సిరియా: అస్సాద్ జైత్రయాత్ర, హోమ్స్ పునఃస్వాధీనం


Car bomb explosion in Homs, Syria

Car bomb explosion in Homs, Syria

సిరియాలో పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన ఆల్-ఖైదా టెర్రరిస్టు మూకలు చావు దెబ్బలు తింటున్నాయి. తిరుగుబాటు పేరుతో వివిధ ముస్లిం టెర్రరిస్టు గ్రూపులు మొట్టమొదటిసారిగా విధ్వంసం ప్రారంభించిన హోమ్స్ నగరం ఇప్పుడు దాదాపు అస్సాద్ ప్రభుత్వం చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా హోమ్స్ లోని వివిధ ఉగ్రవాద శిబిరాలపై ప్రభుత్వ బలగాలు తీవ్ర స్ధాయిలో దాడులు చేయడంతో ఉగ్రవాదులు కాళ్ళ బేరానికి వచ్చి ప్రభుత్వంతో తాత్కాలిక సంధి కుదుర్చుకున్నారు.

“ఇది మేము కోరుకున్నది కాదు. కానీ ఇంతకు మించి మాకేమీ దక్కలేదు” అని సాయుధ గ్రూపుల నాయకుల్లో ఒకరైన బెయిబర్స్ తిలావి చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి) వార్తా సంస్ధ తెలిపింది. స్కైప్ ద్వారా చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్య చేశారని ఎ.పి తెలిపింది.

గత కొన్ని నెలలుగా సిరియాలోని వివిధ ఆల్-ఖైదా గ్రూపులు ఆత్మ రక్షణలో ఉన్నాయి. పుతిన్ మధ్యవర్తిత్వం ఫలితంగా సిరియా తన రసాయన ఆయుధాలను నాశనం చేయడానికి అంగీకరించడంతో అమెరికా దాడికి కారణం లేకుండా పోయింది. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు తమను ఆదుకుంటాయని ఎదురు చూస్తున్న ఆల్-ఖైదా గ్రూపులు రష్యా మంత్రాంగంతో ఒంటరిగా మారాయి. ఒకవైపు ఐరాస పరిశీలకుల నేతృత్వంలో సిరియా ప్రభుత్వం తన రసాయన ఆయుధాలను నాశనం చేస్తుండగా మరోవైపు ప్రభుత్వ బలగాలు టెర్రరిస్టు గ్రూపులపై దాడులు తీవ్రం చేసి చావు దెబ్బ కొట్టడం మొదలు పెట్టాయి.

ఈ పరిస్ధితుల్లో హోమ్స్ ప్రజలను తన్ని తగలేసి అక్కడ తిష్ట వేసిన ఆల్-ఖైదా తిరుగుబాటు బలగాలు అష్ట దిగ్భంధనానికి గురయ్యాయి. పట్టణాన్ని చుట్టుముట్టిన ప్రభుత్వ బలగాలు సరఫరాలను నిలిపివేయడంతో తిరుగుబాటు గ్రూపులు ఆహారం, మందుగుండుకు దూరం అయ్యాయి. హోమ్స్ లోని చారిత్రక పాత బస్తీ, ఇతర కాలనీల్లో తలదాచుకున్న తిరుగుబాటు గ్రూపులపై ప్రభుత్వ బలగాలు కొద్ది నెలలుగా ఫిరంగి దాడులు వైమానిక దాడులు తీవ్రం చేశాయి. ఫలితంగా తాత్కాలిక కాల్పుల విరమణకు తిరుగుబాటు గ్రూపులు దిగి వచ్చాయి.

ఒప్పందం ప్రకారం 48 గంటలపాటు ప్రభుత్వ బలగాలు దాడులు నిలిపివేస్తాయి. ఈ సమయంలో అష్ట దిగ్భంధానంలో ఉన్న తిరుగుబాటు బలగాలు తమకు బలం ఉన్న మరో ప్రాంతానికి తరలి వెళ్లిపోవాలి. కొన్ని వందలమంది సాయుధ బలగాలు హోమ్స్ లో ఉన్నారని వీరందరూ ఉత్తర ప్రాంతానికి వెళ్లిపోతారని తెలుస్తోంది. తిరుగుబాటు బలగాల్లో కొందరు ఇప్పటికే ప్రభుత్వానికి లొంగిపోయారు. లొంగుబాటు ఇష్టం లేని కేడర్ మరో ప్రాంతానికి వెళ్తారు. ఆ విధంగా హోమ్స్ పట్టణంలో మెజారిటీ ప్రాంతం తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది.

