(గోపాల కృష్ణ గాంధీ మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి మరియు రాయబారి. 2004-2009 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ గానూ, 2005-2006 మధ్య బీహార్ అఫీషియేటింగ్ గవర్నర్ గానూ పని చేశారు. ఆయన మహాత్మా గాంధీ మనుమడు కూడా. ది హిందూ పత్రికకు ఆయన రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)
ప్రియమైన ప్రైమ్ మినిస్టర్-డిసిగ్నేట్,
నా హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నాను. నిజాయితీగానే నేనిలా భావిస్తూ మీకు చెబుతున్నాను. ఇలా (అభినందనలు) చెప్పడం నాకు అంత తేలికయిన విషయం కాదు. ఎందుకంటే మీరు చేరుకున్న అత్యున్నత అధికార స్ధానాన్ని మీరు చేరుకోగా చూడాలని కోరుకున్నవారిలో నేను ఒకరిని కాను. మీరు ప్రధాన మంత్రి అవనున్నారని అనేక మిలియన్ల మంది ఆనంద పరవశులై ఎదురు చూస్తుంటే ఇంకా అనేక మిలియన్ల మంది నిజానికి వికలమై ఉన్నారన్న సంగతి మరే ఇతరుల కన్నా కూడా మీకు ఎక్కువగా తెలుసు.
మీరు అక్కడికి చేరుతారని చెప్పినవారిని నేను ఇటీవలి వరకూ నమ్మలేదు. కానీ, మీరు అక్కడికి చేరుకున్నారు! జవహర్ లాల్ నెహ్రూ కూర్చున్న డస్క్ దగ్గర కూర్చుని ఉన్నారు, లాల్ బహుదూర్ శాస్త్రి కూర్చున్న దగ్గర, ఇంకా, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా చరిత్రాత్మకమైన పోరాటం చేసిన తర్వాత మరో గుజరాతీ అయిన మొరార్జీ దేశాయి కూర్చున్న దగ్గర, అనంతర కాలంలో మీ రాజకీయ శ్రేయోభిలాషి అతల్ బిహారీ వాజ్ పేజీ కూర్చున్న దగ్గర మీరు కూర్చుని ఉన్నారు. మీరు అక్కడికి వెళ్లడం ఇష్టం లేనివారు సైతం, మీరు అక్కడికే చేరుకున్న నిజాన్ని అంగీకరించక తప్పదు.
ఆ అరుదైన అవకాశం మీకు దక్కడం సముచితమేనా అన్న విషయంలో నాకు భారీ సంకోచాలు ఎన్ని ఉన్నప్పటికీ, తీవ్రమైన అననుకూల సామాజిక సమూహానికి చెందిన మీ లాంటి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి భారత దేశ ప్రధాన మంత్రి కాగలిగినందుకు నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మన సర్వసమానత్వ రాజ్యాంగ దర్శనాన్ని ఆ అంశం అత్యంత సర్వోత్కృష్టమైన రీతిలో సుసంపూర్ణం కావించింది.
దేశం అనే భావాన్ని పునర్దర్శించడం గురించి
మీరు ఒకప్పుడు ‘చాయ్ వాలా’ అయిన సంగతి గురించి దూకుడుగా, అవమానకరంగా కొందరు మాట్లాడినప్పుడు నాకు కడుపులో దేవేసినట్లుగా అయింది. ‘జీవిక కోసం చాయ్ తయారు చేసి వడ్డించిన వ్యక్తి భారత ప్రభుత్వానికి నాయకత్వం వహించగలగడం ఎంతటి అద్భుతమైన విషయం!’ అని నాకు నేను చెప్పుకున్నాను, . ఒకరికి చంచాగా బతకడం కంటే అనేకమందికి కప్పుడు (చాయ్ ని) మోసే ప్యాలాగా బతకడం ఎంతో మెరుగు!
కానీ, మిస్టర్ మోడి, ఆ సంగతి చెప్పిన తర్వాత, భారత దేశ అత్యున్నత అధికార పీఠంపై కూర్చోబోతున్నందుకు మిలియన్ల మంది ఎందుకు వికలం చెందుతున్నారో మీకు చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు ప్రధానంగా మోడికి అనుకూలంగానా లేక వ్యతిరేకంగానా అని ఆలోచించి వేశారని మరే ఇతరుల కన్నా మీకు ఎక్కువ స్పష్టంగా తెలుసు. “నరేంద్ర మోడి దేశానికి అత్యంత గొప్ప సంరక్షకుడు -దేశ్ కా రఖ్వాలా- కాగలరా, లేదా?” అని వారు తమను తాము ప్రశ్నించుకున్నారు. మన జనాభాలో 31 శాతం (మీకు పడిన ఓట్ల నిష్పత్తి అదే) మంది మీరు దేశానికి అత్యంత మెరుగైన సంరక్షకుడు కాగలరని, నిజానికి మిమ్మల్ని తమ రక్షకుడని (saviour) వారు ఊహించుకున్నారు. ఆ ఊహలను మీరు పట్టుకోగలినందుకే బి.జె.పి తాను గెలుచుకున్నన్ని సీట్లను గెలుచుకోగలిగింది.
