రష్యా: మానవ రహిత డ్రోన్ లో పిజ్జా డెలివరీ


మనిషి స్వయంగా నడపకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపే విమానాలను డ్రోన్ విమానాలు అంటున్న సంగతి విదితమే. ఇలాంటి డ్రోన్ విమానం ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఓ వినియోగదారుడికి పిజ్జా అందజేశామని రష్యా పిజ్జా కంపెనీ డోడో పిజ్జా ప్రకటించింది.

గత నెలలో ముంబైలో ‘ఫ్రాన్సెస్కో పిజ్జరియా’ అనే కంపెనీ డ్రోన్ ద్వారా పిజ్జా అందజేసినట్లు వార్త వచ్చినందున ‘మేమే ఫస్ట్’ అన్న రష్యా కంపెనీ వాదనపై అనుమానం కలుగుతోంది. కాగా, వ్యాపార నిర్వహణలో మానవ శ్రమ పాత్రను తగ్గించి మరిన్ని లాభాలు పోగేసుకునేందుకు వ్యాపార వర్గాలు చేస్తున్న కృషి మరో ముందడుగు/వెనకడుగు పడినట్లయింది.

డోడో పిజ్జా చెబుతున్న ఎగిరే పిజ్జా డెలివరీ రష్యాలోని సిక్తివ్కర్ నగరంలో జరిగింది. 30 నిమిషాల్లోనే ఆర్డర్ ని పూర్తి చేయగలిగామని కంపెనీ సి.ఈ. ఓ ఫ్యోడోర్ ఒవ్చిన్నికోవ్ తెలిపారు.

“మాస్కో నుండి నడిచే మరో కంపెనీతో పాటు మేము ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాణిజ్య పిజ్జా డెలివరీని డ్రోన్ ద్వారా పూర్తి చేశాం. ఇప్పటివరకూ వివిధ రకాల డ్రోన్ పిజ్జా డెలివరీలను వీడియోలలో చూసాము. కానీ మేము మొదటిసారిగా నిజమైన వినియోగదారుడికి, నిజమైన పిజ్జాను, నిజంగా డ్రోన్ ద్వారా అందజేయడానికి ప్రయత్నించి విజయం సాధించాము” అని ఫ్యోడోర్ చెప్పారని పత్రికలు తెలిపాయి.

పత్రికలు ఇచ్చిన వివరాల ప్రకారం డ్రోన్ విమానానికి జి.పి.ఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ను అనుసంధానించడం ద్వారా పిజ్జా అందజేయాల్సిన ఇంటిని గుర్తిస్తారు. వీడియో కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. వీడియో రిలే ద్వారా పిజ్జా తయారీదారులు డెలివరీని పర్యవేక్షిస్తారు. పిజ్జాను బుక్ చేసుకున్న వినియోగదారుడికి ముందుగానే ఫోన్ చేసి అప్రమత్తం చేయడం ద్వారా తప్పు వ్యక్తికి పిజ్జా అందకుండా జాగ్రత్త తీసుకుంటారుట.

ఫోన్ అందుకున్న వినియోగదారుడు తన ఇంటి నుండి బైటికి రావాలి. అప్పుడు పై నుండి ఒక కేబుల్ ద్వారా పిజ్జా ప్యాకెట్ ను డ్రోన్ విమానం కిందకు దించుతుంది. అప్పటికే ఆన్ లైన్ ద్వారా వినియోగదారుడు చెల్లింపులు చేసి ఉంటారు.

డ్రోన్ విమానాన్ని ఎవరూ దొంగిలించకుండా ఉండేందుకు గానూ భూమికి 20 మీటర్ల కంటే తక్కువ ఎత్తుకు దిగకుండా జాగ్రత్త వహిస్తారు. ఒకవేళ కేబుల్ ను కిందకి లాగి డ్రోన్ ను దొంగిలించడానికి ప్రయత్నిస్తే ఆ కేబుల్ ను డ్రోన్ వదిలే విధంగా ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేసి ఉంచుతారు. కొన్ని డ్రోన్ లలో డబ్బు లేదా కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతానికి 5 కె.జి ల వరకూ పిజ్జాలను మోయగల శక్తిని డ్రోన్ లు కలిగి ఉన్నాయి. గంటకు 40 కి.మీ వేగంతో ప్రయాణించే డ్రోన్ ల ద్వారా ట్రాఫిక్ అంతరాయాలను అధిగమిస్తామని కంపెనీలు ఆశిస్తున్నాయి. మొదటి రోజు పిజ్జా డ్రోన్ డెలివరీ ద్వారా 3,500 రూబుళ్లు సంపాదించామని కంపెనీ ప్రకటించింది.

ముంబైలో మే 24 తేదీన ఫ్రాన్సెస్కా పిజ్జారియా కంపెనీ ఇదే తరహాలో పిజ్జా పంపిణీ చేసినట్లు ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఆ పని చేసినందుకు కంపెనీపై ముంబై పోలీసులు కేసు పెట్టిన వార్తలు కూడా వచ్చాయి. (పాక్ టెర్రరిస్టులు గాలిలో నుండి వచ్చి దాడులు చేసేందుకు పధకం రచిస్తున్నారని ముంబై దాడుల దోషి ఒకరు సమాచారం ఇవ్వడంతో ఇలాంటి అనుమతిని పోలీసులు తప్పనిసరి చేశారు.)

డోడో సి.ఈ.ఓ చెప్పిందాన్ని బట్టి ముంబైలో చేసింది ప్రయోగాత్మకం అని భావించాలేమో.

 

వ్యాఖ్యానించండి