ఆర్టికల్ 370 మరోసారి చర్చలోకి వస్తోంది. ఆ చర్చను కొత్తగా అధికారం చేపట్టిన కేంద్ర ప్రభుత్వమే ప్రేరేపిస్తోంది. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఆర్టికల్ నిజానికి జీవత్ శవంతో సమానం. ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఆర్టికల్ 370 పైన చర్చ జరగాలని ప్రతిపాదించిన నరేంద్ర మోడి అన్నివైపుల నుండి విమర్శలు రావడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. తాజాగా ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రిగా నియమితులయిన జితేంద్ర సింగ్ మరోసారి ఆర్టికల్ 370 పైన చర్చ జరగాలని ప్రకటించడంతో మళ్ళీ తేనె తుట్టెను కదిపినట్లయింది.
ఆర్టికల్ 370 లాభ నష్టాల గురించి సంబంధిత భాగస్వాములందరి (all stakeholders) మధ్య చర్చ జరగాల్సి ఉందని, చర్చల ద్వారా అయిష్టంగా ఉన్నవారికి సైతం నచ్చజెప్పి ఆర్టికల్ రద్దుకు కృషి చేయాల్సి ఉందని జితేంద్ర సింగ్ ప్రకటించారు. తాను ప్రధాన మంత్రి తరపునే ఈ ప్రకటన చేస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. కాశ్మీరు సమాజంలోని అన్ని సెక్షన్ల ప్రజలతోనూ చర్చించి ఒప్పుకోని వారిని నచ్చజెప్పి ఒప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
మొదటిసారిగా ఎం.పి గా గెలుపొందిన జితేంద్ర ‘ఆర్టికల్ 370 రద్దుకు బి.జె.పి కట్టుబడి ఉంది’ అని స్పష్టం చేయడం విశేషం. కానీ అదే సమయంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తాము దానిని నెరవేరుస్తామని ఆయన చెప్పారు. ఆర్టికల్ రద్దు చేస్తాం అని చెప్పడం ద్వారా ఒకవంక హిందూత్వ శక్తులను సంతృప్తిపరుస్తూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో అందరినీ ఒప్పించాకనే ఆ పని చేస్తామని చెప్పడం ద్వారా సెక్యులర్, ముస్లిం శక్తులను సంతృప్తి పరిచేందుకు మోడి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నది స్పష్టమే.
కానీ మోడి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా వారం కూడా కాలేదు. అప్పుడే ఆర్టికల్ 370 రద్దు అంటూ సందడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆర్టికల్ 370, ఏమన్నా దేశం ముందు ఉన్న ప్రధాన సమస్యా? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రానున్న చంద్రబాబు నాయుడు తన మొట్టమొదటి సంతకం రైతు రుణాల రద్దు దస్త్రం పైనా, మలి సంతకం డ్వాక్రా రుణాల రద్దు దస్త్రం పైనా పెడతానని వాగ్దానం ఇచ్చారు. తానా వాగ్దానానికి కట్టుబడి ఉన్నానని ఇప్పుడు కూడా ఆయన చెబుతున్నారు. జనానికి కాస్తాయినా మేలు చేసే ఇలాంటి చర్యలేవీ మోడి ప్రభుత్వం చేపట్టలేదా?
యు.పి.ఏ అధికారంలో ఉన్నన్నాళ్లూ కాశ్మీర్ vis-a-vis పాకిస్ధాన్ విషయంలో బి.జె.పి నేతలు గానీ, నరేంద్ర మోడి గానీ ఎప్పుడూ సానుకూలంగా (పాజిటివ్ గా) మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ అలా అధికారంలోకి వచ్చారో లేదో ఇలా పాకిస్ధాన్ ప్రధాన మంత్రికి ఏకంగా ప్రమాణ స్వీకారానికే ఆహ్వానాలు వెళ్లిపోయాయి. సరిహద్దులో దేశ రక్షణలో నిమగ్నం అయిన మన వీర జవాన్ల తలలు నరికి పాక్ సైనికులు తీసుకెళ్తుంటే అలాంటి పాకిస్ధాన్ తో సంబంధాలు ఎలా సాధ్యం అని మోడి తదితర బి.జె.పి నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు చూస్తేనేమో ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో క్లాసులు పీకే పనిలో మునిగిపోయారు. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు నోటి నుండి, కళ్ల నుండి చిమ్మిన ఆగ్రహ జ్వాలలు పాలక పక్షంలోకి వచ్చాక ఒక్కసారిగా ఎందుకు చల్లబడినట్లు?
