కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మట్టి కరిచింది. సంపూర్ణంగా ఓటమి పాలయింది. మరోవైపు బి.జె.పికి కరువుతీరా విజయం లభించింది. ఎన్.డి.ఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో సంబంధం లేకుండానే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయగల సీట్లను సంపాదించేవైపుగా బి.జె.పికి సీట్లు వస్తాయని ఫలితాల సరళి చెబుతోంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో పాటు బి.జె.పి అనుసరించిన ప్రచార ఎత్తుగడలు ఆ పార్టీకి అమితంగా ఉపయోగపడ్డాయని స్పష్టం అవుతోంది.
ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కూడా విఫలం అయినట్లు కనిపిస్తోంది. బి.జె.పి గెలుపును ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఊహించినప్పటికీ బి.జె.పికి లేదా ఎన్.డి.ఏ కి ఇన్ని సీట్లు వస్తాయని ఏ సర్వే కూడా చెప్పినట్లు లేదు. ఒక సర్వే ఎన్.డి.ఏ కూటమికి 300 వరకు సీట్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ సూక్ష్మ పరిశీలనలో చూస్తే అసలు ఫలితాలకు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు తేడా కనిపిస్తోంది. ఉదాహరణకి ఆంధ్ర ప్రదేశ్ లో టి.డి.పి విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించలేదు.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని బట్టి బి.జె.పి కి 280 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్.డి.ఎ కూటమికి 325 వరకు స్ధానాలు లభించవచ్చు. కాంగ్రెస్ మరీ ఘోరంగా మూడు అంకెల సంఖ్యకు దరిదాపుల్లో కూడా లేదు. యు.పి.ఎ కి కూడా మూడు అంకెల సీట్లు లభించడం అనుమానంగా ఉంది. కాంగ్రెస్ కి 50 చిల్లర స్ధానాల్లో ముందంజలో ఉంటే యు.పి.ఎ 70 చిల్లర స్ధానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఈ ప్రభావలన్నింటికి అతీతంగా సీట్లు సాధించిన పార్టీలు రెండు ఉన్నాయి. అవి ఎ.ఐ.ఎ.డి.ఎం.కె, తృణమూల్ కాంగ్రెస్ లు. తమిళనాడు అధికార పార్టీకి ఏకంగా 38 స్ధానాల్లో ఆధిక్యతలో ఉండగా డి.ఎం.కె ఎక్కడా కనీస ఆధిక్యతలో లేదు. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 25 స్ధానాల వరకు ఆధిక్యతలో ఉండగా ఎల్.డి.ఎఫ్ కూటమి గతం కంటే కాస్త మెరుగ్గా 15 వరకూ స్ధానాల్లో ఆధిక్యతలో ఉంది.
బి.జె.పికి ప్రధానంగా లాభించిన రాష్ట్రాలు చాలా మంది ఊహించినట్లుగా ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలే. యు.పి లో ఏకంగా 50కి పైగా స్ధానాల్లో బి.జె.పి ఆధిక్యతలో ఉంది. బీహార్ లో సైతం అదే పరిస్ధితి. ఎన్నికలకు చాలా ముందు నుండే ఈ రాష్ట్రాల్లో బి.జె.పి చేసిన కృషి (ground work), అనుసరించిన వివిధ ఎత్తుగడలు ఆ పార్టీకి తగిన ఫలితాన్ని చేకూర్చాయి. ముజఫర్ నగర్ అల్లర్ల అనంతరం ఏర్పడిన వాతావరణం ఉత్తర ప్రదేశ్ లో బి.జె.పికి భారీ లబ్దిని చేకూర్చగా బీహార్ లో జె.డి(యు) తో కూటమి లేనప్పటికీ రామ్ విలాస్ పాశ్వాన్ తో పొత్తు ద్వారా బి.జె.పి లబ్ది పొందినట్లు కనిపిస్తోంది. మోడిని మొదటి నుండి అల్లంత దూరాన పెట్టిన నితీశ్ కుమార్ లెక్క ఈసారి ఘోరంగా తప్పింది.