అదే విధంగా 69 శాతం మంది ఓటర్లు మిమ్మల్ని తమ సంరక్షకునిగా భావించలేదన్నది కూడా గమనించాల్సిన విషయమే. దేశం ఆంటే నిజంగా ఏమిటి అన్న విషయమై కూడా వారు మీతో ఏకీభవించలేదు. మోడి గారూ, సరిగ్గా ఇక్కడే, ఈ విషయం పైననే -దేశం అన్న ఈ భావన పైనే- మీరు ఎవరు సమకూర్చిన అధికారంతోనైతే ప్రధాన మంత్రి కార్యాలయంలోకి అడుగుపెడుతున్నారో, ఆ భారత రాజ్యాంగం యొక్క సారం ఆధారపడి ఉంది. దేశం అన్న భావనను మీరు పునర్దర్శనం చేయాలని నేను మిమ్మల్ని అర్ధిస్తున్నాను.
మైనారిటీలకు ధైర్యం ఇవ్వడం గురించి
ఏకత్వం, స్ధిరత్వం అంశాలను లేవనెత్తుతూ మీరు క్రమం తప్పకుండా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పేరునూ, ఔన్నత్యాన్నీ ఉల్లేఖించారు. సర్దార్ గారు రాజ్యాంగ సభకి చెందిన మైనారిటీల కమిటీకి అధ్యక్షత వహించిన సంగతి మీకు తెలిసిన విషయమే. భారత దేశ రాజ్యాంగం భారతీయ మైనారిటీలకు విద్యా, సాంస్కృతిక, మతపరపైన కీలక హక్కులకు గ్యారంటీ ఇచ్చిందంటే అందుకు సర్దార్ పటేల్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయనతో పాటు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ఇతర కమిటీ సభ్యులు, మరీ ముఖ్యంగా సిక్కు కపూర్తలా యొక్క క్రైస్తవ కూతురు రాజ్ కుమారి అమృత్ కౌర్, కూడా ఉన్నారు.
మిస్టర్ మోడి, మైనారిటీల అంశానికి సంబంధించిన రాజ్యాంగ దృక్పధాన్ని (విజన్) మొత్తంగా స్వీకరించి అనుసరించండి గానీ మీకు అనుకూలంగా మార్చి చెప్పడం గానీ లేదా సవరించడం గానీ, నీరు గార్చడం గానీ లేదా మాట్లు వేయడం గానీ చేయవద్దు. అత్యంత మొండివారయిన సర్దార్ ఆ కమిటీలో ఏమి చెప్పారో చదవడం మీకు ఆసక్తికరం కావచ్చు.
అనేకమందిలో తీవ్రమైన భయాలు ఉన్నప్పటికీ, ఆ భయాలకు గొంతు ఇవ్వడానికి వారు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు?
ఎందుకంటే మీరు సభల్లో ప్రసంగిస్తున్నపుడు భారత దేశ జనత (peoplehood) ను తనతో పాటు తీసుకెళ్లగల ఒక ప్రజాస్వామికవాదిని వినాలని వారు కోరుకుంటారు తప్ప ఆజ్ఞలు (డిక్రీలు) జారీ చేసే సార్వభౌమ చక్రవర్తిని కాదు. మైనారిటీలకు పునర్ ధైర్యాన్ని ఇవ్వండి, మిస్టర్ మోడి, కానీ ఆశ్రితులను చేయవద్దు. అభివృద్ధి అన్నది భద్రతకు ఎంతమాత్రం ప్రతిక్షేపం కాజాలదు. “ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో ల్యాప్ టాప్” అంటూ మీరు మాట్లాడారు. లేదా అలాంటి అర్ధం వచ్చే మాటలు ఏవో చెప్పారు. అటువంటి దృశ్యం వారికి ధైర్యం ఇవ్వలేదు, ఎందుకంటే వారిని భయపెట్టే తద్విరుద్ధ దృశ్యం వారిని భయ విహ్వలురిని చేస్తుంది -హిందువుగా ముసుగు వేసుకుని, హిందూ పురాణేతిహాసం యొక్క డి.వి.డిని ఒక చేతిలోనూ, బెదిరించే త్రిశూలం మరో చేతిలోనూ ప్రదర్శించే హంతక బందిపోటు వారి ముందు నిలుస్తాడు.
పాత రోజుల్లో ఉప్పు పొడి పూసిన బెట్టాన్ని హెడ్ మాస్టర్లు తరగతి గదిలో ఒక మూల ఉంచి ప్రదర్శించేవారు. అందరికీ కనపడుతూ భయపెడుతూ ఉండే ఆ బెత్తం తాను ఎంచుకున్న చర్మాన్ని ఒలిచివేయగల సామర్ధ్యం తనకు ఉన్నదని గుర్తు చేస్తూ ఉండేది. 42 మంది ముస్లింలు, 20 మంది హిందువులు మరణించడంతో పాటు 50 వేలమందికి పైగా నిరాశ్రయులను కావించిన కొద్ది నెలల క్రితం నాటి ముజఫర్ నగర్ అల్లర్ల జ్ఞాపకాలు ఆ ఉప్పు బెత్తమై హెచ్చరిస్తున్నాయి. “జాగ్రత్త, మీకు జరిగేది కూడా ఇదే!” ఒక ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా సరే ఎదుర్కోకూడని భయం ఇదే. కానీ అనేక మిలియన్ల మంది పగటి భయాలలోకి, రాత్రి పీడనలలోకి ప్రవేశించిన సందేశం ఇదే. ఆ భయాలను పారద్రోలడం, మిస్టర్ మోడి, ఇప్పుడు మీ చేతుల్లో పని. అది చేయగల అధికారం, శక్తి మీకున్నాయి. అది మీ హక్కు మరియు మీ బాధ్యత కూడా. అందుకు విరుద్ధంగా మీ చెంతకు వచ్చే కొద్ది బుద్ధుల సలహాలను అధిగమించినట్లయితే, మీరా భయాన్ని పారద్రోలగలరని నేను నమ్ముతున్నాను.
….ఇంకా ఉంది