నడుస్తున్నది ప్రపంచ ఫుట్ బాల్ సీజన్. కాబట్టి బంతిని రెండు స్తంభాల నడుమకు నెట్టేస్తే సరిపోతుంది. కానీ రానున్నది అసలు పందెం. ఈ పందెంలో స్తంబాల మధ్య నెట్టడానికి బంతీ ఉండదు. ఆట ఆడితే మోగే చప్పట్లూ ఉండవు. ఎందుకంటే ఆ అసలు పందెంలో అన్నీ దాటి తీరవలసిన ఆటంకాలే.
30 రోజుల ప్రభుత్వం పైన తీర్పు ఇవ్వడానికి ఏమీ ఉండదని కార్టూనిస్టు ఇలా చెప్పారు. అధికారంలోకి వచ్చిన ప్రారంభ రోజులను అధికార పార్టీకి హానీ మూన్ రోజులు మాత్రమే. ఎన్నికలు ఎంత గొప్పగా జరిగాయో, ప్రజలు ఎంత గొప్పగా మెచ్చి ఓట్ల వర్షం కురిపించారో చెప్పుకోవడంతోనే ఈ హానీ మూన్ రోజులు గడిచిపోతాయి. ఈ కాలంలో కురిసేవన్నీ ప్రశంసల జల్లు మాత్రమే.
వంద రోజుల పాలన ముగిసినప్పటి నుండి అసలు ఆటంకాలు ఎదురవుతాయనీ, అప్పుడిక ప్రజలని ఎన్ని కష్టాలు పెట్టేది లెక్కకు వస్తాయని ఈ కార్టూన్ లో పరోక్షంగా ఎత్తి చూపారు. పొగడ్తల జల్లు కురవడం మాని తెగడ్తల అగడ్తలు తవ్వడం త్వరలోనే మొదలవుతుంది కాచుకోమని సూచించారు.
నిజానికి జనం కష్టాలు ఇప్పటికీ మొదలయ్యాయి. బడ్జెట్ కంటే ముందే రైలు ఛార్జీలు పెంచిన మోడి సర్కార్, ఆర్ధిక బడ్జెట్ లో కంపెనీలకు అనుకూలమైన విధానాలతో మోత మోగించే సందర్భం త్వరలోనే రానుంది. అప్పుడు గానీ మోడి అభివృద్ధి, ఉద్యోగాల మంత్రంలోని బోలుతనం జనానికి తెలిసిరాదు. మోడీయే చెప్పుకున్నట్లు జనాలు ఆయన్ని తిట్టుకునే రోజులు వస్తున్నాయి.
కిరోసిన్, డీజిల్ లు కూడా ప్రతి నెలా పెంచే ఏర్పాట్లను మోడి ప్రభుత్వం చేస్తోందని అప్పుడే వార్తలు గుప్పు మంటున్నాయి. సామాన్యుడి ఇంధనం కిరోసిన్ ధరలను కూడా డీ కంట్రోల్ చేయడం ద్వారా మోడి ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించనుందని ఛానెళ్లు చెప్పేసాయి.
కార్టూనిస్టు సూచించినట్లు అసలు ఆటంకాలు ఎదురయ్యేది మోడికి కాదు, ఆయన వల్ల జనానికి మాత్రమే.

Visekhar, could you write an article on the feasibility of loan waiver: http://content.janavijayam.in/2014/07/blog-post.html