మబ్బులు తొలగును, అసలు తెలియును -కార్టూన్


Friends

“…ప్రారంభోల్లాస భ్రాంతి సర్దుకునే కొలదీ ఆర్ధిక స్ధితిగతులలు తన అసలు రూపాన్ని వ్యక్తం చేసుకుంటుంది..”  (ఆ రూపమే గదిలో ఏనుగు)

మోడి: మనం మిత్రులమే కదా?

***

స్వతంత్ర  భారత దేశ చరిత్ర లోనే పూర్తి మెజారిటీ సాధించిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా బి.జె.పి మన్ననలు అందుకుంటోంది. బి.జె.పికి ఆ ఖ్యాతి దక్కించిన మహోన్నత నేతగా నరేంద్ర మోడి ప్రశంసలు పొందుతున్నారు. నిన్నటిదాకా ‘దూరం, దూరం’ అంటూ అస్పృశ్యత అమలు చేసిన బ్రిటన్, అమెరికాలు ‘రండి, రండి, దయచేయండి’ అంటూ ఆహ్వానాలు పంపుతున్నాయి. ‘మోడి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అని చైనా, జపాన్ లు కూడా వర్తమానం పంపాయి.

ఈ సంరంభంలో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న మోడి భక్త గణం ఆయన జీవిత చరిత్రను స్కూలు పిల్లలకు పాఠ్యాంశంగా చేరుస్తామని ప్రకటించి తమ దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాయి. ‘వలదు వలదంటూ’ మోడి వారించబట్టి సరిపోయింది గానీ సదరు భక్త శిఖామణుల భావ దాస్యరికం మరెన్ని రికార్డులు సృష్టించేదో మరి! మొత్తం మీద సో కాల్డ్ ‘చరిత్రాత్మక విజయం’ రేపిన నిబిడ సంభ్రమాల మేఘమాలలు భారత దేశ వాస్తవిక ఆర్ధిక దుస్ధితిని తాత్కాలికంగా నయినా కమ్మేసాయని కార్టూనిస్టు సూచిస్తున్నారు.

సదరు కృత్రిమ సంబరాల పొగమంచు ధూళి క్రమంగా సర్దుకునే కొందీ ‘గదిలో ఏనుగు’ (Elephant in the room) కొద్ది కొద్దిగా ప్రత్యక్షం కావడం మొదలవుతోంది. 2013-14 సం.లో భారత దేశ జి.డి.పి వృద్ధి రేటు 4.7 శాతం మాత్రమేనని నిన్న వెల్లడయిన గణాంకాలు సదరు ఏనుగు గారి పరిమాణాన్ని కొలిచి మరీ చూపించాయి. ద్రవ్య లోటు 4.5 శాతానికి పరిమితం అయిందన్న కబురు తియ్యగా వినిపించినప్పటికీ అది గత విత్త మంత్రి చిదంబరం చేసిన అంకెల గారడీ ఫలితం అని తెలిసాక అది చేదు మాత్రకు తీపి పూత మాత్రమే అని గుర్తుకు రాక మానదు.

మోడి గారు ఇచ్చిన వాగ్దానమేమో మామూలుగా లేదాయే! ఆర్ధిక ప్రగతి రధ చక్రాన్ని పరుగులు పెట్టిస్తానని, ఇక గత ప్రభుత్వాల (గత ఎన్.డి.ఏ ప్రభుత్వం కూడా సుమా) మరిచిపొండనీ కాలికి బలపం కట్టుకుని మరీ చెప్పిన మోడి సదరు ఫీట్ ను ఎలా సాధిస్తారో వేచి చూడాల్సిన విషయం. విదేశాలకు తరలి వెళ్ళిన కోటి కోట్ల రూపాయల నల్లధనాన్ని వెనక్కి తెప్పించే సవాలునంతటినీ ఒక చిన్న సిట్ ఏర్పాటులోనే కుక్కి పాతరేసిన మోడి చాతుర్యం ఇప్పటికీ బాగానే ఉన్నా, జాడీలో ‘జిని’ మళ్ళీ జడలు విప్పి నర్తించే రోజు త్వరలోనే ఉండవచ్చు. వ్యవస్ధ మౌలిక నిర్మాణాలన్నింటా నరనరానా జీర్ణించుకుపోయిన అవినీతి పెనురక్కసిని కేవలం గారడీలతో ప్రజలనుండి కప్పి ఉంచడం అంత తేలికా మరి?

భరత జనులకు మోడి చూపిన అభయ హస్టానికున్న ఒక వేలు ఏమనగా జి.డి.పి వృద్ధి రేటును కనీసం 8 శాతానికి చేర్చడం. గత దశాబ్ద సగటు వృద్ధి రేటు అదే మరి! 8 శాతం లక్ష్యం అంటారా లేక 5 పాయింట్లకు కాస్త అధికమనిపించి గత సంవత్సరం కంటే ఎక్కువేగా అంటారా అన్నది చూడాలి. పశ్చిమ ఆర్ధిక వ్యవస్ధలకు గానుగెద్దులా కట్టివేయబడి ఉన్న భారత ఆర్ధిక వృద్ధికి ప్రధమ షరతు అక్కడి ఆర్ధిక గుర్రం వేగం పుంజుకోవడం. ఆ పని చేయలేక ఒబామా, కామెరాన్, ఓలాండే, ఏంజెలా అంతటివారు తలలు పట్టుకున్నారాయే. మాయావి ప్రాణం ఏడేడేడు సంద్రాల అవతల ఉండగా ఇక్కడ వారిని ఎంత మిత్రులను చేసుకుని ఏమి ప్రయోజనం? 

గుజరాత్ లోని సగం బిడ్డల పోషకాహార లోపానికి ఆడపిల్లల సౌందర్య పిపాసను కారణంగా చూపిన గడసరితనం మళ్ళీ మళ్ళీ చెల్లబోదన్న నిజం ఏలికకు తెలిసియుండుగాక!

3 thoughts on “మబ్బులు తొలగును, అసలు తెలియును -కార్టూన్

  1. అవినీతి లో కూరుకు పోయి ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థను
    ప్రధాని ఒక్కరూ ‘ Modi fy ‘ చేయ గలరు కానీ మార్చ లేరు !
    ( PM can only Modi ‘fy ‘ the economy , but he can not change it ALONE ! )
    అవినీతికి కారణం ప్రధాని కాదు కాబట్టి !

వ్యాఖ్యానించండి