ఈ ఫలితాలను ఎలా చూడాలి? బి.జె.పి చెబుతున్నట్లు మోడి గాలిగా అభివర్ణించవచ్చా? లేదా బి.జె.పి గాలిగా అభివర్ణించవచ్చా? ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకుండా, ఓట్ల సంఖ్యలపై వివరాలు వెలువడకుండా ఈ అంశాలపై ఊహాగానం చేయడం తొందరపాటు కాగలదు. అయితే కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనను ప్రజలు తీవ్రంగా అసహ్యించుకున్నారని మాత్రం స్పష్టం అవుతోంది. ప్రజలకు ఎటువంటి ప్రత్యామ్నాయం లేని పరిస్ధితుల్లో యు.పి.ఏ/కాంగ్రెస్ పాలనపై ఉన్న అసహ్యాన్నంతా ప్రజలు వెళ్ళగక్కారని స్పష్టం అవుతోంది.
మోడి గాలి అనడం కంటే బి.జె.పి పార్టీ ఎక్కడికక్కడ అనుసరించిన ఎత్తుగడలు, పెట్టుకున్న కూటమి ఒప్పందాలు, స్ధానిక పరిస్ధితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీసుకున్న వివిధ చర్యలు, ప్రత్యర్ధి వ్యతిరేక ప్రచారాన్ని సైతం తమకు అనుకూలంగా మలుచుకున్న తీరు… ఇవన్నీ బి.జె.పికి కలిసి వచ్చాయని చెప్పవచ్చు. ఇది పూర్తిగా బి.జె.పి అనుకూల ఓటు కాదు. చాలా వరకు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు. అవినీతి వ్యతిరేక ఓటు. కాంగ్రెస్ చేసిన అనేక మోసాలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు.
బి.జె.పి లేదా హిందూత్వ అభిమానులకు బి.జె.పికి లభించిన అపూర్వ విజయాన్ని మోడి గాలిగా చెప్పడంలోనే ఎక్కువ సంతోషం ఉండవచ్చు. కానీ గాలి సృష్టించగల వ్యక్తిగత సామర్ధ్యం గానీ, రాజకీయ భావజాలం గానీ నరేంద్ర మోడీకి లేవన్నది ఒక వాస్తవం. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఉన్న జన సామాన్యాన్ని ఒకే నినాదంతో ఆకట్టుకోగల వాతావరణం ఉంటేనే గాలి సృష్టించగల పరిస్ధితి ఉంటుంది. కానీ ఇప్పటి బి.జె.పి విజయం వివిధ రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్న బి.జె.పి నాయకుల ఉమ్మడి విజయం ఫలితంగా చూడడం సబబుగా ఉంటుంది.
బి.జె.పి గానీ ఆ పార్టీకి చెందిన నాయకులు గానీ ఎప్పటికన్నా గాలి సృష్టించగలిగితే అది హిందూత్వ ఆధారంగా మాత్రమే చేయగలరు. కానీ హిందూత్వకు గతంలో ఉన్న జనాదరణ ఇప్పుడు లేదు. వారికి కావలసింది మెరుగైన ఆర్ధిక జీవనం. బహుశా మెరుగైన ఆర్ధిక జీవనాన్ని బి.జె.పి ‘అభివృద్ధి-ఉద్యోగాలు’ అన్న నినాదం ఇవ్వగలదని ప్రజలు నమ్మి ఉండవచ్చు. ఈ నమ్మకానికి పదేళ్ళ కాంగ్రెస్ పాలనపై ఉన్న తీవ్ర అసంతృప్తి తోడయింది.
కాంగ్రెస్ తెచ్చిన ఒకటి రెండు ప్రజానుకుల చట్టాలను (రైట్ టూ ఎడ్యుకేషన్, ఆహార భద్రతా చట్టం మొ.వి) ఓట్లుగా మార్చుకోవడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలం అయింది. అసలు తాము కూడా ఎన్నికల్లో గెలవడానికే పోటీ చేస్తున్నామన్న అవగాహనే వారికి లేనట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరించారు. యు.పి.ఎ కూటమిలోని ఇతర పార్టీలయితే కూటమిని ఫోకస్ చేసుకోవడానికి బి.జె.పి, మోడి ప్రభావాన్ని అంచనా వేయడంలోనే ఆసక్తి కనబరిచడం ఒక విచిత్రం. తాము ఓడిపోతామని ముందే నిర్ణయించుకుని బరిలోకి దిగిన పార్టీలను ప్రజలు అసలుకే ఆదరించరని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
“ఉదాహరణకి ఆంధ్ర ప్రదేశ్ లో టి.డి.పి విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించలేదు.” అందేంటి అలా అంటారు రెండురోజుల క్రితం వచ్చిన పోల్స్ లో సీమాంద్రా లో తెలుగుదేశం వస్తుంది అన్నారు కద.
