ఆపదలో స్త్రీని ఎందరు ఆదుకుంటారు? -ప్రయోగం (వీడియో)


“YesNoMaybe” అన్న పేరుతో ఓ ఫిల్మ్ మేకింగ్ సంస్ధ ఉంది(ట). ఆ సంస్ధ వాళ్ళు ఈ మధ్య ఒక ప్రయోగం చేశారు.

ఢిల్లీ బస్సు అత్యాచారానికి వ్యతిరేకంగా లక్షలమంది దేశవ్యాపితంగా స్పందించారు. కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్లకార్డులు రాసుకుని ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోనైతే ఏకంగా పోలీసులతో యుద్ధమే చేశారు.

అయితే నిజంగా ఒక స్త్రీ ఆపదలో ఉండి ఆర్తనాదం చేస్తే ఆమెను ఆదుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి “YesNoMaybe” వాళ్ళు ప్రాక్టికల్ గానే ఒక ప్రయోగం చేశారు. అది కూడా ఢిల్లీలోనే.

వారేం చేశారంటే: ఢిల్లీలో మారుమూల అనుకున్న వీధిలో ఓ కారును పార్క్ చేసి ఉంచారు. అందులో ఒక స్త్రీ ఆర్తనాదం చేస్తూ సహాయం చేయమని వేడుకుంటున్నట్లుగా రికార్డు చేసిన ఆడియోని ఉంచారు. ఎవరన్నా ఆ కారు పక్కగా పోయినప్పుడు రిమోట్ ద్వారానో, లోపల ఎవరన్నా కూర్చునో ఆడియో ప్లే చేశారు.

అలా స్త్రీ ఆర్తనాదాలకు ఎవరెవరు ఎలా స్పందించారో వీడియోలో రికార్డు చేశారు.

మహిళ ఆర్తనాదాలకు కొంతమంది స్పందించిన తీరు చాలా షాకింగ్ గా ఉండడం వీడియోలో చూడవచ్చు. అంత దీనంగా మహిళలు కేకలు వేస్తున్నా ఆగి చూసి కూడా తమకేమీ పట్టనట్లు అనేకమంది వెళ్ళిపోయారు. సాయం చేయడానికి కూడా కొందరు ప్రయత్నించారు. ఆ దృశ్యాలను వీడియోలో చూడవచ్చు.

ఆ ఒంటరి యువకుడు ఆవేశంగా ప్రతిస్పందించిన తీరు చాలా సంతోషం కలిగించే విషయం. తలుపు తీయడానికి విఫలయత్నం చేసి ఒక రాయి తీసుకుని అద్దం పగలగొట్టడానికి ఆయన ప్రయత్నించారు.

ముఖ్యంగా ఆ 78 యేళ్ళ పెద్దాయన ఎలా స్పందించారో చూడండి. ఆయన ఎక్కడో గార్డుగా పని చేస్తున్నారట. చేతిలో ఉన్న కర్రని నిజంగా ఉపయోగించకుండా ఆపడానికి నిర్వాహకులకు తలకు మించిన పనయింది.

ఇలా సాయం చేయడానికి ప్రయత్నం చేసినవారితో నిర్వాహకులు కొద్ది సేపు మాట్లాడారట. నిర్వాహకుల ప్రయత్నాలని వారు అభినందించారట. నిజంగా అలాంటిది ఎదురయితే మహిళకు మద్దతుగా రంగంలోకి దిగడానికి తాము సిద్ధం అని నిశ్చయాత్మకంగా ప్రకటించారట. సదరు వదాన్యులకు జేజేలు.

8 thoughts on “ఆపదలో స్త్రీని ఎందరు ఆదుకుంటారు? -ప్రయోగం (వీడియో)

  1. మీరిచ్చిన వీడియోలో కనీసం ఇద్దరుముగ్గురైనా పట్టించుకున్నట్లు కనిపిస్తోంది. కనుక ఆడవాళ్ళ పరిస్థితి మరీ అంత దిగజారలేదని తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా నేనొక ప్రశ్న వేస్తాను. “ఆపదలో ఉన్న మగవాణ్ణి ఎంతమంది పట్టించుకుంటారు ?” దీనికి వీడియో అవసరం లేదు. ఎవరి మనసుకు వాళ్ళకే తెలుసు. నేనొకసారి పట్టపగలు ఒక బస్టాప్ ఎదురుగుండా పోతున్నప్పుడు నా బైకు టైరు కింద ఒక రాయి ఇరుక్కుని కిందపడిపోతే, ఆ బస్టాపులో 50 మంది ఉన్నా ఒక్కరూ “అయ్యో పాపం” అనలేదు. దగ్గరికొచ్చి లేవదీయలేదు. వాహనం బరువు కింద నా కాలు బాగా నలిగిపోయింది. అయినా తప్పనిసరై కాసేపటికి నా అంతట నేనే లేచి ఆ బండి నడిపించుకుంటూ డాక్టర్ దగ్గరికెళ్ళాను. ఆ తరవాత నేను రెణ్ణెల్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అదే నా స్థానంలో ఒక ఆడది ఉంటే ఎంతమంది “అయ్యో పాపం !” అనేవారో ఊహించండి. సారాంసమేంటంటే – మన సమాజపు సమస్య స్త్రీద్వేషం కాదు, అత్యంత తీవ్రమైన పురుషద్వేషం. ఇది ఆడవాళ్ళల్లో కన్నా మగవాళ్ళల్లో ఎక్కువగా ఉంది.

