“రాజీనామా? అబ్బే కాదు. గెంటేశారు!!”
***
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత ప్రభుత్వం తాలూకు వాసనలను వదిలించుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల గవర్నర్ లను మార్చడానికి మోడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే కొందరు గవర్నర్ లు అందుకు సహకరించడానికి సిద్ధంగా లేరు. దానితో బి.జె.పి మండిపడుతోంది.
ముఖ్యంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహా రాష్ట్ర రాష్ట్రాల గవర్నర్లు తమకు రాజీనామా చేసే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేయడంతో వారిపై బి.జె.పి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినపుడు పాత ప్రభుత్వం చేసిన రాజకీయ నియామకాలు కూడా రద్దు కావడం సబబుగా ఉంటుందని, కానీ కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా వ్యవరిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారని పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు పత్రికలకు ఎక్కారు.
మొదటి ఎన్.డి.ఏ ప్రభుత్వం అనంతరం అధికారంలోకి వచ్చిన యు.పి.ఏ-I ప్రభుత్వం కూడా బి.జె.పి నియమించిన గవర్నర్ లను తొలగించిన విషయాన్ని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. ప్రభుత్వం మారినపుడు దానితో పాటు ఆ ప్రభుత్వ నియామకాలు కూడా మారాల్సిందేననీ, అలాగయితేనే వ్యవస్ధ సక్రమంగా సాగుతుందని వెంకయ్య నాయుడు ఒక తత్వ బోధన కావించారు. సూత్రాలు యు.పి.ఏ కి ఒక విధంగా ఎన్.డి.ఏ కి ఒక విధంగా ఉండబోవని ఆయన వివరించారు.
అయితే ఎన్.డి.ఏ ప్రభుత్వం రాజకీయ నియామకాలు చేయబోదన్న హామీ మాత్రం వెంకయ్య నాయుడు ఇవ్వలేదు. గవర్నర్ లుగా రాజకీయ నేతలను నియమించరాదని దేశం అంతా ఏకాభిప్రాయం(?) వహిస్తే అప్పుడు దాన్ని అనుసరించడానికి తమకు అభ్యంతరం లేదని వెంకయ్య ముక్తాయించారు. సూత్రాలు అందరికీ ఒకే విధంగా వర్తించాలన్న సూత్రాన్ని వెంకయ్య గారే ఆ విధంగా పూర్వపక్షం చేసేశారు.

Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: కాంగ్రెస్ గవర్నర్ల గెంటివేత -కార్టూన్ | ugiridharaprasad
ఒక అత్యున్నత రాజ్యాంగ పదవిని ఈ విధంగా అపహాస్యం పాలు చేయడం మన రాజకీయ పార్టీలకే చెల్లింది.
మన దేశంలో అత్యంత వివాదాస్పదమైన పదవి ఏదైనా ఉందంటే అది గవర్నర్ పదవే. ఎన్నికల్లో ఓడిపోయిన (షీలా దీక్షిత్) లేదా వయసు మీరిపోయిన రాజకీయ నాయకులకు (తివారీ) పునరావాస కేంద్రంగా మారిందనే ఆరోపణలూ ఉన్నాయి. అసలు గవర్నర్ పదవినే రద్దు చేయాలని జయప్రకాశ్ నారాయణ (లోక్ సత్తా) లాంటి వాళ్లు పదేపదే చెబుతుంటారు.
ఇక ప్రస్తుత విషయానికొస్తే…బీజేపీ, కాంగ్రెస్ (నియమించిన) గవర్నర్లను ఇంటికి సాగనంపాలనుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఇది కొత్త సంగతో ఇంతవరకూ జరగనిదో కాదు. ఆఖరుకు ఈ గవర్నర్ల తొలగింపు యవారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది కదా. అవసరమైతే రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా సమీక్షిస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కూడా రాజకీయ దురుద్దేశాలతో గవర్నర్ లను నియమించకూడదనే.
సర్వం భ్రష్టుపట్టి పోయిన రాజకీయ వ్యవస్థలో….గవర్నర్లు ఆ మాట కొస్తే రాష్ట్రపతులు, సైన్యాధిపతుల నియామకాలు వివాదం కావడంలో ఆశ్చర్యం ఏముంది.