ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ పెట్టుబడుల నిర్వచనానికి సంబంధించి మాయారాం కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ), విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐ)… ఈ పదబంధాల నిర్వచనాలను హేతుబద్ధం చేయడానికి ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం నేతృత్వంలో ఒక కమిటీని నియమించగా అది శనివారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సదరు నివేదిక చేసిన సిఫారసులను ఆమోదిస్తున్నట్లుగా కేంద్రం ఈ రోజు (సోమవారం, జూన్ 23) ప్రకటించింది.
ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ లను ఏయే అంశాలలో విభిన్నంగా చూడాలి అన్న విషయంలో ఇంతవరకూ ఒక స్పష్టమైన విభజన రేఖ లేదని పరిశీలకులు, విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. ప్రభుత్వమే పూనుకుని విదేశీ పెట్టుబడుల విషయంలో స్పష్టమైన అవగాహనను రూపొందించాలని వ్యాపార వర్గాలు కూడా కోరుతూ వచ్చాయి. ఈ డిమాండ్ల మేరకు ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం నేతృత్వంలో కమిటీని నియమించారు. ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ, ఎఫ్.పి.ఐ (ఫారెన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్స్) తదితర పెట్టుబడుల విషయంలో ఒక స్పష్టతను ఇస్తూ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. సదరు సిఫారసులు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.
-
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దీర్ఘకాలిక స్వభావం కలిగి ఉంటాయి. ఎఫ్.ఐ.ఐ లు స్వల్పకాలిక (సంవత్సరం లేదా అంతకంటే తక్కువ) స్వభావం కలిగి ఉంటాయి.
-
దీర్ఘకాలం పాటు దేశంలో కార్యకలాపాలు నిర్వహించడం వలన ఎఫ్.డి.ఐ లు దీర్ఘకాల సంబంధాలను కూడా దేశంలో కలిగి ఉంటాయి. ఎఫ్.ఐ.ఐ ల విషయంలో మదుపుదారుడు మరియు కంపెనీల మధ్య సంబంధం ప్రధానంగా గోప్యంతో కుడి ఉండవచ్చు. అనగా మదుపుదారుల వివరాలు పెద్దగా తెలియకుండానే కంపెనీలలోని షేర్లలోగానీ లేదా సార్వభౌమ ఋణ పత్రాలలో గానీ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇవ్వవచ్చు.
-
లిస్టెడ్ కంపెనీలో విదేశీ మదుపుదారులు 10 శాతానికి మించి పెట్టుబడి పెడితే దానిని ఎఫ్.డి.ఐ గా పరిగణించాలి.
-
లిస్టెడ్ కాని కంపెనీలో విదేశీ పెట్టుబడి ఎంత ఉన్నప్పటికీ దానిని ఎఫ్.డి.ఐ గా పరిగణించాలి.
-
ఎన్.ఆర్.ఐ లు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లని విధంగా దేశంలో మదుపు చేసినట్లయితే అలాంటి పెట్టుబడులను దేశీయ పెట్టుబడులుగానే పరిగణించాలి. వాటికి ఎఫ్.డి.ఐ లకు విధించే పరిమితులను అమలు చేయరాదు.
-
ఒక విదేశీ మదుపుదారుడు ఒక దేశీయ కంపెనీలో 10 శాతం కంటే తక్కువ కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా మదుపు చేసిన సంవత్సరం లోపు దానిని 10 శాతం లేదా అంతకు ఎక్కువగా పెంచినట్లయితే దానిని ఎఫ్.డి.ఐ గా పరిగణించాలి. సంవత్సరం లోపు 10 శాతం మించని పక్షంలో దానిని ఎఫ్.ఐ.ఐ/పోర్ట్ ఫోలియో పెట్టుబడిగా పరిగణించాలి.
-
ఎఫ్.డి.ఐ లపైన వివిధ రంగాలలో విధించబడిన పరిమితికి లోబడి ఉండాలి. ఉదాహరణకి భీమా రంగంలో 51 శాతం మాత్రమే ఎఫ్.డి.ఐ లకు అనుమతి ఉంది. ఇలాంటి చట్టబద్ధ పరిమితులను ఎఫ్.డి.ఐ లు మించరాదు.
-
ఈక్విటీ షేర్ల రూపం లో గానీ, కంపల్సరీలీ కన్వర్టిబిల్ ప్రిఫరెన్స్ షేర్లు/డిబెంచర్ల రూపంలో గానీ 10 శాతం లోపు పెట్టుబడులు వస్తే వాటిని ఎఫ్.పి.ఐలుగా పరిగణించాలి.
-
ఎఫ్.ఐ.ఐ మరియు క్యూ.ఎఫ్.ఐ (క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్) లను ఎఫ్.పి.ఐ లలో భాగంగా పరిగణించాలి.