కాంగ్రేష్ నాయకత్వలేమి(రాహుల్ అసమర్దత),యు.పి.ఏ భాగస్వామ్య పక్షాల అనైక్యత(2009 లో ఉన్న పక్షాలు ఒక్కొక్కటి దూరమవడం) ముఖ్యంగా అవినీతిప్రభుత్వం కు వ్యతిరేఖంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా దీనిని భావించవచ్చు! దీని ఫలితమే దానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు! ప్రాంతీయ పార్టీల పక్కన కూర్చొపెట్టింది.
కాంగ్రేష్ పార్టీకి తెలంగాణా ప్రజల తీర్పే దీనికి ప్రబల నిదర్షనం!
NDTV-Hansa ఎగ్జిట్ పోల్, ఎ.పిలో పోటా పోటీ ఉంటుందని చెప్పింది. వై.సి.పి కి 80-100 టి.డి.పి 75-95 సీట్లు వస్తాయంది. లోక్ సభ స్ధానాలు టి.డి.పి, బి.జె.పి కలిపి 13 వస్తాయంది. ఎన్ టి.వి సర్వే జరిపి వై.సి.పి వస్తుందని చెప్పబోయి స్ధానిక ఎన్నికల ఫలితాల సరళితో ఆగిపోయిందని చదివాను. మహా టి.వి ఒక్కటే, అది సుజనా చౌదరి టి.వి కనుక, టి.డి.పి ప్రభుత్వం వస్తుందని చెప్పింది. లగడపాటి సర్వేను నేను పరిగణనలోకి తీసుకోను. అది ఆయన ప్రయోజనాల కోసం చేసుకున్న సర్వే.
@ మూల
అవినీతిప్రభుత్వం కు వ్యతిరేఖంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా దీనిని భావించవచ్చు!
మీ అభిప్రాయం తో విభేదిస్తాను. అవినితీ వ్యతిరేకత అయితే కాంగ్రెసేతర పార్టిలన్ని దానిని సొమ్ము చేసుకోవచ్చు. కాని ఫలితాల తీరు చూస్తే ఇది నమో సాధించిన ఘనవిజయం అని అర్థమౌతుంది. ఆ విజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఇది మోడీ గాలి కాదు, నమో సునామి. నమో ఒంటిచేత్తో ఎన్నికల భాద్యతను తన మీద వేసుకొని, అసాధ్యాన్ని అవలీలగా సుసాధ్యం చేశాడు . కాంగ్రెస్ “ముక్త్ భారత్” అని నమో ఎదైతే పిలుపిచ్చాడో, ఆ పిలుపును ప్రజలు అందిపుచుకొని నిజం చేశారు. దీనికి తెలుగు ప్రజలు చేసిన సహకారం మరువలేనికి. కాంగ్రెస్ పార్టి పుట్టినప్పటినుంచి నెత్తిన పెట్టుకొన్న తెలుగు ప్రజలు నేడు ఆ పార్టికి సమాధి కట్టారు. ఈ దెబ్బ కి ఇక కాంగ్రెస్ పార్టి కోలుకొని నిలబడటం సాధ్యపడే విషయం కాదు.
ఈ సారి ఎన్నికలలో ఆనందం కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. నందన్ నీలేఖన్ని ఓడిపోవటం ఆనందం కలిగించే విషయం. ఆధార్ కార్డ్ కొరకు వేల కోట్ల ప్రజల ధనాన్ని వేస్ట్ చేశాడు. తమిళనాడు లో జయలలిత పూర్తి మెజారిటి సాధించటం తెలుగువారికి ఎంతో లాభించే విషయం. ఆమే పార్టి సాధించిన విజయం బూడిదలో పోసిన పన్నీరైంది. మోడి తో జత కట్టేది లేదని సందేశాలు పంపిన ఆపార్టి అవసరం ఇప్పుడు మోడికి సర్కార్ కు లేదు. సీమాంధ్రకు,కర్ణాటక వారికి సౌత్ కోటలో ఎక్కువ మంత్రి పదవులు దొరకవచ్చు. మోడిని గెలిపించి ప్రజలు మణి శంకర్ అయ్యర్, యు.ఆర్. అనంత మూర్తి,, ఇంగ్లీష్ మీడీయాను,నితీష్ కుమార్, ఫరూక్ అబ్దులహ్,మమత,లాలు మొదలైన వారిని చావు దెబ్బకొట్టారు. ఈ విజయం గురించి రాయటానికి ఎన్నో విషయాలు ఉన్నా, కాంగ్రెస్ మార్క్ సెక్యులరిజాన్నిజాన్నిప్రజలు తిప్పికొట్టారు. 65 లోక్ సభ సీట్లలో(30శాతం పైగా ముస్లిం ఓటర్లున్న చోట) 49 స్థానాలలో మధ్యాహ్నం బి.జె.పి. ఆధిక్యం లో ఉండింది. చూడబోతే మైనారిటిల ఓట్లు బిజెపి కి బాగా పడినట్లు ఉన్నాయి.
