EXIT: బయటకు దారి -కార్టూన్


Exit

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేన్ని సూచిస్తున్నాయో ఈ కార్టూన్ చెబుతోంది.

కానీ బయటకు వెళ్ళే పెద్దాయనా, లోపలికి వస్తున్న మరో పెద్దాయనా ఇద్దరూ ఇంకా గడప దాటకుండా కార్టూనిస్టు జాగ్రత్త పడ్డారు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికారిక ఎన్నికల ఫలితాలు కాదు గనక!

ప్రధాని మన్మోహన్ ఇప్పుడు సంచి సర్దుకుంటున్నట్లు చూపారు గానీ నిజానికి ఆయన ఎప్పుడో మకాం మార్చేశారు. ఒకవేళ యు.పి.ఏ III ప్రభుత్వం ఏర్పడ్డా ఆయన మాత్రం ప్రధాని నివాసం ఖాళీ చేయక తప్పదు. అందుకే ఎన్నికలకు ముందే 7, రేస్ కోర్స్ రోడ్ ఖాళీ చేసి కృష్ణమీనన్ రోడ్ కి ఆయన మకాం మార్చారని పత్రికలు రాశాయి.

కూటములు కడితే తప్ప ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని కాలం మొదలైనప్పటినుండే ఎన్నికల ఫలితాల కోసం ఉగ్గబట్టి ఎదురు చూడాల్సిన అగత్యం పార్టీలకు ఏర్పడింది. అయినా ఈసారి మాత్రం మరీ టెన్షన్ గా ఉన్నట్లు పత్రికల కధనాలు, ఆయా వర్గాల్లో సాగుతున్న చర్చోప చర్చలు తెలియజేస్తున్నాయి.

పదేళ్లుగా రెండుసార్లు అధికారం అందినట్టే అంది దూరమయిన పార్టీ ఒకటయితే, ఆ  రెండుసార్లూ అందదనుకున్న అధికారం అందుకుని కూడా అవినీతి కుంభకోణాలతో గబ్బు పట్టి, జనాన్ని రాచి రంపాన పెట్టిన పార్టీ మరొకటి. అయినా తమని తక్కువ అంచనా వేయొద్దని కాంగ్రెస్ నేతలు మొట్టుకుంటుంటే ధర్డ్ ఫ్రంట్ ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం ఎందుకో పెద్దగా మాట్లాడడం లేదు.

మరో రెండు రోజుల్లో పార్టీల జాతకాలతో పాటు, ఎగ్జిట్ పోల్స్ జాతకం కూడా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ నమ్మదగ్గవి కావని గత రెండు ఎన్నికల సందర్భంగా తెలిసింది. ఈసారయినా అవి నిజం కావాలని ఎన్.డి.ఏ కూటమి ఆశిస్తోంది.

అమెరికా అయితే ముందే కుర్చీలో రుమాలు వేసుకుంది. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఆత్రంగా ఉండని ఒబామా pre-emptive ప్రకటన ఒకటి జారీ చేసేశారు.

‘ప్రధాని అయ్యాక మరి మోడీకి వీసా ఇస్తారా?’ అని కొంతమంది అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ఇవ్వక చస్తారా? దేశాధినేతలు అమెరికాలో ఏ1 (రాయబార) వీసాకు ఆటోమేటిక్ గా అర్హులు అవుతారు. కాకపోతే నష్టం అమెరికాకే కదా!

2 thoughts on “EXIT: బయటకు దారి -కార్టూన్

  1. నమో పూర్తి మెజారిటితో ప్రధాని అయితే చాలా మార్పులను అంతర్జాతీయ రాజకీయాలలో జరుగుతాయి. నమో అధికారం కొచ్చాక మనదేశం చైనా, జపాన్ లకు అధిక ప్రాముఖ్యత ఇస్తుంది. చైనా సాధించిన అభివృద్ది,పశ్చిమదేశాలకు పోటిగా నిలవడానికి చేసిన ప్రయాణం వ్యక్తిగతం గా నమో కి చైనా అంటే ఇష్టం. రెండు చైనా కూడా నమో వస్తే సంబంధాలు ఇంకా మెరుగు పడతాయని ఆశిస్తున్నాది. చైనాలో వచ్చే జూన్ లో జరగబోయే పెద్ద అంతర్జాతీయ సమావేశానికి సుబ్రమణ్య స్వామికి ని చైనా ప్రభుత్వం అహ్వానించింది. ఇక జపాన్ ఇప్పటికే మనదేశానికి ప్రాముఖ్యత నిస్తున్నాది.ఆ బంధాన్ని మరింత ముదుకు తీసుకేళ్లుతారు. ఆర్ధిక ప్రగతి ఆసియా దేశాల వైపు టిల్ట్ చేయటానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం జరుగుతుంది. అమెరికా తో మన బంధం వెంటనే తిరగతోడకపోయినా, ఆయనకి స్నేహహస్తం గత కాంగి ప్రభుత్వం వారిలా ఎగరేసుకొంట్టు ఇచ్చేది ఉండదు. వీటిని గమనించే అమెరికా వారు స్నేహ హస్తం చాస్తు మోడి వెంట పడుతున్నారు. ఇక పశ్చిమ దేశాల వారు మూడవ ప్రపంచ దేశాలలో మానవ హక్కూల నివేదికలు అంట్టూ చేసే హంగామా, వాటిని అడ్డు పెట్టుకొని అవి చేసే బ్లాక్ మైల్ రాజకీయాలను ఇప్పటికే చైనా సమర్ధవంతంగా ఎదుర్కొంది. అమెరికా నివేదికలు ప్రచూరించిన పదిహేను రోజులకు చైనా కూడా అమెరికా,పశ్చిమదేశాలు చేసిన దురాగతాలపై నివేదిక ప్రచూరించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి, వారి బ్లాక్ మైల్ ని అడ్డుకొంది. ఇదే బాటలో మనదేశం కూడా మోడి అధికారంలోకి వచ్చాక ప్రయాణం చేయవచ్చు. ఒక కోణంలో చూస్తే ఆసియాదేశాలు కలసి పని చేయటం వలన పరిస్థితులు మెరుగు పడతాయి.మనదేశాలలో అధిక జనాభా కారణం గా యుద్దం జరిగే సంభావన చాలా తక్కువౌతుంది,సహాయ సహకారాలు,సౌభతృత్వం పెరుగుతాయి.

వ్యాఖ్యానించండి