంపుకు భద్రమైన చోటు అని ధనిక వర్గాలు భావిస్తాయి.

కాబట్టి షేర్ మార్కెట్ ‘బుల్ రన్’ ప్రారంభించిందంటే దాని అర్ధం ధనికవర్గాల సంపదలు ఉన్న పళంగా పెరుగుతున్నాయనే అర్ధం. అందువల్ల ‘బుల్ రన్’ సామాన్యుడికి ఒక లగ్జరీ అన్నట్లే.

కానీ సామాన్యుడికి కూడా ప్రత్యేకమైన బుల్ రన్ ఒకటి ఉండని కార్టూనిస్టు కనిపెట్టారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణమే ‘సామాన్యుడి ఎద్దు పరుగు’ అని కార్టూనిస్టు సూచించారు.

అయితే షేర్ మార్కెట్ ఉత్సాహాన్ని సూచించే బుల్ రన్ వల్ల ధనిక వర్గాలు లబ్ది పొందితే సామాన్యుడి బుల్ రన్ జీవితాల్ని తోక్కేస్తూ పోతుంది.

ధనికుల బుల్ రన్ ఎంత విచ్చలవిడిగా రంకెలు వేస్తూ దూసుకుపోతే ధనికులకు అంత ఆనందం. సామాన్యుడి బుల్ రన్ ఎంతగా కట్లు తెంచుకుని దుమికితే సామాన్యుడికి అంత కష్టం.

సామాన్యుడి బుల్ రన్ ఎప్పుడూ ప్రత్యేకమే.

వ్యాఖ్యానించండి