  2. అపదలో పురుషుడు ఉన్నా, స్త్రీ ఉన్నా చూస్తూ పట్టించుకోకపోవడం అన్యాయమే అవుతుంది. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నపుడు ఆదుకునే విషయంలో స్త్రీ, పురుష భేదం చూడలేము. కానీ ఇక్కడ విషయం అది కాదు.

    ఒకరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మన సమాజంలో స్త్రీలపై జరిగే దారుణాలకు జెండర్ కోణం ఒకటి ఉంటుంది. అలా జెండర్ కోణాన్ని చూడడంలోనే మీ అభ్యంతరం అంతా అని మీ వ్యాఖ్య చెబుతోంది. మీరు చెప్పిన మీ సొంత ఉదాహరణ, ఈ ఆర్టికల్ లో చర్చించిన అంశం రెండూ వేరు. రెండింటినీ పోల్చడం సబబు కాదు.

    ఇప్పటి సమాజం పురుషాధిక్య సమాజం అన్న అవగాహనతో ఈ బ్లాగ్ లో టపాలు ఉంటాయి. ఆ అవగాహనతోనే విభేదం ఉంటే గనుక చర్చ మరో సమతలం (plane) లో జరగాలి తప్ప ఈ బ్లాగ్ ఏర్పరిచిన సమతలంలో జరగదు.

    స్త్రీ ద్వేషం, పురుష ద్వేషం రెండూ కరెక్ట్ కాదు. కాబట్టి పురుషుల్లో పురుష ద్వేషం ఎక్కువ ఉందనడం అసందర్భం. లేని సమస్యను ఉన్నట్లు చూపడం. ఇది నా అభిప్రాయం. మీరు ఏకీభవించాలన్న రూల్ లేదు.

  3. scoop.it లో ననుకుంటాను. ఈ వీడియో చూసినప్పుడు అరుపులకు ఒళ్ళుజలదరించింది. వీడియో తీసినవాళ్ళమీద కోపంకూడా వచ్చింది.

    అత్యాచారం విషయంలో అత్యంత నీచమైన సంఘటన ముంబైలో జరిగిందనుకుంటాను. ఒక లోకల్ రైల్లో ఒక బిచ్చగత్తెపై అత్యాచారం జరుగుతుంటే, అక్కడే ఉన్న ఒక విలే’ఖరము’ దాన్ని నివారించకపోగా మర్నాటి ఎడిషన్‌లో తగు ‘మసాలా’లు దట్టించి వార్త ప్రచురించాడట. వయలెన్సు ఘటననుండి eroticaను వార్చినందుకు అప్పటి సభ్యసమాజం విరుచుకుపడింది. కానీ ఈ నిర్లక్యం ఒక్క స్త్రీలవిషయంలోనే కనబదుతుందంటే నేను ఒప్పుకోను. ప్రమాదానికి గురైనవారు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రికి తీసుకెళ్ళమని వేడుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న నిజసంఘటనలను మనం టీవీల్లో చూస్తున్నాం. పదేళ్ళక్రితం హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్‌లో హత్య జరిగితే, చుట్టుప్రక్కలవాళ్ళందరూ మాకే అరుపులూ వినిపించలేదని చెబితే, పోలీసులు ఆశ్చర్యపోయారు.

    Callousness, non-challance మనుషుల్లో నరనరానా పాకిపోతుంది. మనం బహుశా ఏదైనా ఒక దుర్మార్గాన్ని ఎదిరించాలంటే ముందుగా ఎదిరించాక ప్రాణాలతో బ్రతికుంటాం, దారుణాన్ని నిలువరించిన క్రెడిట్ మనకే దక్కుతుంది లాంటి గ్యారెంటీలు కావాలనుకుంటాను.