మీబోటివారు మోడి అపాలజిస్టులుగా మారవలసిన రోజు రాకూడదని ఆశిద్దాం. కానీ ఆ రోజు రాక తప్పదు. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోణంలో చూస్తే కాంగ్రెస్, బి.జె.పి లు ఒక తానులోని ముక్కలే. అమెరికాలో రిపబ్లికన్-డెమొక్రటిక్ పార్టీలకూ, బ్రిటన్ లో కన్సర్వేటివ్-లేబర్ పార్టీలకు, ఫ్రాన్స్ లో యూనియన్-సోషలిస్టు పార్టీలకు తేడా లేనట్లే ఇండియాలో బి.జె.పి-కాంగ్రెస్ ల మధ్య తేడాలేవీ లేవు. రూపం తప్ప ఆ పార్టీల సారం ఒక్కటే.
ఆడది సహకరిస్తే సంసారాలు నందనవనాలు,
కాదని అహంకరిస్తే రాజ్యాలే మరుభూములు.
కాంగ్రెస్ ఘన చరిత్రను చిత్రవధ చేసిన సోనియా
భారత రాజకీయ స్పందన తెలియని ఇటాలియా!
ఇండియాలో బి.జె.పి-కాంగ్రెస్ ల మధ్య తేడాలేవీ లేవు.
మీరన్నాదాని లో కొంత నిజం లేకపోలేదు. మొదటి నుంచి సోషలిస్ట్ మోడల్ అనుసరించిన మనదేశం, 90ల తరువాత కొన్ని మార్పులు చేర్పులతో కొత్త మోడల్ ను కాంగ్రెస్,బిజెపి రెండు పార్టిలు కొనసాగించారు. రానున్న కాలంలో నమో మార్పులు చేయవచ్చు. ముఖ్యంగా చైనా అనుసరించిన మోడల్స్ ను పరిశీలించి, అందులో మనదేశానికి సూట్ అయ్యే వాటిని స్వీకరించటానికి నమో నాయకత్వంలోని బిజెపి పార్టి చాలా ఆసక్తితో ఉంది. పబ్లిక్స్ సెక్టర్ రంగాన్ని అమ్మకుండా మంచి ఉన్నతాధికారులను నియమించి, వాటిని నిలపటానికి కృషి చేస్తుంది. ఒక ఇంటర్వ్యు లో అరుణ్ శౌరి ఈ మాట చెప్పటం కరణ్ థాపర్ ముఖం మాడిపోయింది. ఎందుకంటే క్రితం ప్రభుత్వంలో అరుణ్ షౌరి డిస్ ఇన్వేస్ట్మెంట్ శాఖను నిర్వహించాడు. ఈ సారి కూడా అదే వాదన చంకనెత్తుకొంటాడనుకొని థాపర్ అనుకొంటే, శౌరి మోడి కి ఆ ఆలోచనలేదు అని చెప్పేసరికి కరణ్ థాపర్ గాలి తీసిన టైరులా నీరసపడి పోయాడు. ఇకనుంచి పశ్చిమదేశాల మోడల్స్ ను ఇది వరకులా గుడ్డిగా అనుసరించేది లేదు. కనుకనే పశ్చిమదేశాల వారు గగ్గోలు పెడుతున్నారు.
