X: ఏయ్! కొట్టుకోవడం ఆపండి!
Y: నాయకత్వానికి విద్యార్హతలు ఎవన్నా ఉండాలా లేదా అని చర్చించుకోవడానికే ఇది…
X: అయితే ఓ.కె, మన (సోనియా) నాయకత్వం పైన అనుమానాలు వ్యక్తం చేయడానికేమో అనుకున్నాలేండి…
*********
స్మృతి ఇరానీ పుణ్యమాని నాయకత్వం విద్యార్హతల గురించి ఆసక్తికరమైన చర్చ నడిచింది. నిజానికి ఈ చర్చకు స్మృతి ఇరానీ ప్రత్యక్ష కారణం కాదు. పరోక్ష కారణమే. ఆమెను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడి నియమించడంతో ఈ చర్చను కాంగ్రెస్ నేతలు లేవనెత్తారు. విద్యాపరంగా అంత ముఖ్యమైన శాఖకు తక్కువ విద్యార్హతలున్న వ్యక్తిని మంత్రిగా నియమిస్తారా అని కాంగ్రెస్ నేతలు ఎగతాళి లాంటి విమర్శ చేయడంతో చర్చకు బీజం పడింది.
నామినేషన్ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం స్మృతి ఇరానీ పట్టబధృరాలు కాదట! కేవలం ఇంటర్మీడియట్/తత్సమాన పరీక్ష మాత్రమే గట్టెక్కారట. విద్యాశాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖ కిందనే ఉంటుంది. యు.జి.సి, యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు, ఆయా తరగతుల సిలబస్ లాంటివన్నీ ఈ శాఖ నియంత్రిస్తుంది.
గత ఎన్.డి.ఏ ప్రభుత్వంలో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఈ శాఖగా మంత్రిగా పాఠ్య గ్రంధాల్లో హిందూత్వ భావజాలాన్ని చొప్పించడానికి తీవ్రంగా శ్రమించారు. వామపక్ష భావాలున్నారన్న పేరుతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన చరిత్ర పరిశోధకులు అనేకమందిని ఎన్.సి.ఈ.ఆర్.టి బోర్డు నుండి తొలగించారు. ఈసారి ఆ స్ధానంలో స్మృతి ఇరానీ నియమితులు కావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించిన మాట నిజమే కానీ ఆమె విద్యార్హతల గురించి మాత్రం ఎత్తింది కాంగ్రెస్ పార్టీయే. అయితే కాంగ్రెస్ విమర్శలను తిరిగి ఆ పార్టీకే ఎదురు తన్నడంతో కాంగ్రెస్ నేతల నోళ్ళు మూతలు పడిపోయాయి.
యు.పి.ఏ హయాంలో జాతీయ అభివృద్ధి మండలికి చైర్ పర్సన్ గా పని చేసి ప్రధాని పదవికి సమాంతర కేంద్రంగా ఉన్న సోనియా గాంధీ విద్యార్హత ఏమిటని బి.జె.పి నేతలు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బదులిచ్చిన కాంగ్రెస్ నేతే లేకపోవడం విడ్డూరం.
ఆయా శాఖలను పాలించేది పేరుకు మంత్రులే అయినా శాఖల కార్యదర్శులు, సలహాదారుల సహాయం లేకుండా మంత్రులు ఒక్క పనీ చేయలేరన్నది ఒక నిజం. నిజానికి ప్రజలకు సేవ చేయాలన్న చిత్త శుద్ధి ఉన్నట్లయితే, విద్యార్హతలతో పనేముంది? శాస్త్ర ఆవిష్కరణల చరిత్రను ఒకసారి పరికిస్తే అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు చేసినవారి విద్యార్హతలు చాలా తక్కువ అని తెలుస్తుంది. మన లెక్కల పండితుడు రామానుజం రాసిన కొన్ని పరిష్కారాలు ఇప్పటికీ లెక్కల పండితులకు అంతుపట్టలేదని చెబుతారు. ఆయనకి లెక్కలు తప్ప మిగతా సబ్జెక్టులన్నీ తప్పిన చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తి కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్ళి ఏకంగా 3,000 కు పైగా మేధమేటికల్ సిద్ధాంతాలను ఆవిష్కరించారు.
ఇదంతా స్మృతి ఇరానీ మానవ వనరుల అభివృద్ధి శాఖకు తగిన వ్యక్తి అని చెప్పడానికి కాదు. ప్రభుత్వంలో ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతలు కలిగి ఉన్న వ్యక్తుల ప్రాధమిక అర్హత విద్యకు సంబంధించినది కాదు. అది ప్రజల ప్రయోజనాలకు మనసా, వాచా కట్టుబడి ఉండడానికి సంబంధించినది. ఏ రాజకీయాలు స్మృతి ఇరానీకి అంతటి ప్రాముఖ్యమైన పదవిలో కూర్చోబెట్టాయో తెలియదు గానీ తన విద్యార్హతల లేమి ఎంతమాత్రం సమస్య కానీ చిత్త శుద్ధిని చూపితే అంతకంటే కావలసింది ఉండదు. కానీ అది సాధ్యమా అన్నదే సమస్య!

మానవవనరుల మంత్రిత్వశాఖ అనేది చాల ముఖ్యమైనశాఖ. ఈ దేశవిద్యావ్యవస్తల తీరుతెన్నులు చూస్తున్నాముగా? ఖచ్చితంగా ఈ శాఖను నిర్వహించడానికి మేధావి అవసరమే!లేదా విజన్ ఉన్న నేతైనా అవసరంకదా! ఆవిడ నేపధ్యం ఈ శాఖనిర్వహనకు ఏమాత్రం ఉపయోగపడదు.ఉత్సవవిగ్రహంలా ఆవిడ ఉంటానటే అంతకన్న ద్రోహం మరొకటి ఉండదు!!!!!!!!!! కొన్నిశాఖల నిర్వహణకు సమర్ధులైన నేతలు అవసరం.అటువంటిశాఖలలో మానవవనరుల మంత్రిత్వశాఖ ఒకటి.
మీరుప్రస్తావించిన రామనుజం ప్రస్తావన ఈ సంధర్భానికి తగనదిగా నా భావన! ఆయన సాధారన విధ్యస్తాయి,గనితంలో ఆయన పరిశొధనలు వేరువేరు! ప్రపంచం అప్పటివరకూ చూడని గణితమేధావి అతను.
మరి,స్మృతి ఇరానికు ఆ శస్ఖనిర్వహనకు కావలసిన ఆలోచనలులేవని నా అభిప్రాయం?