‘రంగు పడుద్ది!’ అని ఏదో సినిమాలో కామెడీ విలన్ ఏ.వి.యస్ అంటారు(ట)! బహుశా (కత్తితో పొడిచి) హత్య చేస్తే ఎర్రటి రక్తం చిందుతుంది గనుక రక్తం కారుద్ది అనడాన్ని విలన్ చేత ఆ విధంగా చెప్పించి ఉండాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా కన్ను పడినా దాదాపు అదే పరిస్ధితి. అమెరికా కన్ను పడిన ఏ దేశమూ ఇంతవరకూ బతికి బట్టకట్టింది లేదు, ఒక్క ఇజ్రాయెల్ తప్ప. ఇజ్రాయెల్ ఒక్కోసారి అమెరికాను మించిన దిగజారుడుని ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఒక్కటే అమెరికా నుండి నికరంగా లాభం పొందిన దేశంగా చెప్పవచ్చు. అది కూడా అమెరికాలోని శక్తివంతమైన ఇజ్రాయెలీ లాబీ వల్ల సాధ్యపడిందన్నది వేరే సంగతి.
విషయానికి వస్తే, భారత అణు కార్యక్రమంపై మరోసారి అమెరికా కన్ను పడింది. అమెరికాకు చెందిన ఐ.హెచ్.ఎస్ జేన్ అనే మిలట్రీ విశ్లేషణా సంస్ధ (ఇలాంటి సంస్ధలను ధింక్ ట్యాంక్ లుగా పత్రికలు పిలుస్తాయి) మైసూరులో రహస్య అణు ఇంధన ఉత్పత్తి కార్యకలాపాలను కనిపెట్టినట్లు జూన్ 20 తేదీన వెల్లడి చేయడంతో మరోసారి భారత్ కేంద్రంగా ‘అణు కలకలం’ బయలుదేరింది. శాటిలైట్ చిత్రాల ద్వారా మైసూరులోని ‘ఇండియన్ రేర్ మెటల్ ప్లాంటు’లో పెద్ద ఎత్తున అణు ఇంధనం ‘యూరేనియం హెక్సా ఫ్లోరైడ్’ ను ఉత్పత్తి చేస్తున్న విషయం కనుగొన్నట్లు సంస్ధ పేర్కొంది. ఇక్కడ నెలకొల్పిన సెంట్రిఫ్యూజ్ యంత్రాలలో ఉత్పత్తి అవుతున్న యురేనియం ఇంధనం ద్వారా అణు జలాంతర్గాములకు కావలసిన అణు ఇంధనాన్ని ఇండియా ఉత్పత్తి చేస్తోందని జేన్ వెల్లడించింది.
ఇందిరాగాంధి హయాంలో పోఖ్రాన్ వద్ద అణు పరీక్ష జరిగిన అనంతరం ఇండియాను అణు ఏకాకిగా చేయడంలో అమెరికాది ప్రధాన పాత్ర. తన నేతృత్వంలోని అణు పెత్తందారీ గ్రూపు ‘న్యూక్లియన్ సప్లయర్స్ గ్రూప్’ (ఎన్.ఎస్.జి) ద్వారా అణు ఇంధనం గానీ, అణు సాంకేతిక పరికరాలు మరియు పరిజ్ఞానం గానీ ఇండియాకు అందకుండా ఎన్.ఎస్.జి దేశాలను అమెరికా కట్టడి చేసింది. 2008లో యు.పి.ఏ ప్రభుత్వంతో చేసుకున్న వ్యూహాత్మక అణు ఒప్పందం ద్వారా ఈ అణు ఏకాకితనం నుండి బైటపడడానికి అమెరికా దోహదం చేసిందని మన పాలకులు తరచుగా చెప్పే మాట.
ఒప్పందం అయితే చేసుకున్నారు గానీ ఆ ఒప్పందం ఫలితాన్ని అమెరికా నుండి ఒక్క నయా పైసా కుండా ఇండియాకు అందింది లేదు. ఒక్క రష్యా మాత్రమే కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది. అది కూడా 2008 నాటి ఒప్పందానికి చాలా ముందుగా దాదాపు 15 సంవత్సరాల క్రితం రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ఫలితమే తప్ప అమెరికా ఒప్పందం వల్ల ఒరిగింది కాదు. భారత పార్లమెంటు ఆమోదించిన అణు పరిహార ఒప్పందాన్ని తమ కంపెనీలకు అనుకూలంగా మార్చితే తప్ప అణు సరఫరాలు చేయబోమని అమెరికా కంపెనీలు భీష్మించాయి.