-
ఎఫ్.పి.ఐ లు 10 శాతం వ్యక్తిగత పరిమితి దాటకుండా ఉండేలా ఇక నుండి సెబి పర్యవేక్షిస్తుంది. మొత్తం (agregate) పరిమితి 10 శాతం దాటకుండా ఇప్పటివరకు ఇది ఆర్.బి.ఐ పర్యవేక్షిస్తోంది. ఇక ముందు కూడా దానిని కొనసాగించాలి.
-
ఎన్.ఆర్.ఐ లు విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలను స్ధాపించి ఆ కంపెనీల ద్వారా దేశంలో పెట్టుబడులు పెట్టాలని భావించవచ్చు. 2003లో వీటికి గుర్తింపు రద్దు చేశారు. తగిన రక్షణలను ఏర్పాటు చేసుకుని ఇలాంటి పెట్టుబడులను తిరిగి పునరుద్ధరించాలి. తద్వారా ఎన్.ఆర్.ఐ పెట్టుబడులు పెరిగేందుకు వీలు కల్పించాలి.
-
ఫారెన్ వెంచర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పధకం (ఎఫ్.వి.సి.ఐ) కింద వచ్చే పెట్టుబడులు మౌలికంగా ఎఫ్.డి.ఐ ల రూపంలో ఉంటున్నందున వీటిని పునఃపరిశీలించాలి.
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ జులై 10 తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు పత్రికలు చెబుతున్నాయి. నూతన బడ్జెట్ లో చేసే ప్రతిపాదనలను మాయారాం కమిటీ సిఫారసుల వెలుగులో పరిశీలించాల్సి ఉంటుంది.
వృద్ధి కోసమే విధానాలు
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జి20 అధికార స్ధాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరయిన అరవింద్ మాయారాం కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాలు పూర్తిగా ఆర్ధిక వృద్ధి (జి.డి.పి గ్రోత్) ని లక్ష్యంగా చేసుకుంటాయని హామీ ఇచ్చారు. “భారత దేశం నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. నూతన ప్రభుత్వ ప్రాధామ్యాలకు అనుగుణంగా మేము మా వృద్ధి వ్యూహాలను శక్తివంతం చేసుకోబోతున్నాము. ఈ వ్యూహాలు వృద్ధిని లక్ష్యం చేసుకునే ఉంటాయని నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశాన్ని ఉన్నత వృద్ధి పధంలో నిలపడానికి సంస్కరణలను మరింత లోతుగా అమలు చేస్తాము” అని అరవింద్ మాయారాం జి20 సమావేశాలలో హామీ ఇచ్చారు.
అయితే తాము ఏ సంస్కరణలను తేబోతున్నదీ నిర్దిష్టమైన వివరాలను మాయారాం ఇవ్వలేదు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా విదేశాల్లో ముందే విధానాలను బయటపెట్టడం చట్ట విరుద్ధం అవుతుంది. కాబట్టి మాయారం ఆమేరకు సంయమనం పాటించినట్లు కనిపిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం నెలకొని ఉన్న పరిస్ధితుల్లో ఆర్ధిక మంత్రి ఏయే సంస్కరణలు ప్రవేశపెట్టనున్నదీ తెలుసుకోవడానికి విదేశీ బహుళజాతి కంపెనీలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. “కఠిన నిర్ణయాలు తప్పవు” అని ప్రధాని మోడి ప్రకటించిన కొద్ది రోజులకే రైల్వే ఛార్జీలను అమాంతం పెంచడం ద్వారా తమ సంస్కరణల మార్గం ఏమిటో కొత్త ప్రభుత్వం ఇప్పటికే చాటింది.

వి. శేఖర్ గారు నాదో చిన్న సందేహం.
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్ల డబ్బు వెనక్కి తీసుకురావాలని విపక్షాలు, తీసుకొస్తామని అధికార పక్షమూ చెబుతున్నాయి కదా..? అసలు మనదేశం నుంచి వేరే దేశానికి డబ్బు ఎలా తరలిస్తారు. ( సూట్ కేసులతో మోసుకుపోలేరు కదా…?) అలా తరలిస్తున్న డబ్బుపై ఎలాంటి నిఘా ఉండదా..? ఉన్నా కూడా లక్షల కోట్లు విదేశాలకు తరలిపోయిందంటే సంబంధిత అధికారులు కూడా ఇందుకు సహకరిస్తున్నట్లే కదా. మరి వాళ్లపై కూడా చర్యలు ఉండాలిగా..? ఇప్పుడు విదేశాల నుంచి నల్ల డబ్బు తీసుకొస్తారు సరే…మరి భవిష్యత్ లో కూడా అలా తరలించరని చెప్పలేం కదా…? మరి దాన్ని ఎలా అడ్డుకుంటారు…? వీలైనప్పుడు ఓ మంచి పోస్టు రాయరా..?