మోడి ఇచ్చిన వాగ్దానాలలో దేశ ఆర్ధిక వ్యవస్ధను ఉరుకులు పరుగులు పెట్టిస్తాననడం ఒకటి. అదే ముఖ్యమైన వాగ్దానం కూడా. అభివృద్ధి (అనగా జి.డి.పి వృద్ధి), ఉద్యోగాలు ప్రధాన నినాదంగా బి.జె.పి ఇవ్వడమే గాక వాటిని గుజరాత్ లో మోడి సాధించారని, దేశ వ్యాపితంగా కూడా ఆ ఫలితాల్ని రాబడతారని చెప్పింది. ఆర్ధిక వ్యవస్ధ పరంగా ఫలితాలు రాబట్టాలంటే రాజకీయ సుస్ధిరత ప్రధాన షరతు అని పాలక వర్గాలు భావిస్తాయి. ఇందుకోసమే ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న ఉద్రిక్తతలను చల్లబరుచుకోవడానికి బి.జె.పి/నరేంద్ర మోడి ప్రయత్నాలు ప్రారంభించారని భావించవచ్చు. అందులో భాగంగానే సార్క్ కూటమి పేరు మాటున పాక్, శ్రీలంక దేశాధినేతలను కూడా ప్రమాణ స్వీకార ఉత్సవానికి మోడి పిలిచి ఉండవచ్చు.
కానీ నిన్నటివరకూ పాకిస్ధాన్ ను పడదిట్టి ఇప్పుడు ఒక్కసారిగా స్నేహ హస్తం చాస్తే జనం దాన్ని ఎలా స్వీకరిస్తారు? ముఖ్యంగా హిందూత్వ డిమాండ్లు తీరుస్తారని మోడి పైన ఆశలు పెట్టుకున్న సంఘ్ పరివార్ కార్యకర్తలు ఎలా స్వీకరించాలి? ఒక పక్క రాజకీయ, సామాజిక అస్ధిరతకు దారి తీసే డిమాండ్లు నెరవేరుస్తామని హిందూత్వ కేడర్ కి చెప్పాలీ. మరోపక్క అస్ధిరతకు దారి తీసే అంశాలను తాము కదిలించబోమని కంపెనీలకు సందేశం ఇవ్వాలి. ఈ రెండు పట్టాలను కలిపే మధ్యే మార్గంగా “ప్రజాస్వామ్య యుతంగా చర్చలు జరిపి, అన్ని వర్గాలను ఒప్పించాకనే ఆర్టికల్ 370 రద్దు చేస్తాం” అని మోడి ప్రభుత్వం చెబుతోంది.
ఈ దెబ్బతో ఆర్టికల్ 370 రద్దు అవుతుందన్న నమ్మకంతో హిందూత్వ కేడర్ ఎదురు చూస్తూ ఉంటారు. చర్చలు జరిగాకనే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు గనక పెద్ద సమస్య ఉండబోదని కంపెనీల వర్గాలు భావిస్తారు. మొత్తం మీద ‘ఆర్టికల్ 370 రద్దు గురించిన ప్రజాస్వామ్య చర్చలు’ అనే జ్వాల ఎప్పుడూ రగులుతూ ఉంటుంది. ఈ జ్వాల చుట్టూ అనేకమంది ఆవేశకావేశాలు ప్రదర్శిస్తూ, చర్చోప చర్చలు చేసుకుంటూ, దూషిస్తూ-ద్వేషిస్తూ కాలం గడుపుతూ ఉంటారు. జనమేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలా, వద్దా? రాముడి గుడి కట్టాలా, వద్దా? ఉమ్మడి పౌర స్మృతి తేవాలా, వద్దా అని సిగపట్లు పడుతూ ఉంటే ప్రభుత్వమేమో ఎంచక్కా తాము తలపెట్టిన సంస్కరణల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు.