  4. “….ఇప్పటి సమాజం పురుషాధిక్య సమాజం అన్న అవగాహనతో ఈ బ్లాగ్ లో టపాలు ఉంటాయి. ఆ అవగాహనతోనే విభేదం ఉంటే గనుక చర్చ మరో సమతలం (plane) లో జరగాలి తప్ప ఈ బ్లాగ్ ఏర్పరిచిన సమతలంలో జరగదు. …”

    అయ్యా ! మీరు ఒక పక్షాన్ని వహిస్తూ దాన్ని “సమతలం” అని పిలుస్తున్నారు. అది సరికాదు. సమతలం అంటే పక్షపాత రహితమైన, తటస్థ చర్చాధోరణి. పురుషాధిక్య సమాజం మాటల్లో తప్ప వాస్తవ జీవితంలో ఎక్కడా లేదు. పురుషుడికి ఏ విధమైన అదనపు భద్రతా లేదు. పురుషుడికి ఏ సందర్భంలోనూ ఏ విధమైన చట్టపరమైన మద్దతూ లేదు. అతనికి కనీసం సామాజిక సానుభూతి కూడా లేదు. జెండర్ పరంగా అతనికి ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. జెండర్ పరంగా, కేవలం అతను మగవాడన్న జెండర్ కారణాన్ని పురస్కరించుకుని అతని మానవహక్కులు Law enforcement agency ల చేతుల్లో ప్రతిరోజూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. జెండర్ పరంగా అతను వివక్షకి గురవుతూ హింసకి బలిచేయబడుతున్నాడు. ఆడవాళ్ళ పట్ల చూపే దయలో కనీసం 5 శాతం అతనిమీద ఎవరూ చూపడం లేదు. ఇవి అసలైన సమకాలీన వాస్తవాలు కాగా “అవన్నీ ఎలా ఉన్నా నేను పట్టించుకోను. నేను మాత్రం వ్యక్తిగతంగా దీన్ని పురుషాధిక్య సమాజంగా అవగాహన చేసుకుంటున్నాను. (అదే కరెక్టు) కనుక మీరు కూడా ఆ దృష్టితోనే కామెంట్లు వ్రాయాలి” అనడం ఏ విధమైన ప్రజాస్వామిక ధోరణి అవుతుందో, ఏ విధమైన తర్కబద్ధ చర్చ అవుతుందో మీరే ఆలోచించుకోండి. నేను చెప్పను. ఒకరు మీతో ఏకీభవించే పక్షంలో కామెంట్ వ్రాసే అవసరమే లేదు.

  5. అయ్యా మహో… గారూ

    సమతలం అంటే ‘సమానత ఉన్న తలం’ అన్న అర్ధంలో రాయలేదు. బ్రాకెట్ లో ప్లేన్ అని కూడా రాశాను కదా. గణితంలో ప్లేన్ అనేది ఒకటుంది కదా, అది.

    మీరు ఇలాంటి ‘పురుష గోల’ మొదలెడతారనే పై వివరణ ఇచ్చాను. కుతర్కం పునాది పైన తర్కబద్ధ చర్చ చేయడం మీబోటివారికి సాధ్యమేమో గానీ నా వల్ల కాదు.

    ఇక వ్యాఖ్యలంటారా, చేతనైనన్ని రాసుకోండి. చేసేదేముంది? కాని రాతలు శృతి మించితే ఏం జరుగుతుందో మీబోటి పెద్ద మనుషులకు తెలియకుండా ఉండదు. ఆ పైన మీ యిష్టం.

  6. ఈ పురుషాధిక్యులకు తమ ఆధిక్యం ఎక్కడ ఊడి పోతుందో నని భయం తప్ప మనుషులందరు సమమే తనకంటే ఎవరూ గొప్ప కాదు ఇతురులకంటే తను ఏ మాత్రం గొప్పకాదు అనే భావం రాదేమో!. తెలిసి తెలిసి తమ కాంప్లెక్షును బయట పెట్టుకుంటారు. తనకు లేని భద్రత ఇతరులకూ లేదు ఇతరులకు లేని భధ్రత తమకూ ఉండదని ఆలోచన ఉండదు. తమని మాత్రం సమాజానికి వెలి వేసు కొని బతుకుతారు. అందువల్ల తమకు ఎక్ష్ట్రా బధ్రత కా వాలను కుంటారు కాభోలు! సమాజంలో తమకు మాత్రమే ప్రయారిటి కావాలనే స్వార్దం ఎన్నెన్ని పనులకు పురికొల్పుతుందో!
    అత్యాభి వృద్ది కాంక్ష ఎక్కడికి దారి తీస్తుందో ఈ వీడియో చూడండి.

    http://www.10tv.in/news/national/Karakattam-Dancer-Mohanambal-surrenders-in-Vellore-Court-47272

వ్యాఖ్యానించండి