నిర్మాణ కాంట్రాక్టర్ల అత్యాశ ఫలితంగా చెన్నైలో నిర్మాణంలో ఉండగానే 11 అంతస్ధుల భవనం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 7గురు నిర్మాణ కూలీలు మరణించారని నిన్న ప్రకటించగా, ఈ రోజు మృతుల సంఖ్య 11కు పెరిగింది. భవన శిధిలాల కింద అనేకమంది చిక్కుకుని ఉన్నారని భయపడుతున్నారు.
శిధిలాల సందుల నుండి చేతులు చాచి తమను కాపాడమంటూ బాధితులు వేడుకుంటున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. తలవరకు కనిపిస్తున్న బాధితులు కొందరయితే, చేయి మాత్రమే కనిపిస్తూ కాపాడమని చేస్తున్న ఆర్తనాదాలు వినిపిస్తున్నది మరి కొందరు.
ఇప్పటివరకు శిధిలాల నుండి 20 మందిని రక్షించామని అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 50 మంది వరకూ భవన కార్మికులు పని చేస్తున్నారని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇంకా ఎక్కువ మందే నిర్మాణ పనిలో నిమగ్నమై ఉన్నారని మరికొన్ని పత్రికలు చెబుతున్నాయి. వర్షం కురుస్తుండడంతో సహాయ కార్యక్రమాలకు బాగా అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది.
25 మందిని సహాయకులు రక్షించగా వారిలో 5 గురు చనిపోయారని 20 మంది ప్రాణాలతో ఉన్నారని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భారీ రాడ్ కటింగ్ యంత్రాల ద్వారా కాంక్రీటు దిమ్మలను కోస్తూ చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘ట్రస్ట్ హైట్స్’ పేరుతో నివాస భవనం కోసం నిర్మాణం జరుగుతుండగా శనివారం అకస్మాత్తుగా భవనం కూలిపోయింది. రెండు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ నివాస సముదాయానికి నిర్మాణదారులు “ద బిలీఫ్”, “ద ఫెయిత్” అని పేరు పెట్టడం వారి హిపోక్రసీని పట్టి ఇస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్నారు గనకనే జనాన్ని నమ్మించడానికి ‘నమ్మకం’ అర్ధం వచ్చే పేర్లు పెట్టారు కాబోలు!
శిధిలాల్లో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది నిర్మాణ కూలీలే. భవనం కూలిన సమయంలో వర్షం కురుస్తున్నందున నిర్మాణ భవనం కిందికి చేరినవారు కూడా కొందరు ఉండవచ్చని తెలుస్తోంది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్ధకు చెందిన బృందం కూడా దుర్ఘటన స్ధలికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
చెన్నైలోని మౌలివక్కంలో సాయంత్రం గం. 5:30 ల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనకు భారీ వర్షం తోడ్పడిందని భావిస్తున్నారు. 11 అంతస్ధుల నిర్మాణ భవనం పక్కనే ఉన్న రెండంతస్ధుల భవనంపై కూలడంతో అది కూడా శిధిలాల కుప్పగా మారిపోయింది. సదరు భవనంలో 7 కుటుంబాలు నివశిస్తుండగా వారిలో కొందరు మాత్రమే బతికి బైటపడ్డారు.
దాదాపు నిర్మాణ కార్మికులందరూ పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు కు చెందినవారని ది హిందూ తెలిపింది. ప్రైమ్ సృస్టి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మాణ భవనానికి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నదని పత్రిక తెలిపింది.
దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జయలలిత యధావిధిగా హామీ ఇచ్చారు. భవన యజమాని మనోహరన్, ఆయన కుమారుడు ముత్తులను అరెస్టు చేశామని చెన్నై పోలీస్ కమిషనర్ ఎస్.జార్జి పత్రికలకు తెలిపారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మృతులకు 5 లక్షల పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ బాధితులు ఎక్కువమంది విజయనగరం జిల్లాకు చెందినవారని తెలుస్తోంది.
Photos: The Hindu, Twitter











