ఆం ఆద్మీ పార్టీ విధాన పరమైన లోపభూయిష్టత, అయోమయం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. బి.జె.పి కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి అవసరమైతే ధర్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అంశాల వారీ మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఆదివారం (మే 11) వారణాసిలో ప్రకటించారు. కానీ అంతలోనే పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అదేం లేదని స్పష్టం చేశారు. అవినీతి నాయకులతో నిండిన నాయకులకు తమ పార్టీ ఎలాంటి మద్దతూ ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న వారణాసి నియోజక వర్గంలో ప్రచారం చేయడానికి వచ్చిన గోపాల్ రాయ్ పి.టి.ఐ తో మాట్లాడుతూ ధర్డ్ ఫ్రంట్ కు మద్దతు ఇచ్చే విషయంపై తమ అవగాహన వివరించారు. “అవును, ధర్డ్ ఫ్రంట్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్ధితి వస్తే గనుక మేము అంశాలవారీ మద్దతు ఇవ్వవచ్చు” అని గోపాల్ రాయ్ పి.టి.ఐ. కి చెప్పారు.
“మా ఉద్యమం సామాన్య ప్రజల కోసం. మేము ఇచ్చే మద్దతు ఖచ్చితంగా అంశాల ప్రాతిపదికపైన మాత్రమే ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఏమి చర్యలు తీసుకోవాలన్న విషయంలో అంతిమ నిర్ణయం మే 16 ఫలితాల తర్వాత మాత్రమే పార్టీ తీసుకుంటుంది” అని గోపాల్ రాయ్ చెప్పారు.
గోపాల్ రాయ్ ను పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు సన్నిహితుడుగా పేరుందని ది హిందూ పత్రిక తెలిపింది. బి.జె.పి కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి కాంగ్రెసేతర, బి.జె.పియేతర పార్టీలన్నీ కలిసి మూడో కూటమి ఏర్పాటు చేయవచ్చన ఊహాగానాలు గత రెండు వారాలుగా ఊపు అందుకున్నాయని, కాంగ్రెస్ కూడా ఈ కూటమికి మద్దతు ఇవ్వవచ్చని ములాయం లాంటి వారు నమ్ముతున్నారని ది హిందూ విశ్లేషించింది.
422 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను నిలబెట్టిన ఆం ఆద్మీ పార్టీ కనీసం 100 స్ధానాలలో తమ అభ్యర్ధులు విజయం సాధిస్తారని నమ్ముతోంది. ఎఎపి అంచనాలో కనీసం సగం సీట్లు వచ్చినా ఆ పార్టీ గొప్పగా గుర్తించవచ్చు. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన ఎఎపి మాయజాలం లోక్ సభ ఎన్నికల్లో పని చేస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయం. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో తాము అత్యధిక స్ధానాలు గెలుచుకుంటామని ఎఎపి నేతలు విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.
గోపాల్ రాయ్ తన అవగానను వెలువరించిన కొద్ది సేపటికే ఎఎపి పార్టీ ఆయన ప్రకటననుండి దూరం జరిగింది. తమకు అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేసింది. ఎన్నికల చివరి అంకంలో డబ్బుకు అమ్ముడు పోయిన మీడియా ఓటర్లలో అయోమయాన్ని సృష్టిస్తోందని అలాంటి పుకార్లను నమ్మవద్దని అరవింద్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలను కోరాడు.
కానీ తమ పార్టీ నేతే మూడో కూటమికి మద్దతు ఇస్తామని చెప్పిన విషయం గురించి అరవింద్ ఏమీ చెప్పలేదు. నెపాన్ని పూర్తిగా మీడియాపైకి నెట్టడానికే ఆయన తన మాటల్ని కేంద్రీకరించారు. “అవినీతితో రాజీ పడిపోయే పార్టీల సమూహానికి గానీ లేదా కూటమికి గానీ మద్దతు ఇవ్వడం కంటే ప్రతిపక్షంలో కూర్చోవడానికే మేము ప్రాధాన్యం ఇస్తాము. ఎందుకంటే అలా మద్దతు ఇవ్వడం పార్టీ ఏర్పాటుకు దారితీసిన మూల విలువలకే బద్ధ విరుద్ధం” అని పార్టీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
“దేశ ప్రజల ముందు ప్రత్యామ్నాయ రాజకీయాల నమూనాను ఉంచడానికి ఎఎపి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మూడో కూటమికో లేదా నాలుగో కూటమికో మేము మద్దతు ఇస్తామన్న ఊహాగానాలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి మాత్రమే. పార్టీ ప్రకటిత సిద్ధాంతానికి ఇది విరుద్ధం. భారీ అవినీతి కుంభకోణాలకు పాల్పడిన నేతలు నాయకత్వం వహిస్తున్న పార్టీల కూటములకు ఎఎపి ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇవ్వదు” అని ఎఎపి ప్రకటన స్పష్టం చేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం మూడో కూటమికి తాము మద్దతు ఇవ్వబోమని రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఎన్నికలు పూర్తిగా ముగియనందున తమ ఓటర్లను కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ ప్రకటన ఉద్దేశించింది కావచ్చు. మూడో కూటమికి మద్దతు ఇవ్వకూడని సిద్ధాంతాలేవీ కాంగ్రెస్ కు లేవు. కనుక అవసరం అనుకుంటే ధర్డ్ ఫ్రంట్ కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వవచ్చు కూడా. మద్దతు ఇచ్చినట్లు ఇచ్చి ప్రభుత్వాలను కూలదోయడం కాంగ్రెస్ కి కొత్త కాదు.
ఎఎపి విడుదల చేసిన ప్రకటన బి.జె.పికి నిస్సందేహంగా సంతోషం కలిగించేదే. ఒకవేళ ఎఎపి నిజంగానే మూడో ఫ్రంట్ కు మద్దతు ఇస్తే బి.జె.పికి అధికారం దాదాపు దూరం అయినట్లే. అయితే ఇది ఎఎపికి వచ్చే సీట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందన్నది స్పష్టమే.

