రోడ్ షోలు సాధించింది ఇదీ -కార్టూన్


Road show effect

“ఆ రోడ్ షోల వల్ల కంటికి బాగా కనిపిస్తున్న ప్రభావం ఇదే…”

***

గతంలో ఎన్నికల ప్రచారాలు జనానికి కాస్త అర్ధం అయ్యేలా ఉండేవి. కరపత్రాలు వేసి పంచేవాళ్లు. తాము ఏమి చేస్తామో అందులో చెప్పేవాళ్లు. మీటింగులు పెట్టినా, కనీసం ఇందిరా గాంధీ కాలం వరకైనా, జనాలు స్వచ్ఛందంగా వెళ్ళేవాళ్లు. ఇందిరా వ్యతిరేక నాయకులు వచ్చి మీటింగు పెడితే ఇందిరా అనుకూలురు కూడా వెళ్ళి వినేవాళ్ళు. అలాగే ఇతర నాయకుల విషయంలోనూ జరిగేది. నాయకుల సభలకు పార్టీల కార్యకర్తలు, కింది నాయకులు కాస్త శ్రమించేవాళ్ళు.

ఎన్.టి.ఆర్ మీటింగ్ లకు ఎవరు ఖర్చు చేశారని? ఆ మాటకొస్తే ఎన్.టి.ఆరే స్వయంగా ఊరూరా తిరిగి మీటింగులు పెట్టి జనాన్ని సంతోష పెట్టారు. ఆనాటి నాయకులతో పాటు వారి ప్రచార సంస్కృతి కూడా దాదాపు అంతరించిపోయింది. ఇప్పుడంతా రెడీ మేడ్. అన్నీ వేగంగా జరిగిపోవాలి. ఇప్పుడు సభలకు సంబంధించిన ప్రతి పనికీ కాంట్రాక్టర్లు పుట్టుకొచ్చారు. కేవలం ఏర్పాట్ల వరకే కాంట్రాక్టులు అనుకునేరు. జనాన్ని బస్సులు, లారీలు ఎక్కించుకుని తోలుకురావడానికి కూడా కాంట్రాక్టర్లు తయారయ్యారు. కాకపోతే వారిని కాంట్రాక్టర్లు అనడానికి బదులు రాజకీయ బ్రోకర్లు అనో, గల్లీ లీడర్లు అనో అంటున్నాం.

రోడ్ షో లు నిర్వహించడం ప్రస్తుత స్పీడ్ యుగానికి అనుగుణంగా వచ్చిన ట్రెండు. వాహనాలనే వేదికలుగా మార్చుకోవడం, ప్రధాన పట్టణాల్లో ఆగి దబదబా నాలుగు మాటలు మాట్లాడడం, ఈలలు, చప్పట్లు మోత మోగాక మరో కూడలికి వేగంగా తరలి పోవడం. రోడ్ షోల ధాటికి జనం తట్టుకోలేకపోతున్నారని ఎలక్షన్ కమిషన్ గుర్తించిందో ఏమో గానీ అభ్యర్ధుల కాన్వాయ్ లలో ఒక పరిమితి కంటే ఎక్కువ వాహనాలు ఉండకూడదని గత ఎన్నికల్లో పరిమితి విధించారు. కానీ ఈసారి ఆ పరిమితి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

దాని ఫలితంగా మన రోడ్లు  ఇదిగో ఇలా తయారయ్యాయని కార్టూనిస్టు సూచిస్తున్నారు. ఖర్మ కాలి హంగ్ పార్లమెంటు ఏర్పడి ఒకటి రెండేళ్లకే మళ్ళీ ఎన్నికలు వస్తే గనక రోడ్ షో బదులు బోట్ షో లకు దిగుతారు కాబోలు!

One thought on “రోడ్ షోలు సాధించింది ఇదీ -కార్టూన్

  1. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ లో భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి పాకిస్తాన్ పాయింటాఫ్ వ్యూ నుంచి పాకిస్తాన్ పాత్రికేయుడు రాసిన విశ్లేషణ వచ్చింది. నేను ఇప్పటివరకు పాకిస్తాన్ వైపు వాదనను వినడం ఇదే మొదటిసారి. మీకు కుదిరితే మీదైన శైలిలో దానిని విశ్లేషిస్తూ రాస్తే బావుంటుంది అనుకుంటున్నాను.
    http://www.eenadu.net/Editorial/Vyakyanaminner.aspx?item=opini1

వ్యాఖ్యానించండి