మోడి: భారతీయ మోషే! -కార్టూన్


Modi tablets

భారత ప్రధాని నరేంద్ర మోడిని భారతీయ మోషే (మోజెస్) గా కార్టూనిస్టు చిత్రీకరించారు. ఎన్నికలకు ముందు మోడీకి ప్రచార సారధ్యం అప్పగించడం ద్వారా ప్రధాని పదవికి ఆయనే అభ్యర్ధి అని బి.జె.పి ప్రకటించినప్పుడు అలిగి తూలనాడిన పార్టీ సీనియర్లను మోడి తెచ్చిన టెన్ కమాండ్ మెంట్స్ ఫలకాలను మోసుకు తిరగడానికి ఎదురు చూస్తున్నవారిగా కేశవ్ చిత్రీకరించారు. మోడి కష్టాన్ని అనుభవించడానికి బి.జె.పి సీనియర్లు ఎదురు చూస్తున్నారని చురక అంటించారు.

***

క్రైస్తవ పురాణంలో మోజెస్ కధ తెలుసా?

అది క్రీస్తు పుట్టుక ముందు సంగతి. మోషే అనే పెద్దాయనకి యెహోవా దేవుడు పది సూత్రాలను (Ten Commandments) లిఖించి ఉన్న రెండు ఫలకాలను అప్పగించి వాటిని మానవులంతా పాటించేలా ప్రచారం చేయాలని ప్రభోధించినట్లు పాత బైబిల్ చెబుతుంది. జుడాయిజం (యూదు మతం) లో కూడా దాదాపు ఇదే కధ ఉంటుంది. కాకపోతే యూదులకు యెహోవా తప్ప దైవం అంటూ లేరు. ఆ యెహోవాను కూడా ఒక మూర్తి లేని శక్తిగా భావిస్తారు.

కధ ప్రకారం మౌంట్ సినాయ్ అనే కొండవద్దకు ఇజ్రాయెల్ కుమారులు (ఇజ్రాయెల్ ప్రజలు) వచ్చి బస చేస్తారు. మూడో రోజున కొండపైన ఉరుములు, మెరుపులతో కూడిన చీకటి వాతావరణం ఏర్పడి పై నుండి ఒక గొంతు వినిపిస్తుంది. అక్కడికి మోషే వెళ్ళి కొద్దిసేపటికి తిరిగి వచ్చి వినడానికి సిద్ధం కమ్మని చెబుతాడు. అప్పుడా గొంతు పది సూత్రాలను పెద్దగా వినిపిస్తుంది. దానికి ఇతరులు అందరూ భయపడిపోతారు. భయపడవద్దని చెప్పిన మోషే మిగిలిన సూత్రాలను వినడానికి ఒక్కడే చీకటి నిండిన కొండపైకి వెళ్తారు. అలా వెళ్ళడం వెళ్ళడం మోషే 40 పగళ్ళు 40 రాత్రుల వరకు తిరిగి రాడు.

దానితో మోషే ఇక తిరిగి రాడని భావించిన ఆయన ఇజ్రాయేలీయులు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో కోడె దూడ ఆకారాన్ని తయారు చేసి వేదికపై ఉంచి దాన్ని పూజించడం ప్రారంభిస్తారు. బంగారు కోడెను తయారు చేసిన ఆరన్ అనే వ్యక్తి ఆ తర్వాత రోజును విందు దినంగా ప్రకటించి దేవుడికి ఆర్పణలు (బలి?) ఇవ్వడానికి సిద్ధం కమ్మంటాడు. ఆ తర్వాత రోజున ఆరన్ చెప్పినట్లే విందులో మునిగిపోతారు ఇజ్రాయేలీయులు. 

40 రాత్రులు, 40 పగళ్ళు తర్వాత తిరిగి వచ్చిన మోషే తన శిష్యుల వ్యవహారం చూసి కోపోద్రిక్తుడవుతాడు. ఆయన కొండపై ఉండగానే ఈ శిష్యుల వ్యవహారాన్ని మోషేకి చెప్పిన దేవుడు తన సూత్రాలను ఉల్లంఘించి (విగ్రహారాధన కూడదు అన్నది పది సూత్రాల్లో ఒకటి) పాపులుగా మారిన వారిని సంహరించి టెన్ కమాండ్ మెంట్స్ ప్రచారానికి కొత్త బృందాన్ని తయారు చేసుకొమ్మంటాడు. కానీ ఇజ్రాయేలీయుల తరపున మోషే శరణు కోరి తాను వారిని మార్చుతానని చెప్పి తిరిగి వస్తాడు మోషే.

కానీ వెనక్కి వచ్చాక శిష్యుల ధోరణితో కోపం చెంది తన చేతుల్లో ఉన్న ఫలకాలను విసిరివేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ యెహోవా కనిపించి మరొకసారి పది సూత్రాలను రాసి ఇచ్చి ప్రచారం చేయమంటాడు. ఆ విధంగా మోషే పొందిన దైవ జ్ఞానాన్ని మానవ జాతికి తెలియజేసే కర్తవ్యాన్ని మోషే శిష్యులు తలకెత్తుకుంటారు.

***

ఈ కధని కార్టూనిస్టు మోడి, బి.జె.పి/ఇండియా, బి.జె.పి సీనియర్ నేతలకు అన్వయించారు. మోడి యేమో బి.జె.పి లేదా ఇండియా కోసం అవతరించిన మోషే. జనం (దేవుడు) ఇచ్చిన టెన్ కమాండ్ మెంట్స్ (అధికారం, పదవులు మొ.వి) ని రెండు ఫలకాలు రూపంలో మోడి తెచ్చారు.

అందుకోసం ఆయన ఎన్నికల ప్రచారం, వ్యూహ ప్రతి వ్యూహాలు లాంటి కష్టాలను (కొండపై చీకట్లో 40 పగళ్ళు, 40 రాత్రుల పాటు మోషే పడిన కష్టం లాంటిది) అధిగమించారు. ప్రచారంలో భాగం పంచుకోని సీనియర్లు మోడి అధికారం తేగలరా లేదా అని అనుమానపడుతూ కూర్చుండిపోయారు. తీరా ఆయన నిజంగానే అధికారం తెచ్చాక దాన్ని అనుభవించే బాధ్యతను నెత్తిన వేసుకోవడానికి సిద్ధపడుతున్నారని కార్టూనిస్టు ఎత్తి చూపుతున్నారు.

వ్యాఖ్యానించండి