మీబోటివారు మోడి అపాలజిస్టులుగా
అవినీతి, అసమర్ధ కాంగ్రెస్ పాలన తో విసుగ్గెత్తిన ప్రజలకి నమో గెలుపు ఒక ఉపశమనం. నమో ని గెలిపించింది ఐదు సంవత్సరాలకండి. ఆయన పాలన బాగుంటే ప్రజలు ఎన్నుకొంటరు లేకపోతే ఇంకొకరు.
ఒళ్ళు బలుపు!
కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఒళ్ళు బలుపు. (ఎన్నిస్కాములు జరిగినా) ఎవడు ఏంపీకుతాడ్లే నన్న పొగురు. (ఇందిర, నెహ్రూ లను మినహాయిస్తే) గాంధీల ప్రభుత్వం గురించి కేవలం ఒక్క విషయంలోనే రూఢిగా ఉండగలం. అదేంటంటే వారు దేశాన్ని యధాతధస్థితిలో ఉంచుతారు. కాకపోతే ఈసారి entropy (the degree disorderliness -translated as anti-incumbency in political phraseology) విపరీతంగా పెరిగిపోయింది (బహుశా ఎందుకలా జరింగింది అన్నదానికి సంజాయిషీగా మన్మోహన్గారు బహుశా స్వయంగా ఒక పుస్తకం వ్రాసి తెలియజేస్తారేమో). కాంగ్రెస్ ఇంతటితో భూస్థాపితమవ్వాలని కోరుకుంటూ, భాజపాకి సరిన పోటీదారుగా ఒక సరైన పార్టీ ఎదగాలని ఆశిస్తున్నాను.
ఇలాంటి sweeping majorityలు ప్రజాస్వామ్యానికి మంచిదికావు (ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి నిందించవలసింది కాంగ్రెస్‌నే). Sweeping majority అలారారే ప్రజాస్వామ్యం ఒకరకంగా నియంతృత్వమే! ప్రస్తుత నూతన ప్రభుత్వం ఏ నిర్ణయమైనా ఏకపక్షంగా తీసుకోగలదు!
మోదీ ప్రభుత్వం… అభివృధ్ధిపేరిట ప్రభుత్వాలు అవలంభించే right-centric politics విధానాలనీ, హైందవాత్మాభిమాన జాగృతిపేరిట comparatively left-centric ఎలా బ్యాలెన్స్ చేస్తుందో, ఏవైపు మొగ్గుచూపుతుందో నన్నది నావరకునాకు ఆసక్తికరంగా ఉంది. మోదీ RSS భావజాలానికీ, అధిపత్యానికీ లోబడని రాజకీయ విధానాలు అవలంభించాలని కోరుకుంటున్నాను.
మన్మోహన్ గారు మేడం కి మాత్రమే కాదండోయ్, ఒబామాగారికి కూడా తలలో నాలుకలా ఉన్నాడు. మన్మోహన్ గారి ఓటమిని తలచుకొని ఒబామా గారు చాలా బాధ పడిపోయారు.
“Your tenure has been good for India and India-US relations. I will miss working with you on day-to-day basis,” Obama said to the Prime Minister.
http://timesofindia.indiatimes.com/Home/Lok-Sabha-Elections-2014/News/Will-miss-working-with-you-on-day-to-day-basis-Obama-to-Manmohan-Singh/articleshow/35269364.cms
విశేషజ్ణ గారు,
మీరన్న పై మాటతో విభేదిస్తున్నాను. ఎందుకంటే గత ఎన్నికలతో పోలిస్తే బిజెపి కి సీట్ల పరంగా రెండింతలు వచ్చాయి.