కాబట్టి ఒక విధంగా హిందూత్వ డిమాండ్ల పైన కొత్త ప్రభుత్వం ప్రారంభించిన చర్చ వేటగాడు విసిరిన వల లాంటిది. ‘ఈ డిమాండ్లు నెరవేరితే ఇక రామ రాజ్యమే’ అన్న భ్రమలతో కూడిన ఎర ఆ వలలో మెరిసి పోతూ ఉంటుంది. ఈ వల ఎలాంటిది అంటే తాము ఒక వలలో ఉన్నామనీ, దాని నుండి బయట పడాలనీ కూడా జనం తెలుసుకోలేని అద్భుతమైన వల. బూటకపు చరిత్ర, ఉందో లేదో కూడా తెలియని ఒక గొప్ప స్వర్ణ యుగ సంస్కృతి లాంటి మాయలు ఈ వలను వలగా కనపడకుండా కప్పి పెడతాయి. ఈ వల విసిరిన వేటగాడు ఒక్క నరేంద్ర మోడి, బి.జె.పి లుగా మాత్రమే చూస్తే అది పొరబాటు అవుతుంది.
నరేంద్ర మోడి అన్న బ్రాండును సృష్టించడానికి, ఆ తర్వాత సృష్టించిన బ్రాండ్ ను ఎన్నికల మార్కెట్ లో మార్కెట్ చేయడానికి రెండేళ్లుగా శ్రమిస్తున్న వాల్ స్ట్రీట్ కంపెనీలు ప్రధాన వేటగాడు! ఈ ప్రధాన వేటగాడి ప్రయోజనాలను నెరవేర్చే అనుచర వేటగాళ్ళు అటు పాలక పక్షంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ కూర్చొని ఉన్నారు. వారు కూడా ఆర్టికల్ 370, రాముడి గుడి, ఉమ్మడి స్మృతి లాంటి డిమాండ్ల జ్వాలను ఎగదోయడానికి తలా ఒక చెయ్యి వేస్తారు.
ఉదాహరణకి ఆర్టికల్ 370 గురించి ప్రజాస్వామ్య యుతంగా చర్చిస్తామని జితేంద్ర ప్రకటించగానే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు రంగంలోకి దిగాయి. ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యాంగం ఒప్పుకోదు అని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తుంటే కాశ్మీర్ సి.ఎం ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని, అయోమయం సృష్టిస్తున్నారని ప్రకటించారు. ఇప్పుడిక ఛానెళ్లు, పత్రికలు ఈ చర్చను అందుకుంటాయి. ఎడిటోరియల్ పేజీల్లో విశ్లేషణలు వస్తాయి. ప్రత్యేక కధనాలు వెలువడతాయి. అప్పుడప్పుడూ అక్కడక్కడా పేలుళ్లూ జరుగుతాయి. ఈ పేలుళ్ళ వెనుక ఏ కాశ్మీర్ యువకులో, ఏ ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులో ఉన్నట్లు జాతీయ పరిశోధనా సంస్ధలు కనిపెడతారు. ఈ సందట్లో ప్రభుత్వం తీసుకునే ఆర్ధిక విధాన నిర్ణయాలు మాత్రం పతాక శీర్షకలకు ఎక్కకుండా వెనుక పేజీలకు నెట్టబడతాయి. స్క్రోలింగ్ వార్తలకు, ఒక వాక్యం ఎక్స్ ప్రెస్ వార్తలకు పరిమితం అవుతాయి. స్వామి కార్యం నెరవేరుతుంది, స్వకార్యమూ నెరవేరుతుంది.
రాజకీయ సుస్ధిరత, అస్ధిరతలు కూడా ఒక విధమైన భ్రాంతి జనకాలే. ఇవి రెండు వైపులా పదును ఉన్న కత్తులు కూడా. ఒకరి సుస్ధిరత, మరొకరికి అస్ధిరత కావచ్చు. ఒకరి అస్ధిరత మరొకరికి సుస్ధిరత కావచ్చు. ఉదాహరణకి పైన చెప్పుకున్నట్లే హిందూత్వ డిమాండ్ల సాధ్యాసాధ్యాల గురించి సాధారణ ప్రజలు, విద్యార్ధులు, సో కాల్డ్ మేధావులు ఉద్రిక్తంగా చర్చలు చేసుకుంటూ అది వారికి మానసిక, శారీరక, సామాజిక అస్ధిరతలుగా మారతాయి. వాళ్ళు ఆ అస్ధిరతలో కొట్టుమిట్టాడుతూ ఉంటే అది పాలకవర్గాల ప్రయోజనాలు నెరవేర్చే ప్రజా వ్యతిరేక (ఆర్ధిక) విధానాలకు సుస్ధీరతగా పని చేస్తుంది. జనం సాపేక్షికంగా తక్కువ సమస్యలతో ఉన్నపుడు పాలకులు ఎం చేస్తున్నారా అని పెట్టించుకోవడం పెరుగుతుంది. అనగా జనం సుస్ధిరంగా ఉంటే అది పాలకులకు అస్ధిరతగా మారుతుంది.
