‘రాజు గారు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అని సామెత. మన ఎం.పిలు, ఎమ్మేల్యేలు ఆధునిక రాజులు కదా, వారు తలచుకున్నా అదే పరిస్ధితి సంభవించగలదు.
లేకపోతే ఎం.పి గారి ఇంటి ఆవరణలోని పనస చెట్టు నుండి పనస పండ్లను దొంగిలించిన దొంగ కోసం పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం, ఆధునిక అపరాధ పరిశోధన పద్ధతులన్నీ ప్రయోగించడం… ఎలా అర్ధం చేసుకోవాలి?
ఎఎపి ప్రభుత్వం విదేశీ వ్యభిచార గృహాలపై దాడులు చేయమన్నా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగిన ఢిల్లీ పోలీసులు ఇలాంటి విపరీత అపరాధ పరిశోధనకు సిద్ధం కావడం మరో విశేషం.
ఉత్తర ప్రదేశ్ కి చెందిన జనతాదళ్ (యునైటెడ్) పార్టీ రాజ్య సభ సభ్యులు మహేంద్ర ప్రసాద్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో నివసిస్తున్నారు. నంబర్ 4 లోని ఆయన నివాస ప్రాంగణంలో ఒక పనస చెట్టు, దానికి తొమ్మిది కాయలు ఉన్నాయి. శుక్రవారం ఉదయాన్నే నిద్ర లేచిన ఎం.పి గారు తొమ్మిది కాయల్లో రెండు లేకపోవడం గుర్తించారు. అంతే, అక్కడి నుండి మొదలైంది జాతర!
దొంగతనం గురించి ఓ సీనియర్ పోలీసు అధికారి ఇలా చెప్పారు. “దొంగతనం గురించి ఫిర్యాదు చేయడానికి ఎం.పి గారి వ్యక్తిగత సహాయకులు మాకు ఫోన్ చేశారు. వెంటనే మా అధికారుల బృందం అక్కడికి వెళ్లింది. చెట్టుకి ఉన్న తొమ్మిది పనస పళ్లలో రెండు మాయం కావడం మా బృందం గుర్తించింది. ఎం.పి గారు ఉదయాన్నే దాన్ని గుర్తించి తన వ్యక్తిగత సహాయకుడిని అప్రమత్తం చేశారు. ఆయన మాకు ఫిర్యాదు చేశారు. పి.ఎ ఫిర్యాదు ఆధారంగా మేము దొంగతనం కేసు నమోదు చేశాము. కేసును పరిశోధిస్తున్నాము.”
పరిశోధక బృందం అంటే అలాంటి ఇలాంటి బృందం కాదు. ఆధునిక అపరాధ పరిశోధనలో ఎన్ని విభాగాలు పాలు పంచుకుంటాయో ఆ విభాగాలన్నీ తమ తమ ప్రతినిధులను పంపాయి. వేలి ముద్రల బ్యూరో నుండి నిపుణుడిని పంపారు. నేర పరిశోధన విభాగం నుండి నిపుణులు వెళ్లారు. దొంగలు వదిలి వెళ్ళే ఆచూకీ (క్లూ) లను కనిపెట్టడానికి కొందరు బయలుదేరి వెళ్లారు. పాద ముద్రలను పసిగట్టే నిపుణులూ వెళ్లారు. వారంతా కలిసి మొత్తం 10 మంది ఎం.పి తోటలోకి ప్రవేశించి అణువణువూ పరిశోధించడం ప్రారంభించారు.
పరిశోధన బృందం సభ్యులు తోట అంతా తిరుగుతూ దొంగలను పట్టిచ్చే క్లూల కోసం తెగ వెతికారు. తోటలోను, పెరడు లోనూ లభించిన వేలి ముద్రలను సేకరించారు. దొంగ/లు వచ్చి వెళ్ళిన మార్గం తెలుసుకోవడానికి పాద ముద్రలు సేకరించారు. పాద ముద్రల పొడవు, వెడల్పులు కొలిచి రికార్డు చేశారు. కంచె దూకి వచ్చారా లేక దర్జాగా గేట్ లోనుండే వచ్చారా అన్నది కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ దొంగతనం చివరికి ఎం.పి గారి భద్రతకు రానున్న ప్రమాదాన్ని సూచిస్తోందా అన్న కోణంలోనూ ఆలోచిస్తూ తలలు బద్దలు కొట్టుకుంటూ ఉన్నారు.
పోలీసు అధికారి ఏమి చెప్పారో చూడండి. “నేర స్ధలాన్ని అతి సమీపంగా పరిశీలించాము. మా పరిశోధనల్లో ఒక పాద ముద్రల దారిని కనుగొన్నాము. పాద ముద్ర దాదాపు 6 అంగుళాల పొడవు ఉంది. అది, పనస పండు దొంగిలించడానికి కంచె దూకి వచ్చిన పిల్లలది అయి ఉండాలి. కానీ బంగళా వద్ద ఉన్న సెక్యూరిటీ విషయంలో తీవ్ర అనుమానాలను ఈ కేసు రేపుతోంది” అని చెప్పారాయన.
అంతటితో ఆగలేదు పోలీసులు. తాము సేకరించిన వేలి ముద్రలు, పాద ముద్రలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపారు. నిందితులను పట్టుకోవడానికి పరిశోధకులు చురుకుగా వ్యవహరించాలన్న ఆదేశాలు కూడా బృందం సభ్యులకు వెళ్ళాయిట. ఫోరెన్సిక్ నివేదిక రావడానికి సమయం పడుతుంది. ఆ లోపు బంగళాలో పని చేసే సెక్యూరిటీ గార్డులు, పని మనుషులు, డ్రైవర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఎం.పి గారి బంగ్లా బైట సి.సి.టి.వి అప్పటికే అమర్చి పెట్టారు. అలాగే బంగ్లా పెరడులో కూడా మరో సి.సి.టి.వి ఉంచారు. ఈ రెండు సి.సి కెమెరాల ఫుటేజీ సేకరించి దానిని విశ్లేషించే పనిని కూడా పోలీసులు చేపట్టారు.
మనది రాజుల కాలమా లేక ప్రజలే రాజులని చెప్పే ప్రజాస్వామ్య కాలమా అన్న అనుమానాలు ఇంకా అవసరమా?