పూర్తి మెజారిటి వచ్చింది. ఇది బిజెపి కి మరింత బాధ్యత తీసుకొస్తుంది. కాని ఇది వరకు ఇంతకన్నా ఎక్కువ మెజరిటి వచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ మేజారిటి బిజెపికి అవసరం. అవినితిలో కాంగ్రెస్ ఒక్కటే కాదండి, ప్రాంతీయ పార్టిలు తక్కువతిన్నాయా? గత 30సం|| సంకీర్ణ ప్రభుత్వాలను చూస్తే రాను రాను 25 మంది యంపిలు ఉన్న ప్రాంతీయ పార్టిలు అవినీతి విషయంలో చెలరేగాయి. చదువు సంధ్యలు లేని, జనాభా ఎక్కువ అక్ష్యరాస్యత తక్కువ, వెనుకబడిన యుపి, బీహార్ ల లో జరిగే అవినితి కన్నా , చదువుకొన్న సౌత్ ఇండియా వారు చేసిన అవినితి తక్కువేమి కాదు. భారి ఎత్తున్న స్కాములు చేసినవి ప్రాంతీయ పార్టిలు అన్ని కుటుంబ పార్టిలు లేక కుల పార్టిలు. ఈ ఎన్నికల లో మోడికి వచ్చిన మెజారిటి ఈ పాటర్న్ బ్రేక్ చేసింది. కోట్లు ఖర్చు చేసి,సంకీర్ణ ప్రభుత్వంలో చేరి బాగా ( 2జి లో మాదిరిగా తెండర్ వేసిన రోజేలాభాలు చేతిలో పడేవిధంగా) సంపాదించవచ్చనుకున్న ప్రాంతీయ పార్టిల గొంతులో పచ్చి ఏలకాయలా మోడి విజయం అడ్డుపడింది. చిన్నా చితక ప్రాతీయ పార్టిలకు ఇక గిరాకీ లేదు. జగన్ పార్టి , కర్ణాటకలో దేవే గౌడ పార్టి లాంటి ప్రాంతీయ పార్టిలు ఎన్నికలలో వాళ్లు ఖర్చుపెట్టిన కోట్ల డబ్బు వృథా! ఇక శివ సేనా, తె.దే.పార్టి లాంటి వారూ కూడ తోక జాడించే సీన్ లేదు. మోడి ఇచ్చిన మంత్రి పదవులు తీసుకోవాలి .
భారత దేశంలో పాలక పార్టీలకు ప్రజల పట్ల ఏనాడూ బాధ్యత తీసుకున్న చరిత్ర లేదు. వారు బాధ్యత తీసుకున్నదల్లా ధనిక వర్గాలకూ, స్వదేశీ, విదేశీ కంపెనీలకు మాత్రమే. జనానికి సబ్సిడీలు, రాయితీలు, రుణ మాఫీలు లాంటి మెతుకులు విదిలిస్తే అది బాధ్యత తీసుకోవడం అవదని నా అభిప్రాయం. ప్రజల అసంతృప్తిని చల్లార్చి వారిని జోకొట్టడానికి మాత్రమే వాటిని ఉద్దేశిస్తారు. ప్రజల పట్ల నిజంగా బాధ్యత తీసుకునేవారు వారికి చేపలు పట్టి ఇవ్వరు. చేపలు పట్టడం ఎలాగో నేర్పిస్తారు. సంపదలను న్యాయబద్ధంగా పంపిణీ చేయడానికి కృషి చేస్తారు. అనగా భూసంస్కరణల చట్టాన్ని నిజంగా అమలు చేసి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అయిన భూములను భూములు లేని వ్యవసాయ రైతులకు, కూలీలకు పంపిణీ చేస్తారు. ప్రభుత్వాన్ని మరింత శక్తివంతం చేసి ప్రజల సంపదలను బాధ్యతాయుతంగా పంపిణీ చేయడానికి పూనుకుంటారు. (మోడి మాత్రం ప్రభుత్వ పరిణామాన్ని తగ్గించి ప్రైవేటు పరిణామాన్ని పెంచుతానని వాగ్దానం ఇచ్చారు) ప్రభుత్వ రంగ పరిశ్రమలను మరింత శక్తివంతం చేసి ప్రజలకు ఉపాధి కల్పించి వారి ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తారు. తద్వారా దేశీయ మార్కెట్ ను బలీయం కావించి ఎగుమతులపై ఆధారపడే అగత్యాన్ని తగ్గిస్తారు. ప్రజలకు చెందాల్సిన దేశ వనరులను బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడానికి బదులు ప్రజలకే ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటారు. ఇరుగు పొరుగు దేశాలకు వ్యతిరేకంగా మతం ఆధారంగా సెంటిమెంట్లు రెచ్చగొట్టే చేష్టలు మానుకుని స్నేహ సంబంధాల కోసం ప్రయత్నిస్తారు. ఇవన్నీ కొత్త ప్రభుత్వం చేపడుతుందన్న నమ్మకం నాకు లేదు. గుజరాత్ లో మోడి అనుసరించిన విధానాలు ఇటువంటి ఆచరణకు అనుగుణంగా లేకపోగా వ్యతిరేకంగా ఉన్నాయి.