ట్విట్టర్ లో విజేతలు మోడి, ఎఎపి -ది హిందు


As on April 5, 2014

As on April 5, 2014

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఇంటర్నెట్ లోని ఐ.టి కంపెనీలు భారత సాధారణ ఎన్నికల్లో ఒక ముఖ్య పాత్ర పోషించాయి. బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి ఇంటర్నెట్ ను కూడా ఇమేజ్ బిల్డప్ కోసం ప్రతిభావంతంగా వినియోగించు కోవడం మొదలు పెట్టిన ఈ ధోరణిని ఇతర పార్టీల నేతలు కూడా అనుసరించడంతో ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లు ఎన్నికల పోరాటానికి వర్చువల్ వేదికలుగా అవతరించాయి.

వార్తల వెబ్ సైట్లు ఎన్నికల కవరేజికి పూనుకోవడం మామూలు విషయమే. పత్రికలు నిర్వహించే బ్లాగ్ లు సరే సరి. అవి కాకుండా ఇతర అనేక స్వతంత్ర బ్లాగ్ లు కూడా ఎన్నికల ప్రచారంలోనూ, చర్చలలోనూ ఒక మాదిరి పాత్ర పోషించాయి. తరచుగా ఇవి దూషణ, భూషణలకు సైతం వేదికలయ్యాయి. ముఖ్యంగా మోడి అనుకూల ప్రచారం దాదాపు సంవత్సరం పైగా కాలం నుండే ఇంటర్నెట్ లో ప్రారంభం అయింది. బి.జె.పి/నరేంద్ర మోడి సర్వశక్తులు ఒడ్డుతూ, అందుబాటులోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రచార సంరంభంలో ముందు నిలవడంతో ‘మోడి గాలి’ని కృత్రిమంగానయినా సృష్టించడంలో సఫలం అయ్యారు.

ఈ నేపధ్యంలో ఎన్నికలు సాగుతున్నన్నాళ్లూ ఫేస్ బుక్, ట్విట్టర్ పోస్టులు ఆయా పార్టీల, అభ్యర్ధుల అనుకూల, ప్రతికూల వాద, ప్రతివాదాలను ప్రతిబించాయి. వీటిలో కూడా ట్విట్టర్ వెబ్ సైట్ మిగిలిన అన్నీ సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ల కంటే ఎక్కువగా ఎన్నికల ప్రచారానికి, అభిప్రాయాల వెల్లడికి, విమర్శలు-ప్రతివిమర్శలకు వేదికగా నిలిచిందని ది హిందూ పత్రిక తెలిపింది. ట్విట్టర్ వెబ్ సైట్ తో ప్రత్యేక ఏర్పాటు చేసుకోవడం ద్వారా ట్విట్టర్ లో సాగిన ప్రచార సరళిని పత్రిక విశ్లేషించింది.

ది హిందూ ప్రకారం సోషల్ వెబ్ సైట్లలో ట్విట్టర్ అత్యధిక స్ధాయిలో ఎన్నికల వేదికగా ఉపయోగపడగా అందులో వ్యక్తి/అభ్యర్ధిగా నరేంద్ర మోడి, రాజకీయ పార్టీగా ఆం ఆద్మీ పార్టీ అత్యధికంగా ఆదరణ పొందారు. ఇంటర్నెట్ ప్రభావాన్ని పసిగట్టంలో విఫలం అయిన కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యంగా ఇందులోకి ప్రవేశించడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పార్టీగానే కాక అభ్యర్ధులుగా కూడా కాంగ్రెస్ నేతలు ప్రభావం చూపలేకపోయారని పత్రిక తెలిపింది. ఆం ఆద్మీ పార్టీ అయితే ఆ పార్టీ నేతలు పార్టీ పెట్టక ముందు నుండే సోషల్ వెబ్ సైట్లను విస్తృతంగా వినియోగించుకున్న చరిత్రను కలిగి ఉన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించడంలో ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ లను వినియోగించిన ఎఎపి నేతలు సహజంగానే లోక్ సభ ఎన్నికల్లోనూ ఐ.టి కోణాన్ని అందరికంటే ఎక్కువగా ఆవాహన చేసుకున్నారు. అయితే అభ్యర్ధిగా మోడి కంటే అరవింద్ కేజ్రీవాల్ వెనకబడిపోయారని ది హిందూ విశ్లేషణలో తేలింది.