అలాగే పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోని కొన్ని సెక్షన్లు పసిగట్టి ఆందోళనలకు దిగితే అది అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రజలకూ అస్ధిరత్వం అవుతుంది. ఆ సమయంలో బాంబు పేలుళ్లు జరిగితే జనం దృష్టి కాస్తా టెర్రరిజం పైకి మళ్లుతుంది. తమ తమ సమస్యలను మర్చిపోయి దేశానికి ‘పెనుముప్పు’గా మారిన టెర్రరిజం అంతానికి ఏం చేయాలా అని మధనపడతారు. ఆ మధనంలో ప్రభుత్వాలు తీసుకునే కఠిన చట్టాలకు ఆమోదం ఇచ్చేస్తారు. తీరా చూస్తే ఆ కఠిన చట్టాలు తమ న్యాయమైన ఆందోళనల పైన ఉక్కు పాదం మోపడానికే అని వారికి తెలిసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.
అభివృద్ధి పేరుతో నూతన ఆర్ధిక విధానాలు నెత్తి మీదకు తెచ్చి పెట్టిన నిరుద్యోగం, దరిద్రం, అణచివేతలు వెక్కిరించడం ప్రారంభించేసరికి మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ విధంగా చరిత్ర పునరావృతం అవుతుంది. ఒక పక్షం హిందూత్వ పేరుతో చరిత్రను పునరావృతం చేస్తే మరో పక్షం సెక్యులరిజం పేరుతో అదే చరిత్రను మళ్ళీ రాస్తుంది. చివరికి తేలేది ఇరు పక్షాలు రాసేది ఒకే చరిత్ర అని. ఆ చరిత్రలో ప్రజల ప్రయోజనాలకు స్ధానం ఉండదు. జాతీయ వనరులు ప్రజలకు అందజేయడం ఎలాగో ఆ చరిత్ర చెప్పదు. పాలకవర్గాలు రాసిన చరిత్ర చేసిన గాయాలపై వాలే ఈగలను విసురుకోవడం మాత్రమే జనానికి మిగులుంది.
వలలో ఇష్టంగా పడినా, ఇష్టం లేకుండా పడినా అది ఇద్దర్నీ సమానంగా హరించివేస్తుంది. ఇష్టంగా వలలో చిక్కిన వారిని వల విడిచిపెట్టదు గాక విడిచిపెట్టదు!

శేఖర్ గారు,
మీ నుంచి మరొక స్పస్టమైన,సరళమైన,సూటిగా అర్థమయ్యెవిధం గా ఉన్న అర్టికల్ ఇది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని అంతా(గతం,ప్రస్తుతం కూడా)కొన్ని వాక్యాల్లో వివరించారు. ధన్యవాదాలు.
good essay sekar sir
సర్, కాశ్మీర్ విస్-అ-విస్ పాకిస్ధాన్ అంటే ఏమిటి? రాజ్యాంగసభ అంటే ఏమిటి?
V.shekar garu.. gataniki ,varatamananiki, bavishyattuku pettina polchina vishleshana sarriga saripotundi… kani inni vishayalu telisina medavulu kevalam ila blog tho saripettukunte meeru cheppinavi cheyadaniki evarunnaru
Nice article kani shekar garu nenu gamaninchindentante.. mee articles lo ekkuva paschima patrikalu..wallstreet company…pettubadidari vidanampina vyatreka bavajalam..gamanichanu.. worldwide ippudu ee paddatulake prochuryam endukundantaru… ardhika vyavastalu kuppakoolutunna?
vis-a-vis అంటే ‘సంబంధిత’ లేదా ‘సంబంధించిన’ అని అర్ధం. మనకి కాశ్మీర్ సమస్య పాక్ వల్లనే వచ్చిందని మన పాలకులు చెబుతారు. పాక్ పాలకులేమో వాళ్ళకి కాశ్మీర్ సమస్య ఇండియా వల్లనే వచ్చిందని చెబుతారు. కాశ్మీర్ లోయలో మెజారిటీ ప్రజలేమో ఇండియా-పాక్ లు తమ భూమిని అక్రమంగా పంచుకుని దురాక్రమించాయని భావిస్తారు. ఈ అంశాలన్నీ వివరంగా రాయకుండా vis-a-vis అనే పదంతో కవర్ చేశాను.
