‘అర్ధరాత్రి స్వతంత్రం’ అని ఒక సినిమా ఉంది. ఆర్.నారాయణ మూర్తి తీసిన మొదటి సినిమా ఇది. విశాఖకు చెందిన పాటల రచయిత వంగపండు ప్రసాద్ రాసి, స్వయంగా పాడిన పాట ఒకటి ఈ సినిమాలో చిత్రీకరించారు. అద్భుతమైన పాట అది. సామాన్యులే చరిత్ర నిర్మాతలనీ ఆ పాట పరోక్షంగా చెబుతుంది. ఆ పాట వింటుంటే రోమాలు నిక్క బొడుచుకుని ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకుని వస్తుంది. కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి మీరూ వినండి.
ఈ పాట విన్న తర్వాత కింది వీడియో చూస్తే ఆ అనుభవమే వేరు.
సింహం పాలబడిన ఒక ఒక (అడవి) గేదె ఆర్తనాదం విని పరుగు పరుగున రెండు దున్నలు వచ్చి ఆదుకున్న దృశ్యం నిజంగా అద్భుతం. సింహం గానీ పులి గానీ వెంటబడుతుంటే మందలు మందలు ఉన్నా పరుగెత్తి పారిపోతున్న దృశ్యాలే మనకు తెలుసు. నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ పుణ్యమాని అలాంటి దృశ్యాల్ని మనం అనేకం చూశాం. కానీ వీడియోలోని దృశ్యం దానికి సరిగ్గా విరుద్ధం.
చాలా కేలిక్యులేటెడ్ గా ఆ దున్నపోతు తన తల ఎక్కడ వంచాలో అక్కడ వంచి ఒక కొమ్ముకి సింహాన్ని గుచ్చి ఎగరేసిన తీరు చూస్తే ఇది నిజంగా జరిగిందా అన్న ఆలోచనాత్మక అనుమానం మన మనసుల్ని తొలిచివేయక మానదు. ఒకసారి ఎత్తి ఎగరేసిన తర్వాత ఆనక వెనక్కి వచ్చి గురి చూసి మళ్ళీ మళ్ళీ పొడిచి పొడిచి ఎగగేసిన తీరు పరమాద్భుతం.
ఈ వీడియో చూశాకయినా వంగపండు గారి పాట సాహిత్యాన్ని తనివితీరా చదువుకోవాలని అనిపించదా? తప్పకుండా అనిపిస్తుందని నా భావన. అందుకే సాహిత్యం కింద ఇస్తున్నాను.
–
ఏం పిల్లడో ఎల్దుమొస్తవా… ఏం పిల్లో ఎల్దామొస్తవా
–
శ్రీకాకుళంలో సీమ కొండకి ||ఏం పిల్లడో||
చిలకలు కత్తులు దులపరిస్తయట ||ఏం పిల్లడో||
సాలూరవతల సవర్ల కొండకి ||ఏం పిల్లడో||
చెవుల పిల్లులు శంఖమూదెనట ||ఏం పిల్లడో||
నలగొండ నట్టడివిలోనికి ||ఏం పిల్లడో||
పాముని బొడిచిన చీమాలున్నయట ||ఏం పిల్లడో||
తెలంగాణ కొమరయ్య కొండకి ||ఏం పిల్లడో||
–
గెద్దని తన్నిన చేతులున్నాయట ||ఏం పిల్లడో||
బాకులు మేసిన మేకల కొండకి ||ఏం పిల్లడో||
పులుల్ని మింగిన గొర్రెలున్నయట ||ఏం పిల్లడో||
రాయలసీమ రాలు గొండకి ||ఏం పిల్లడో||
రక్తం రాజ్యం యాల్తందట ||ఏం పిల్లడో||
–
తూరుపు దిక్కున తోర కొండకి ||ఏం పిల్లడో||
తుపాకి పేల్చిన తూనీగలున్నయట ||ఏం పిల్లడో||
కలకత్తా కొస కారు కొండకి ||ఏం పిల్లడో||
ఎలకలు పిల్లిని యెంటా దరిమెనట ||ఏం పిల్లడో||
–
వంగపండుపై వచ్చిన విమర్శల సంగతి ఎలా ఉన్నా, ఒకనాడు ఆయన అద్భుతమైన ప్రజా సాహిత్యాన్ని సృష్టించారనడంలో అనుమానం లేదు.
శేఖర్ గారు,ఈ చిత్రీకరణని మీరు మొదటిసారి చూసినట్టున్నారు! దీనికి పోలిన ద్రుశ్యాన్ని ఇంతకుముందే డిస్కవరీ చానల్ లో 10 సం;క్రితమే చూసినట్టుగుర్తు! ఏమైనప్పటికీ వీడియో చూస్తే సుమతీ శతకంలోని “చలిచీమలచేతచిక్కి చావదెసుమతీ” పద్యం కూడా గుర్తుకు వస్తుంది!
దుర్మార్గాన్ని జంతువులతో పోలుస్తాం. ఒరే నువు జంతువుతో సమానం అని. కాని, జంతువుకున్న ఐకమత్యం మనిషికి లేక పోటమే విడ్డూరం!