ఒప్పందాన్ని గౌరవించడం మాట అటుంచి స్వంత ప్రయత్నాల ద్వారా ఇంధనాన్ని, అణ్వాయుధాలను సమకూర్చుకోవడం కూడా అమెరికాకు ఇష్టం ఉండదు. అమెరికా దృష్టిలో తనకు తెలియకుండా ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కటీ అణు శక్తిని వినియోగించుకోగల సామర్ధ్యాన్ని పొందకూడదు. ఇలాంటి అణు గూండాయిజంలో భాగంగా ఆయా దేశాల అణు కార్యక్రమాలపై నిఘా పెట్టడం అమెరికా అనుసరించే కపట విధానం. ఈ విధానలో భాగంగా మిలట్రీ రహస్య గూఢచార సంస్ధలతో పాటు ఐ.హెచ్.ఎస్ జేన్ లాంటి ధింక్ ట్యాంక్ లు కూడా అమెరికాయేతర దేశాల అణు సామర్ధ్యంపై విశ్లేషణలు వెలువరిస్తుంటాయి. జేన్ ప్రచురించిన తాజా విశ్లేషణ అందులో భాగమే.
1992లో మైసూరు సమీపంలో నిర్మించిన సెంట్రీ ఫ్యూజ్ ప్లాంటులో లెక్కకు రాని యురేనియం ఇంధనాన్ని ఇండియా ఉత్పత్తి చేస్తోందని జేన్ విశ్లేషించింది. ఈ ప్లాంటు విస్తరణ ద్వారా పెద్ద మొత్తంలో యురేనియంను శుద్ధి చేసే సామర్ధ్యాన్ని ఇండియా సంతరించుకుందని అణు జలాంతర్గాములకు సరిపడా ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఇండియా అణు కార్యకలాపాలను రహస్యంగా విస్తరించిందని సంస్ధ తెలిపింది. జేన్ విశ్లేషణ ప్రకారం ఈ ప్లాంటును ధర్మో న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి కూడా ఇండియా ప్రయత్నిస్తోంది. 2015 మధ్య కాలానికి గానీ చివరికి గానీ మైసూరు ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కావచ్చని తెలిపింది.
“యురేనియం శుద్ధి సామర్ధ్యాన్ని విస్తరించుకుంటే ఖండాంతర క్షిపణులను ప్రయోగించగల అణు జలాంతర్గాములను తన ఆయుధాగారంలో చేర్చుకోగల శక్తిని ఇండియా సంతరించుకుంటుంది. ఇప్పటికే ఉనికిలో ఉన్న అణు నిరోధకని ఇండియా పెంచుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. చైనా, పాకిస్ధాన్ ల నుండి ఎదురవుతుందని భావించే భయాలను తిప్పి కొట్టే లక్ష్యం ఇండియా దీని ద్వారా నెరవేర్చుకోవచ్చు” అని ‘ఐ.హెచ్.ఎస్ జేన్ ఇంటర్నేషనల్ రివ్యూ’ పత్రిక ఎడిటర్ మాధ్యూ క్లేమెంట్స్ పేర్కొన్నారని ది హిందూ జూన్ 20 తేదీన నివేదించింది.
“(యురేనియం) శుద్ధి కర్మాగారాన్ని అణు జలాంతర్గాముల రియాక్టర్లకు కావలసిన అణు ఇంధనాన్ని తయారు చేయడం కోసమే నిర్మించారు. అయితే విస్తరణ ద్వారా ఇతర లక్ష్యాలను నేరవేర్చుకునేందుకు తగిన సామర్ధ్యం చేకూరుతుంది. ముఖ్యంగా అణ్వాయుధాల కోసం అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు” అని పత్రికలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ విభాగం ఎడిటర్ కారల్ డేవీ విశ్లేషించారు. తమ రక్షణ రంగ అవసరాలు తీర్చుకునే క్రమంలో విజయాలను ఎప్పటికప్పుడు చాటుకునే ఇండియా మైసూరు అణు శుద్ధి కర్మాగారం గురించి మాత్రం ఎలాంటి వివరాలను వెల్లడి చేయలేదని పత్రిక సలహాదారు రాబర్ట్ కెల్లీ వ్యాఖ్యానించడం గమనార్హం.
