గోదావరి ‘గుండె మంట’కు బాధ్యులెవరు? -ఫోటోలు


సహజ వాయువును అమ్మే కంపెనీయేమో ‘గ్యాస్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)’. ఆ గ్యాస్ ని కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నదేమో లగడపాటి రాజగోపాల్ కి చెందిన లాంకో కంపెనీ. ఆ గ్యాస్ వెళ్ళేది మాత్రం కోన సీమ గుండెలపై నుండి. ఫలితంగా ప్రమాదం జరిగిన ఫలితాన్ని అనుభవిస్తోంది కోన సీమ ప్రజలు, వారి పొలాలు, వారి ఇళ్లూ, వారి సమస్త ఆస్తులు కాగా బాధ్యతని నిస్సంకోచంగా మళ్ళీ ఆ ప్రజలపైకే నెట్టివేస్తున్న గెయిల్, లాంకోలను ఏమనాలి?

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామాన్ని శుక్రవారం తెల్లవారు ఝామున చుట్టుముట్టిన గ్యాస్ కుంపటి 14 మందిని బలి తీసుకుంది. మృతుల సంఖ్య 16 కి చేరుకుందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. స్ధానిక ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నందునే ప్రమాదం జరిగిందని పేరు చెప్పడానికి ఇష్టపడని గెయిల్ అధికారులు రహస్యంగా పత్రికల చెవుల్లో గుసగుస లాడారని పత్రికలు చెబుతున్నాయి. అదే నిజమైతే మరిన్ని ప్రమాదాలు గోదావరి కోనసీమ ప్రజల్ని చుట్టుముట్టవన్న గ్యారంటీ లేనట్లే.

ఒక టీ బంకు యజమాని నిర్లక్ష్యంగా ఉదయాన్నే అగ్గి పుల్ల ముట్టించడంతో గ్యాస్ పైప్ లైన్ పేలిపోయిందని పత్రికలు అదేపనిగా రాసేస్తున్నాయి. అక్కడికి టీ బంకు యజమాని అగ్గి పుల్ల ముట్టించడం అదే మొదటిసారి అయినట్లు?! ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇన్ని సంవత్సరాలుగా సదరు టీ బంకు యజమాని గానీ, ఆ చుట్టు పక్కల ఇళ్ళల్లోని గృహీణులు గానీ అగ్గి పుల్లలు ముట్టించకుండానే తిండి తింటున్నారా? టీలు తాగుతున్నారా? వ్యాపారాలు నడుపుతున్నారా? బాధ్యత తెలియని అధికారులు, వ్యాపార లాభాలు తప్ప మరొకటి పట్టని కంపెనీలు చేయని తప్పు, ప్రభుత్వాల ఉపాధి సాయం లేకపోయినా తమ మానాన తాము బతికుతున్న సామాన్య ప్రజలు చేశారా?

అసలు అగ్గిపుల్ల ముట్టిస్తే పేలిపోయే పైపులు ఏ మాత్రం భద్రత కలిగి ఉన్నట్లు? జనం భద్రత తర్వాత సంగతి, కనీసం పైపులకీ, అందులోని గ్యాస్ కీ, ఆ గ్యాస్ వినియోగించే లాంకో కంపెనీకయినా అలాంటి పైపుల వల్ల భద్రత ఉన్నట్లేనా? కనీసం ఈ అంశం అయినా గెయిల్, లాంకోలను పట్టి వేధించదా?

వాస్తవం ఏమిటంటే గెయిల్ నిర్వహిస్తున్న పైపులు తుప్పు పట్టి లీకులకు నిలయంగా మారిపోయాయి. పైపుల నుండి వెలువడుతున్న గ్యాస్ వాసనను పసిగట్టిన స్ధానిక ప్రజలు అనేకమార్లు గెయిల్ అధికారులకు మొరపెట్టుకుని రిపేర్లు చేయకని వేడుకున్నారు. అయినా విన్న నాధుడు లేదు. పత్రికల రిపోర్టుల ప్రకారం కొద్ది రోజుల క్రితమే అక్కడ పైపై రిపేర్లు చేసి గెయిల్ అధికారులు మమ అనిపించుకున్నారు. సదరు రిపేర్లు పని చేయకపోవడంతో గ్యాస్ భారీ మొత్తంలో లీక్ అయి పేలుడు జరిగిన ప్రాంతం వద్ద సమకూడుతూ వచ్చింది. ఈ పరిస్ధితి తెలియని స్ధానిక జనం యధావిధిగా తమ రోజువారీ కార్యక్రమాలకు ఉపక్రమించడంతో పొంచి ఉన్న ప్రమాదం బుసకొట్టి కాటేసింది.

టీ బంకు యజమాని అగ్గి పుల్ల ముట్టించే ముందు ఏయే జాగ్రత్త తీసుకోవాలి? మహా అయితే తన గ్యాస్ స్టవ్ లీక్ అవుతున్నదేమో జాగ్రత్త వహించగలడు. అదికూడా తాను ముట్టించేది గ్యాస్ పొయ్యి అయితేనే. ఆ జాగ్రత్త తీసుకున్నాక ఆయన తనపని తాను చేసుకోవాల్సిందే. తెలియని ప్రమాదం ముంచుకు రానుందని భయపడుతూ కూర్చుంటే ఆయన కుటుంబ పోషణ నడవదు మరి. అలాంటి అతి చిన్న కుటుంబ పోషణను సైతం ప్రమాదకరంగా మార్చినందుకు గెయిల్, లాంకోలు దోషులు కాకుండా ఎలా పోయారు? పొట్టకూటి కోసం టీ స్టౌవ్ ని ముట్టించిన టీ వ్యాపారిని ఆడిపోసుకుంటున్న పేరు గొప్ప నైపుణ్య అధికారుల చదువు, అనుభవం, కామన్ సెన్స్ ఏ గంగలో కలిసినట్లు?

Photos: The Hindu, BBC, Reuters, Hindustan Times

 

One thought on “గోదావరి ‘గుండె మంట’కు బాధ్యులెవరు? -ఫోటోలు

  1. చాలా బాగా అడిగారండీ! ఈ గెయిల్ కంపెనీ ప్రభుత్వ సంస్థ, ఎంతో లాభాలు ఆర్జిస్తున్నా ప్రజల భద్రత గురించి కనీస శ్రద్ధ లేకపోవటం శోచనీయం. ఇదే కంపెనీకి ఇంజినీర్ పరీక్షకి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎవరూ పెట్టనన్ని షరతులు, నిబంధనలు విధించారు. (నెట్ లో దరఖాస్తు చేసి కూడా దాన్ని ప్రింట్ తీసి పోస్ట్ చేయటం, హాల్ టికెట్ ని కలర్ లో ప్రింట్ తీసుకుని దానిపై అటెస్టేషన్ చేయించటం, తరువాత పరీక్షా కేంద్రానికి గుర్తింపు పత్రాలు తీసుకు రావటం, పరీక్ష వ్రాస్తున్నపుడు ఫోటో మరియు సంతకం తీసుకోవటం, చేతిపై అదీ పరీక్ష వ్రాస్తున్న చేతిపై ముద్ర వేయటం ఇన్ని చేసారు.) జీతం ఇవ్వకముందే ఇంతలా ఉంటే ఉద్యోగి అయితే ఇంకెలా ఉంటుందో! ఇన్ని పనికి మాలిన నిబంధనలు విధించే వారికి తాము కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అని తెలియదా ?ఖచ్చితంగా వారిని తీవ్రంగా శిక్షించాలి.

వ్యాఖ్యానించండి