సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఈ రోజుల్లోనే చైనా యువత ‘పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యం’ అనే ఎండమావి కోసం వీధులకెక్కి నినదించారు. 1911 ప్రాంతంలో ఆనాటి జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమ రధసారధి డాక్టర్ సన్ యెట్ సేన్ జ్ఞాపకాలను అపహాస్యం చేస్తూ చైనీయ యువత మిడి మిడి జ్ఞానంతో పశ్చిమ దేశాల్లో నిజమైన ప్రజాస్వామ్యం ఉందని నమ్మారు. అలాంటి ప్రజాస్వామ్యమే చైనాలో ప్రవేశపెట్టాలని కోరుతూ వేలాది మంది యువత, విద్యార్ధులు బీజింగ్ చేరుకుని చరిత్రాత్మక తీయానాన్మెన్ స్క్వేర్ లో రోజుల తరబడి ఆక్రమణ ప్రదర్శన నిర్వహించారు. ఏప్రిల్ లో మొదలయిన ప్రదర్శన జూన్ 4 తేదీన పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా హింసాత్మక జోక్యంతో ముగిశాయి.
ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఎంతమంది వాస్తవంగా చనిపోయారో ఇంకా లెక్క తెలియదు. చైనా ప్రభుత్వం లెక్క వందల్లో ఉంటే పశ్చిమ పత్రికల లెక్క పదుల వేలల్లో ఉంటుంది. చనిపోయింది ఎంతమందైనా చైనాలో బొత్తిగా ప్రజాస్వామిక వాతావరణం లేదన్న వాస్తవాన్ని ఈ ప్రదర్శనలు, ఆందోళనలు లోకానికి చాటాయి. పశ్చిమ దేశాల్లో చదువుకుని అక్కడి బూటకపు ప్రజాస్వామ్య భావాలను ఒంట బట్టించుకున్న యువత అనేకం ఈ ఆందోళనలకు నాయకత్వం వహించారు. ప్రభుత్వ విధానాలపైనా, వారి ధనిక వివక్షా పూరిత పాలనపైనా అసంతృప్తి పెంచుకున్న ఇతర వర్గాల ప్రజలు కూడా వారికి తోడయ్యారు.
అయితే విద్యార్ధుల ఆందోళన పట్ల చైనా ప్రభుత్వం ప్రారంభంలో కాస్త మెతకగానే వ్యవహరించింది. ఆందోళన నేతలతో చర్చించి వారి కోరికలను నెరవేర్చేందుకు చర్చలు జరిపారు. వారికి పాలనాపరమైన చర్యల విషయంలో రాయితీలు ఇస్తామని (కేసులు ఉండవని మొ.వి) కూడా చెప్పారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. తమ ఆందోళనలను కొనసాగించారు. ఆనాటి సంస్కరణల నాయకుడు యు యావో బాంగ్ మరణంతో మొదలయిన ఆందోళనలు రాజకీయ సంస్కరణల కోసం విద్యార్ధి నాయకులు కొందరు ఆమరణ దీక్షకు కూర్చోవడంతో విస్తృతంగా వ్యాపించాయి. దేశవ్యాపితంగా అనేక నగరాలకు విస్తరించాయి. దానితో డెంగ్ జియావో పింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ వర్గాలు ఆందోళనలపై ఉక్కుపాదం మోపడానికి నిర్ణయించాయి.
ఆందోళన విద్యార్ధుల ప్రారంభించినప్పటికీ అవి వాస్తవంగా చైనాలోని వివిధ పాలక గ్రూపుల మధ్య తగాదాలకు ప్రతిబింబం మాత్రమే. వేగంగా రాజకీయ, ఆర్ధిక సంస్కరణలు చేయాలని హు నేతృత్వంలోని ముఠా డిమాండ్ చేశారు. అలా చేస్తే నష్టపోతామని భావించిన డెంగ్ ముఠా ఒక పద్ధతి ప్రకారం సంస్కరణలు తేవాలని నిర్ణయించారు. అనగా డెంగ్ ముఠా, హు ముఠాల మధ్య సంస్కరణలు తేవడంలో విభేదాలు లేవు. కేవలం వాటిని తేవాల్సిన వేగం పైనే విభేదాలు. ఈ విభేదాల పరిష్కారం విద్యార్ధుల ఉద్యమం ద్వారా చేసుకుందామని ఒక ముఠా ప్రయత్నిస్తే దానిని అణచివేత ద్వారా అధికార ముఠా తిరస్కరించింది.
మావో మరణం వరకూ సోషలిస్టు నిర్మాణం భేషుగ్గా అమలు కావడం వలన అక్కడి ప్రజలు సుఖ శాంతులతో గడిపారు. భారీ జనాభాకు కావలసిన ఉత్పత్తిని ప్రణాళికల సాయంతో చేయగలిగారు. కానీ మావో మరణానంతరం విప్లవ నాయకులను ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ పేరుతో అసత్య ఆరోపణలు చేసి డెంగ్ ముఠా చంపించింది. అనంతరం పెట్టుబడిదారీ సంస్కరణలను అమలు చేయడం ప్రారంభించారు డెంగ్ ముఠా. ఈ విధానాలు సహజంగానే ప్రజల్లో వైరి వర్గాలను సృష్టించాయి. ధనిక, బీద తేడాలు తెచ్చాయి. పట్టణ, గ్రామ వైరుధ్యాలను తీవ్రం చేశాయి. దానితో ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది.
జూన్ 4, 1989 తేదీన కాల్పులకు దారి తీసిన ఆందోళనలు ఈ అసంతృప్తినే ప్రధానంగా వ్యక్తం చేసింది. కానీ ప్రజల అసంతృప్తిని ‘పశ్చిమ తరహా ప్రజాస్వామ్యం కోసం’ ఉద్యమంగా ప్రచారం చేయడంలో ఉద్యమ నేతలు సఫలం కాగా ఆ ప్రచారాన్ని పశ్చిమ పత్రికలు విస్తృతంగా మోసి పెట్టాయి.
పశ్చిమ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉత్త డొల్ల, ఒక ఎండమావి. అక్కడ ధనిక వర్గాలకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది. వారికి కష్టం కలిగితే దాన్ని తీర్చడానికి కార్మిక వర్గమే త్యాగాలు చేసి, పొదుపు చేసి వారికి మరిన్ని లాభాలు వచ్చేలా సహకరించాలి. ఇదే అక్కడి ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యం కావాలని ఆందోళన చేయడం అంటే నేటి బీరలో నెయ్యి కోసం, ఎండమావిలో నీళ్ళ కోసం ఆందోళన చేయడమే.
ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది. ఇందులో మొదటి ఫోటో ప్రపంచ వ్యాపితంగా ప్రసిద్ధి పొందింది. ట్యాంకులకు ఎదురోడ్డి నిలబడిన ఆ కార్యకర్త సైనికులు, ట్యాంకులు ఉద్యమ స్ధలం తీయానాన్మెన్ స్క్వేర్ దగ్గరికి వెళ్లకుండా ఆపాలని ప్రయత్నించారు. ఈ ఫోటోను పశ్చిమ పత్రికలు ఇప్పటికీ ఇష్టంగా ప్రచురిస్తాయి. ఆ పేరు తెలియని ఉద్యమకారుడిని కీర్తిస్తాయి.




























ఆరోగ్యం సహకరించాకపోయిన ట పా లు ఎలా రాస్త్నరండి మీరు :-)
ఈ రాజకీయాలు….అవీ తర్వాత తీరిగ్గా చర్చిద్దాం లేండి సార్. ముందు బాగా విశ్రాంతి తీసుకోండి సార్.