“మిత్రులారా, ఈ ప్రభుత్వం తప్పులు చేసేవరకూనో లేదా కొత్త పంచింగ్ బ్యాగ్ దొరికేవరకూనో -ఈ రెండిట్లో ఏది ముందోస్తే అంతవరకూ కాస్త ఓపిక పట్టండి…”
*** *** ***
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి వివిధ ప్రాంతాల్లోని ఎఎపి నాయకులు వరుస కట్టి రాజీనామాలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేసేస్తే మరికొందరు పార్టీ సభ్యత్వాన్ని అట్టే పెట్టుకుని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు.
బహుశా వీళ్ళంతా పార్లమెంటు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏవో అద్భుతాలు సాధిస్తుందని భ్రమలు పెట్టుకున్నవారై ఉండాలి. లేదా ఆవేశంలో పార్టీలో చేరిపోయి పార్టీ ఓటమి దెబ్బ తిన్నాక గానీ రాజకీయాల లోతు ఏమిటో అనుభవంలోకి వచ్చినవారై ఉండాలి.
ఎవరు ఎందుకు రాజీనామాలు చేసినా తమ చేతగానితనాన్ని, దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుతూ పార్టీపైన, నాయకత్వం పైనా రాళ్ళు విసరడమే అభ్యంతరకరం. రాజకీయాలు, అందునా పాటుకుపోయిన రాజకీయ పార్టీల అవినీతిని వ్యతిరేకించే రాజకీయాలు ఒక్క ఎన్నికల సంరంభంతో సాధ్యం అయ్యేపనైతే అసలు అవినీతి ఇన్నాళ్లూ నిలిచి ఉండేదా?
పారిపోతున్న నాయకులు విసిరే రాళ్ళు ఒక విషయం అయితే ఎఎపి పార్టీ నేతలు ఒక నిర్దిష్ట విధాన ప్రకటన చేయలేని బలహీనతలోనే ఇంకా కొట్టుమిట్టాడడం మరో విషయం. వారా బలహీనతలో ఉన్నంత కాలం వారు చేసే రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండబోదు. కార్టూన్ లో పేర్కొన్నట్లు ఒకదాని తర్వాత మరొక పంచింగ్ బ్యాంగ్ కోసం ఎదురు చూడడంతోనూ, పెద్ద పార్టీల తప్పులను విమర్శించడంలోనూ కాలం హరించుకుపోతుందే తప్ప ప్రజలకు నిర్దిష్టమైన ప్రత్యామ్నాయాన్ని మాత్రం వారు అందించలేరు.
