ఇది సెల్ఫీ రాజకీయాల యుగం! -కార్టూన్


Selfie rules

“మీ సెల్ఫీకి ఊహించలేనంత బ్రహ్మాండమైన స్పందన వస్తోంది సార్ – ఇక చూస్కోండి, బంపర్ మెజారిటీతో గెలవడమే మిగిలింది…”

***

ఊహించనంత వేగంగా కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం రాజకీయాల్లోనూ తన హవా చాటుతోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వార్తా ఛానెళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి ఇల్లూ ఒక శబ్ద కాలుష్య కర్మాగారం అయిపోయింది.

ఛానెళ్లలో వివిధ రాజకీయ నాయకుల సొంత డబ్బాలు వినలేక పత్రికల వైపు మళ్లుదామంటే అక్కడా అదే గోల. ఒక్కో పత్రికా ఒక్కో పార్టీకి కరపత్రంగా మారిపోయింది. కాదు, కాదు, పత్రికలు వివిధ కూటములను గెలిపించే బాధ్యతను తమ నెత్తిమీద వేసేసుకుని కూటమి కరపత్రాలుగా మారాయి.

బహుశా అదీ కాదేమో! ఎందుకంటే ఒక్కో కూటమిని గెలిపించే బాధ్యతను నెత్తిమీద వేసుకున్నది ఒక పత్రిక/చానెల్ కాదు. అనేక పత్రికలు లేదా ఛానెళ్లు. అనగా పార్టీలు కూటమి కట్టినట్లుగా పత్రికలు/ఛానెళ్లు కూడా అప్రకటిత కూటములు కట్టి రాజకీయ కూటములకు బాకాలుగా పని చేస్తున్నాయి.

ఛానెళ్లు, పత్రికలకు తోడు ఇప్పుడు ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ కూడా ఒక్క కంప్యూటర్లకు మాత్రమే పరిమితం కాదాయే. సెల్ ఫోన్లు, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ల ఒరవడితో ఇంటర్నెట్ ఇప్పుడు మన జేబుల్లోకి కూడా వచ్చేసింది. దానితో ఒకటే ఎస్.ఎం.ఎస్ ల రొద! ఎస్.ఎం.ఎస్ లు కూడా కుయ్ కుయ్ మని అరుస్తుండడంతో చూడక తప్పదు. అలాగని చూడడం మానేద్దామా అంటే ‘ఏమో, ఏ ఫ్రెండో, ఏ కావలసిన సమాచారమో ఇస్తున్నాడేమో, మిస్ అయితే ఎలా?’ అన్న సంశయం పట్టి పీడిస్తూ ఉంటుంది.

స్మార్ట్ ఫోన్ లు ఇప్పుడు ఫోన్ లు, ఇంటర్నెట్ లు మాత్రమే కాదు. అవి కెమెరాలు కూడాను. ఫోటోగ్రఫీ పాటు వీడియోగ్రఫీని కూడా స్మార్ట్ ఫోన్లు మన జేబుల్లోకి తెచ్చేశాయి. ఫలితంగా బంధువులు, స్నేహితులు, కుటుంబాలే కాకుండా రాజకీయ మిత్రులు, కూటములు కూడా సెల్ఫీలకు ఫోజులు ఇవ్వడం ఒక రాజకీయ కార్యక్రమం అయింది.

ఆ మధ్య ఒబామా గారు దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా మరణించినప్పుడు అంత్యక్రియలకు హాజరై సహ దేశాధినేతలతో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చి విమర్శలపాలయ్యారు. సంతాపం తెలియజేయడానికి వచ్చి ఫోటో సంబరాలు జరుపుకోవడం ఏమిటాని ప్రపంచం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుత విషయానికి వస్తే బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి ఏకంగా ఎలక్షన్ కోడ్ నే ఉల్లంఘిస్తూ పోలింగ్ బూత్ ముందే ఎన్నికల గుర్తును చేతబట్టి మరీ సెల్ఫీ తీసుకుంటూ కెమెరాలకు ఫోజులిచ్చారు. ఎన్నికల కోడ్ రీత్యా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల గుర్తును చూపడం, ప్రదర్శించడం చట్ట విరుద్ధం. దానితో ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టేసింది. ఈ కేసు ఎలాగూ నామమాత్రమే కాబట్టి కేసు వల్ల అపఖ్యాతి కంటే తద్వారా వచ్చే ప్రచారానికే ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. లేకపోతే అనేక ఎన్నికలకు నాయకత్వం వహించిన మోడీకి ఎన్నికల కోడ్ తెలియదంటే నమ్మగలమా?

చెప్పొచ్చేదేమిటంటే ప్రచారం ఎంత లభిస్తే అంత ఉపయోగం. ఆ ప్రచారం అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు. భ్రహ్మాండమయిన ప్రచారం వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం గానీ అది ఏ దిక్కునుండి వస్తే ఏమిటిట?

ఈ రోజు (మే 3) ది హిందు పత్రికలో ఒక వార్త వచ్చింది. దాని ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుండి అఫిక్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. ఆయన మాఫియా డాన్ గా యు.పి లో సుప్రసిద్ధులట. ఆయన ఏమంటారంటే మాఫియా డాన్ అంటూ పత్రికలు తనకు ఇస్తున్న ప్రచారమే తనకు పాపులారిటీ తెచ్చిపెట్టిందిట. “నాకు చెడ్డపేరు వచ్చి ఉండొచ్చు గానీ, అది నన్ను పాపులర్ నాయకుడిని చేసింది” అని ఆయన పత్రికలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.

అలాగే, సెల్ఫీ ఎన్నికల కోడ్ కి విరుద్ధం అయితే కావచ్చు గానీ, అది తెచ్చి పెట్టిన ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ.సి పెట్టిన కేసు ఒక లెక్కా అని!

 

వ్యాఖ్యానించండి