రాజ్యాంగ సభ (constituent assemly) అంటే రాజ్యాంగం తయారు చేయడానికి ప్రజలు పరోక్షంగా ఎన్నుకున్న సభ. 1947 లో స్వతంత్రం వచ్చిందని చెప్పాక మొదటిసారి జరిగిన ఎన్నికల్లో రాజ్యాంగ సభను ఎన్నుకున్నారు. ఈ సభ రాజ్యాంగ రచనకు అంబేద్కర్ నేతృత్వంలో కమిటి నియమించింది. కమిటీ తయారు చేసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించాక అది అమలులోకి వచ్చింది. అంతటితో రాజ్యాంగ సభ పదవీకాలం ముగిసిపోయి ప్రోరోగ్ అయింది. ఇక దానికి ఉనికి లేదు.
ఆర్టికల్ 370 ని రద్దు చేయాలంటే మళ్ళీ రాజ్యాంగ సభే పూనుకోవాలని రాజ్యాంగంలో రాశారు. కానీ అప్పటి రాజ్యాంగ సభ ఉనికిలో లేదు. కనుక ఈ ఆర్టికల్ రద్దు చేయాలంటే మళ్ళీ కొత్త రాజ్యాంగ సభను ఎన్నుకొని దాని ద్వారా మాత్రమే రద్దు చేయాలని నిపుణుల వాదన.
బి.జె.పి, సంఘ్ పరివార్ తదితరులు దానికి ఒప్పుకోరు. రాజ్యాంగ సభ తయారు చేసిన రాజ్యాంగానికి అనేక సవరణలు చేశామని ఆ సవరణలకు లేని నిబంధన ఆర్టికల్ 370 కి మాత్రం ఎందుకని వారి ప్రశ్న. కాని వారు చెప్పని విషయం ఏమిటంటే ఆర్టికల్ 370 (ఇలాంటి మరికొన్ని ఆర్టికల్స్) ని రద్దు చేయాలంటే రాజ్యాంగ సభ ఆమోదం ఉండాలని నిబంధన విధించారు తప్ప ఇతర ఆర్టికల్స్ కు ఆ నిబంధన లేదు.
అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 370 ఆర్టికల్ స్వభావాన్ని మార్చకుండా కొన్ని మార్పులు చేయవచ్చని ఒక సడలింపు కూడా రాజ్యాంగ సభ ఇచ్చింది. ఈ సడలింపు ద్వారా నెహ్రూ నుండి ఇటీవలి రాజీవ్ ప్రభుత్వం వరకూ ఆర్టికల్ 370 ని మృత శరీరంగా మార్చడంలో సఫలం అయ్యారు. ఎ.పి కోసం తయారు చేసిన ఆర్టికల్ 371(D) కూడా ఇలా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వచ్చిందే.
మీరు చాలా అతిగా స్పందిస్తున్నారు. ౩౭౦ ఆర్టికల్ చాలా విస్త్రుతమైనది. అన్ని రాష్ట్రాల్ కి దీంతో సంభందం ఉన్న్నట్లు ఉంది వికీపీడియా లో ౩౭౦ గురించి చూడండి. డా. అంబేద్కర్ కి ఇది ఇష్టం లేదు. అయన విశ్లేషణ ను అర్ధం చేసుకోవాలి. ఆయనతో నేను ఎకిభవిస్తున్నను.
శివమురళి గారూ
మీ మొదటి వ్యాఖ్యకు: మీరన్నది నిజమే. ఏం చేయాలని మీ సలహా?
రెండో వ్యాఖ్యకు: ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను గత నాలుగైదు శతాబ్దాలుగా నియంత్రిస్తున్నది పశ్చిమ దేశాలే. మొదట యూరోపియన్ దేశాలు నియంత్రించాయి. ఇప్పుడు అమెరికా + ఐరోపాలు నియంత్రిస్తున్నాయి. వలసలుగా చేసుకుని దోపిడీ చేయడంతో ప్రారంభించి అనంతరం జాతీయోద్యమాలు ఎగసిపడడంతో ప్రత్యక్ష పాలనకు బదులు పరోక్ష పాలన చేస్తున్నాయి. ఫైనాన్స్ పెట్టుబడిని (అప్పులుగా, ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐలుగా) ఎగుమతి చేసి దోపిడీ చేస్తున్నాయి.