మూడు సంవత్సరాల క్రితం సిరియాలో ప్రారంభం అయిన సాయుధ విధ్వంసం మొదటిసారి హోమ్స్ నగరంలోనే మొదలయింది. సిరియాలో పెద్ద ఎత్తున విప్లవం ప్రారంభం అయిందంటూ పశ్చిమ పత్రికలు ఆనాడు హఠాత్తుగా ప్రపంచానికి తెలిపాయి. అధ్యక్షుడు బషర్ అస్సాద్ తన ప్రజలపైనే దాడులు చేస్తున్నాడనీ, క్రూర నిర్బంధం అమలు చేస్తున్నాడని కధలు ప్రచారంలో పెట్టాయి.

‘అరబ్ వసంతం’గా అభివర్ణించబడిన తిరుగుబాట్లు ట్యునీషియా, ఈజిప్టు, బహ్రెయిన్ మున్నగు దేశాలలో చెలరేగిన నేపధ్యంలో సిరియాలో కూడా అదే తరహా తిరుగుబాటుకు అక్కడి ప్రజలు సిద్ధపడ్డారని ప్రపంచం నిజంగానే నమ్మింది. తీరా చూస్తే సాయుధ విధ్వంసానికి తెగబడుతున్నది వివిధ ఆల్-ఖైదా గ్రూపులేనని ఆలస్యంగా వెల్లడి అయింది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ధన, ఆయుధ శిక్షణ మద్దతుతో సౌదీ అరేబియా, కతార్, టర్కీ లు ఈ తిరుగుబాటును ప్రేరేపించాయని ప్రపంచానికి త్వరలోనే తెలిసి వచ్చింది.

తిరుగుబాటు చేస్తున్న ప్రజలను అస్సాద్ అణచివేస్తున్నాడన్న వంకతో సిరియాపై దురాక్రమణ దాడికి సైతం అమెరికా ఒక దశలో సిద్ధపడింది. కానీ అమెరికా ప్రజలు మరో దాడికి అంగీకరించలేదు. అప్పటికే ఆఫ్హన్, ఇరాక్ దురాక్రమణ యుద్ధాల వలన వచ్చిన ఆర్ధిక సంక్షోభం దుష్ఫలితాలను చవి చూస్తున్న అమెరికన్లు సిరియాపై దాడిని తీవ్రంగా వ్యతిరేకించారు. యుద్ధ వ్యతిరేకత నానాటికీ పెరిగిందే గానీ తగ్గలేదు.

అస్సాద్ కి వ్యతిరేకంగా అనేక అబద్ధాలు ప్రచారంలో పెట్టినప్పటికీ అమెరికన్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వివిధ సర్వేలు తేల్చాయి. దానితో రసాయన ఆయుధాలు ప్రయోగిస్తే దాడి చేస్తానని బెదిరించిన ఒబామా, రసాయన దాడి జరిగిందని పశ్చిమ పత్రికలు కోడై కూసినా తన బెదిరింపును అమల్లోకి తేలేకపోయాడు. ప్రజా వ్యతిరేకత, ఆర్ధిక సంక్షోభ పరిస్ధితుల నేపధ్యంలో తాను చేసిన బెదిరింపుల చట్రంలో ఒబామా తానే ఇరుక్కుపోయారు.

ఈ పరిస్ధితిలో రష్యా అధ్యక్షుడు ఆపద్భాంధవునిలా అమెరికా/ఒబామాను ఆదుకున్నారు. సిరియా వద్ద ఉన్న రసాయన ఆయుధాలను ఐరాస పరిశీలకుల పర్యవేక్షణలో నాశనం చేయడానికి సిరియా అధ్యక్షుడిని తాను ఒప్పిస్తాననీ, అందుకు ప్రతిఫలంగా దురాక్రమణ దాడి యోచన విరమించుకోవాలని పుతిన్ ప్రతిపాదించాడు. సిరియా ఊబి నుండి ఎలా బయటపడడమా అని తల పట్టుకుని కూర్చున్న ఒబామాకు పుతిన్ ప్రతిపాదన గొప్ప అవకాశంగా కనపడి వెంటనే దానికి ఒప్పేసుకున్నారు. ఆ విధంగా సిరియా దాడి నుండి అటు అమెరికా, ఇటు సిరియాలు బైటపడ్డాయి.

48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం ఈ రోజు (శుక్రవారం, మే 2) నుండి ప్రారంభం అవుతుందని తిరుగుబాటు బలగాల ప్రతినిధి తిలావి, ఖలీదియా లు చెప్పారని ఎ.పి తెలియజేసింది. బ్రిటన్ నుండి పని చేస్తున్న ఏక వ్యక్తి సంస్ధ ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ కూడా ఈ వార్తను ధృవీకరించిందని ది హిందూ తెలిపింది.

ఒప్పందం కుదిరినప్పటికీ ఒకటి రెండు గ్రూపులు ఇంకా ప్రభుత్వ బలగాలపై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారనీ, పేలుడు పదార్ధాలు నింపిన వాహనాలను యధేచ్ఛగా జనావాసాలపైకి టెర్రరిస్టులు వదులుతున్నారని వీటి వల్ల పదుల కొద్దీ పౌరుల మరణిస్తున్నారని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.

వ్యాఖ్యానించండి