డ్రోన్ విమానాలు కూడా
యురేనియం శుద్ధి సామర్ధ్యాన్ని విస్తరించుకోవడమే కాకుండా మానవ రహిత డ్రోన్ యుద్ధ విమానాల తయారీ కోసం మైసూరులోని డి.ఆర్.డి.ఒ (డిఫెన్స్ రీసర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ -రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్ధ) ఆధీనంలోని రహస్య ప్రాంతాన్ని ఉద్దేశించారని మరో అమెరికా సంస్ధ ‘ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ -ఐ.ఎస్.ఐ.ఎస్) సంస్ధ ఈ వారం వెల్లడి చేసింది. తమ వాదనకు మద్దతుగా ఈ సంస్ధ శాటిలైట్ ఫోటోలను సైతం ప్రచురించింది. ‘స్పెషల్ మెటీరీయల్ ఎన్ రిచ్ మెంట్ ఫెసిలిటీ’ (ఎస్.ఎం.ఇ.ఎఫ్) ని నెలకొల్పుతామని ఇండియా గతంలో ప్రకటించిందని కానీ అది వాస్తవంగా అమలు చేస్తోందన్న సంగతి మాత్రం ప్రపంచానికి తెలియదని సంస్ధ తెలిపింది. కర్ణాటక లోని చిత్రదుర్గ ప్రాంతంలో డి.ఆర్.డి.ఒ 10,000 ఎకరాల భూమిని సేకరించగా అందులో కొంత భాగాన్ని రహస్య కార్యకలాపాలకు కేటాయించారని శాటిలైట్ చిత్రాల ఆధారంగా తెలిపింది.
ఉల్లర్తి కావల్ గ్రామంలో 1410 ఎకరాలను, ఖుదాపుర గ్రామంలో 400 ఎకరాలను బాబా అణు పరిశోధనా సంస్ధ (బార్క్) కోసం కేటాయించారని ఐ.ఎస్.ఐ.ఎస్ వెల్లడించింది. సంస్ధ ప్రకారం ఎస్.ఎం.ఇ.ఎఫ్ కోసమే బార్క్ కు ఈ స్ధలాన్ని కేటాయించారు. అలాగే వరవు కావల్ గ్రామంలోని 4,000 ఎకరాలు, ఖుదాపుర గ్రామంలోని 290 ఎకరాలు కలిపి కేవలం డ్రోన్ విమానాల ప్రాజెక్టు కోసమే డి.ఆర్.డి.ఒ కు అప్పగించారు.
కనీసం 2 రోజుల నుండి 3 రోజుల పాటు ఎగరగల మానవ రహిత విమానాలు, మానవ రహిత యుద్ధ విమానాలు తయారు చేసి పరీక్షించేందుకు డి.ఆర్.డి.ఒ కు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని పాత (మే 2, 2013), కొత్త (ఏప్రిల్ 4, 2014) శాటిలైట్ చిత్రాలలోని తేడాల ద్వారా గ్రహించినట్లు ఐ.ఎస్.ఐ.ఎస్ విశ్లేషకులు తెలిపారు. డ్రోన్ విమానాల కేంద్రం పక్కనే అణు శుద్ధి కర్మాగారం నిర్మించడం తెలివైన పని కాదని ఐ.ఎస్.ఐ.ఎస్ నిపుణులు హెచ్చరించడం గమనార్హం. ఈ మేరకు బార్క్ నుండి తగిన వివరణాత్మక ప్రకటన వెలువడుతుందన్న ఆశాభావాన్ని సదరు నిపుణులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన వాణిజ్య విమాన సంస్ధ ఎయిర్ బస్ సేకరించిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఐ.ఎస్.ఏ.ఎస్ విశ్లేషణ చేయడం ఇండియాకు మరింత ఆందోళన కలిగించే విషయం.
తాజా వాస్తవాల నేపధ్యంలో ఇండియాకు అణు పరికరాలను గానీ అణు పరిజ్ఞానాన్ని గాన్ని అమ్మడంలో జాగ్రత్త పాటించాలని ఐ.ఎస్.ఐ.ఎస్ సంస్ధ ఎన్.ఎస్.జి సభ్య దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం పై సంతకం చేయని ఇండియాకు అణు పరిజ్ఞానం అందడం వలన మిన్ను విరిగి మీద పడుతుందని అమెరికా నిపుణుల ఆందోళన. భూమండలాన్ని అనేకసార్లు భస్మీ పటలం చేయగల అణు పాటవం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల వద్ద పోగు పడి ఉండగా వాటి వల్ల లేని ప్రమాదం ఇండియా, ఇరాన్ లాంటి దేశాల వల్ల వస్తుందని చెప్పడం మోసం మాత్రమే. ఈ దేశాల అణు ఆధిపత్యాన్ని మరో దేశం అధిగమించకూడదన్న ఆందోళనే తప్ప మరో ఆందోళన అమెరికా సంస్ధలకు ఉండదన్నది నిస్సందేహం.