ట్విట్టర్ ఇండియా కంపెనీ నుండి ది హిందూ సంపాదించిన వివరాల ప్రకారం యూజర్లు జనవరి 1 నుండి మే 12 వరకూ 56 మిలియన్ల వరకు ఎన్నికలకు సంబంధించిన ట్వీట్ లను పోస్ట్ చేశారు. ఎన్నికలకు సంబంధించిన పదజాలంలో ట్విట్టర్ లో అత్యంత ఎక్కువగా వినియోగించపడిన పదం ‘Mr. MODI’. మొత్తం 11.1 మిలియన్ల ట్వీట్ లలో ఈ పదం వినియోగించబడింది. ఆ విధంగా ట్విట్టర్ ఓటింగ్ లో మోడి విజేతగా నిలిచారు. ఆయన తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రస్తావనకు నోచుకున్న పదం ‘Aam Admi Party’ కాగా ‘Arvind Kejriwal’ పదం మూడో స్ధానంలో నిలిచింది. BJP పదం నాలుగో స్ధానంలో నిలవడం గమనార్హం.

కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా భావిస్తున్న రాహుల్ గాంధీ పేరుతో ట్విట్టర్ హేండిల్ లేదు. అయినప్పటికీ ఆ పేరు ప్రస్తావించబడిన ట్వీట్ల సంఖ్యను బట్టి ఆయన 5వ స్ధానంలో నిలిచారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం 10వ స్ధానంతోనే సరిపెట్టుకుంది. ఎన్నికలు జరిగిన ప్రతి రోజూ ఎన్నికలకు సంబంధించిన ట్వీట్ లు కనీసం 5.4 లక్షల నుండి గరిష్టంగా 8.2 లక్షల వరకూ పోస్ట్ అయ్యాయని ట్విట్టర్ నుండి సేకరిచించిన వివరాలు తెలిపాయని ది హిందు తెలిపింది. ఏప్రిల్ 24 తేదీన ఎన్నికలు జరిగిన సందర్భంగా అత్యధిక సంఖ్యలో ఎన్నికల సంబంధిత ట్వీట్ లో పోస్ట్ అయ్యాయని తెలిపింది.

కేవలం ఒకటిన్నర సంవత్సరాల క్రితమే ఏర్పడిన ఆం ఆద్మీ పార్టీ ఇంటర్నెట్ లో అత్యధిక సంఖ్యలో అనుసరణలను (ఫాలోయర్స్) కలిగి ఉంది. మే 12 నాటికి ఎఎపి కి 6.8 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. తమ పార్టీ పూర్తిగా వాలంటీర్లపై ఆధారపడిన పార్టీ అని అందువలన ఇంటర్నెట్ ప్రచారాన్ని నిర్వహించడానికి తాము డబ్బు ఖర్చు పెట్టకూడదని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ నేత, ఇంటర్నెట్ ప్రచార సమన్వయకర్త అంకిత్ లాల్ చెప్పారు. నెట్ లో తమకు వస్తున్న ప్రచారం అంతా వాలంటీర్ల ద్వారా వస్తున్నదేనని ఆయన తెలిపారు. ఎఎపి ఐ.టి సెల్ కు అంకిత్ లాల్ బాధ్యత వహిస్తున్నారు. జిల్లా స్ధాయి వరకూ ఎ.ఎ.పి కి ఐ.టి సెల్ లు ఉన్నాయని వారంతా వాలంటీర్లేనని అంకిత్ లాల్ తెలిపారు.