ప్రపంచంలో అనేక అక్రమ తిరుగుబాట్లను ఎగదోస్తున్నది వారే. అనేక నియంతలను కాపాడుతున్నది వారే. అనేక ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూలదోస్తున్నదీ వారే. అలాంటి చర్యలను వ్యతిరేకించాలా, లేదా?
వారి అక్రమ చర్యలు, దోపిడీ వల్ల నష్టపోతున్న ప్రజల తరపున మాట్లాడేటప్పుడు వారిని వ్యతిరేకించాలా, లేదా?
మన చుట్టూ ఉన్న సమాజం బాగోగులు కాంక్షించే వాళ్లు, దానికి ఆటంకంగా ఉన్న దాన్ని వెల్లడి చేయాలా, లేదా?
వీటన్నింటికీ అవును అని సమాధానం వస్తే నేను చేస్తున్నది అదే.
పశ్చిమ దేశాల వ్యతిరేకత అన్నది వ్యతిరేకత కోసం వ్యతిరేకత అన్నట్లుగా చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఆర్టికల్ లోనూ కారణాలు చెబుతున్నాను. వాస్తవాల ఆధారంగా విశ్లేషణ ఇస్తున్నాను. అయినా సరే, వాటిని వదిలి పెట్టి కేవలం ‘వ్యతిరేకత’గానే చూడడం సబబేనా? కాదని నా అభిప్రాయం.
పశ్చిమ దేశాల అక్రమ దోపిడీ, విదేశాంగ విధానాలను గొప్ప ప్రజాస్వామిక కార్యకలాపాలుగా ప్రచారం చేస్తూ జనానికి నిజం తెలియకుండా చేస్తున్నది పశ్చిమ పత్రికలే. ప్రపంచంలో ప్రధాన మీడియా సామ్రాజ్యాలన్నీ పశ్చిమ బహుళజాతి కంపెనీల అధీనంలో ఉన్నవే. కాబట్టి అవి తమ విషపు గుళికలకు తీపి పూత పూస్తున్నాయి. ఆ తీపి పూత మనకు ప్రాచుర్యంగా కనిపిస్తే, అది ఆమూలాగ్రం తీపి బిళ్ళే అని మనం నమ్మేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఇవి ఆలోచించాల్సిన అంశాలు.
వ్యవస్ధలకు ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఆ పరిణామం కంటికి కనిపించేది కాదు. అంత తేలికగా అర్ధం చేసుకోగలిగేదీ కాదు. అందువల్ల లోలోపల జరిగే పరిణామాలు మనకు వెంటనే అవగాహనలోకి రాకపోవచ్చు. ప్రజల్లో పేరుకు పోతున్న అసంతృప్తి బద్దలు కాక తప్పదు. అది అనివార్యం. కానీ దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ప్రజలను చైతన్యవంతం చేసే శక్తులు బలహీనంగా ఉండడం, యధాతధ పరిస్ధితిని కోరుకునే సెక్షన్లను ఆధిపత్య శక్తులు తయారు చేసుకోవడం, సమాజంపై నియంత్రణను సాధించే టెక్నాలజీని పాలకులు అభివృద్ధి చేసుకోవడం… ఇవన్నీ స్టేటస్ కో ని కాపాడుతున్నాయి. కానీ సమాజంలో పెను మార్పులు అనివార్యం.
మీరు అన్నది అక్షరాల నిజం .కానీ ఇక్కడ మనం ఇలా అరచి గీపెట్టి , కింద మీద పడ్డ ఎందుకు తిరుగుబాటుచేయలేక ఇలా ఈ అదిపత్యాన్ని భరించాలి.
గుర్తించగలిగిన మేధావులు ఎందుకు గుర్తించి మిన్నకున్నారు ? అన్నది నా సందేహం ?
* భయమా !,* ప్రలోభమా! కేవలం మాటలకి మాత్రమే పరిమితమా ? ఎలా ఎదిరించాలి ! ఇలాంటి బ్లాగ్ లలో మనం సమచారాన్ని మాత్రమే పంచగలం తప్పని చెప్పడానికి , ఎదురుకునే మార్గమేది? మెదడు ని తోలిచేసే ప్రస్నాలివి ? నాకు జవాబులు దొరకట్లేదు ?