బి.జె.పి విషయానికి వస్తే సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించడానికి బాధ్యత ఇచ్చిన ఐ.టి సెల్ లో ఐదుగురు సిబ్బంది వేతనాలపై (లేదా చెల్లింపులు) పని చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మిగిలినవారంతా వాలంటీర్లేనని బి.జె.పి ఐ.టి సెల్ బాధ్యులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో తమకు వచ్చిన ప్రచారంలో 99 శాతం వాలంటీర్ల వలన వచ్చినదేనని బి.జె.పి ఐ.టి సెల్ బాధ్యులు అరవింద్ గుప్తా చెప్పారు. దేశవ్యాపితంగా ఉన్న బి.జె.పి ఐ.టి వాలంటీర్లు ఒక నెట్ వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారని వారే ఐ.టి ప్రచార బాధ్యతలు చూస్తున్నారని అరవింద్ చెప్పారు. ఫేస్ బుక్, వాట్సప్ తదితర వేదికలపైన పోస్ట్ అయ్యే సందేశాలను వీరు సమన్వయం చేస్తారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ సాధారణ ప్రచారంలోనే కాకుండా ఐ.టి ప్రచారంలో కూడా ఆలస్యంగా మేల్కొంది. ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీని సమర్ధించడానికి నియమించబడిన ప్రియాంక చతుర్వేది సైతం దీనిని అంగీకరించారు. తమ ప్రచారం కూడా వాలంటీర్లే నిర్వహించారని ప్రియాంక చెప్పడం విశేషం. కాంగ్రెస్, బి.జె.పి ల ప్రచారాన్ని కూడా వాలంటీర్లే నిర్వహిస్తే ఇక ఆ పార్టీలకు అవుతున్న కోట్లాది రూపాయల ఖర్చు దేనికి పెడుతున్నట్లో అర్ధం కాని విషయం. కాంగ్రెస్ పార్టీ కమిటీలలోని నాయకులు కూడా వివిధ సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఖాతాలు నిర్వహిస్తూ ప్రచారంలో పాల్గొన్నారని ప్రియాంక తెలిపారు. ట్విట్టర్ లో ఎక్కువగా ప్రతికూల ప్రచారం సాగిందని తాము మాత్రం సానుకూల ప్రచారం చేశామని ఆమె చెప్పడం గమనార్హం. అధికారంలో ఉన్న పార్టీ కనుక కాంగ్రెస్ కి ప్రతికూల ప్రచారం కాకుండా సానుకూల ప్రచారం ఎలా లభిస్తుంది గనుక?

వ్యక్తిగతంగా ఫాలోయర్ల సంఖ్యలో కూడా మోడియే ముందున్నారు. మే 12 సాయంత్రం 8 గంటల వరకూ, ట్విట్టర్ లో ఆయనకు 3.96 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ జరిగిన ప్రతి తేదీలో పోస్ట్ అయిన వ్యాఖ్యాల్లో మోడి పేరు అత్యధిక సంఖ్యలో ప్రస్తావించబడిందని పత్రిక తెలిపింది. ఒక్క ఏప్రిల్ 7 తేదీన మాత్రమే ఆయన వెనుకబడ్డారని ఆ రోజు ప్రధమ స్ధానంలో ఉన్నది బి.జె.పియేనని తెలుస్తోంది.

2009 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క రాజకీయ నాయకుడు ట్విట్టర్ ను తన ప్రచారానికి వినియోగించుకోగా 2014 ఎన్నికల్లో మాత్రం దాదాపు ప్రతి ప్రధాన అభ్యర్ధీ ట్విట్టర్ ను వినియోగించుకున్నారని ట్విట్టర్ ఇండియా కంపెనీ అధిపతి రహీల్ ఖుర్షీద్ చెప్పడం విశేషం.

2 thoughts on “ట్విట్టర్ లో విజేతలు మోడి, ఎఎపి -ది హిందు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s