ఓటెయ్యడానికి వచ్చి చిరంజీవికి పాఠం చెప్పిన ఎన్.ఆర్.ఐ


పలు సినిమాల్లో విలన్లకు సంస్కారం, పౌర బాధ్యత తదితర సుగుణాల గురించి పాఠాలు చెప్పిన కేంద్ర మంత్రి చిరంజీవి నిజ జీవితంలో తానే ఓ పౌరుడితో పాఠం చెప్పించుకున్నారు. పాఠం చెప్పింది కేంబ్రిడ్జిలో ఉద్యోగం చేస్తున్న ఎన్.ఆర్.ఐ కావడం విశేషం. కేవలం ఓటు వేయడం కోసమే లండన్ నుండి వచ్చిన కార్తీక్ గంటన్నర నుండి క్యూలో నిలబడి ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన చిరంజీవి కుటుంబం నేరుగా బూత్ లోకి వెళ్ళడం సహించలేకపోయారు. ఫలితంగా ఓ కేంద్ర మంత్రి బహుశా మొదటిసారిగా ఒక సాధారణ పౌరుడి నుండి పాఠం నేర్చుకోగలిగిన అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

హైదారాబాద్ లోని సంపన్నుల కాలనీ జూబిలీ హిల్స్ వద్ద పలువురు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద క్యూలో నిలబడి ఉండగానే చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు నేరుగా బూత్ లోకి చొరబడ్డారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఐ.టి ఉద్యోగం చేస్తున్న రాజా కార్తీక్ అభ్యంతరం చెప్పడంతో ‘సారీ’ చెప్పి క్యూలో నిలబడి మరీ ఓటేయ్యాల్సి వచ్చింది కేంద్రమంత్రి చిరంజీవికి. కానీ ఈ గలాటాలో క్యూకు అతీతంగా ఓటు వేయడంలో చిరంజీవి భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజ సఫలం అయ్యారు.

రాజా కార్తీక్ గంటా కేంబ్రిడ్జి (లండన్) లో ఐ.టి ఉద్యోగిగా పని చేస్తున్నారు. ది హిందు పత్రిక ప్రకారం సాధారణ ఎన్నికలలో ఓటు వేసేందుకే ప్రత్యేకంగా ఆయన అంతదూరం నుండి వచ్చారు. ఉదయం 8 గంటలకే వచ్చి జూబిలీ హిల్స్ లోని తన బూత్ వద్ద క్యూలో నిలబడ్డారు. మరో గంటన్నరకు కేంద్ర మంత్రి చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు అదే బూత్ వద్దకు వచ్చారు. కేంద్ర మంత్రి కనుక టి.వి ఛానెళ్లు, పత్రికల విలేఖరులు హడావుడి మొదలు పెట్టారు. ఆయన, కుటుంబ సభ్యులు నేరుగా బూత్ లో ప్రవేశిస్తుండగా కెమెరాలకు పని పెట్టారు.

ఈ హడావుడి కార్తీక్ కి ఎంతమాత్రం నచ్చలేదు. తాను గంటన్నర నుండి పడిగాపులు పడుతుంటే చిరంజీవి కుటుంబ సభ్యులు క్యూలో నిలబడ్డవారిని అవమానపరుస్తూ క్యూను దాటుకుని వెళ్లిపోవడంతో అభ్యంతరం చెప్పారు. నేరుగా చిరంజీవి వద్దకు వెళ్ళి తన అభ్యంతరం ఎరుకపరిచారు. ఆయన కుటుంబ సభ్యులు క్యూలో నిలబడి ఓటు వేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అప్పటికిగానీ చిరంజీవికి తత్వం బోధపడలేదు. వెంటనే క్యూలో నిలబడ్డవారికి సారీ చెప్పి కూతురుతో కలిసి వెళ్ళి క్యూలో నిలబడ్డారు. కానీ ఈ గలాభాలో చిరంజీవి భార్య, కుమారులు మాత్రం తాము తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేసేశారు.

చిరంజీవి కేంద్ర మంత్రి కనుక ఆయన వి.ఐ.పి అనడంలో సందేహం లేదని, కాబట్టి ఆయన ఒక్కరికీ లైన్ కు అతీతంగా ఓటు వేసే అవకాశం ఇవ్వవచ్చనీ కార్తీక్ అభిప్రాయపడ్డారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు వి.ఐ.పిలు ఎలా అవుతారని ప్రశ్నించారు. తానూ సాధారణ ఓటర్ నే అనీ, వారూ సాధారణ ఓటర్లని తనకు లేని అవకాశం వారికి ఎక్కడి నుండి వస్తుందని విలేఖరులతో మాట్లాడుతూ కార్తీక్ ప్రశ్నించారు. “అది చాలా అన్యాయం అని నాకు తోచింది. ఎందుకంటే నేనూ ఇక్కడ నివాసినే. ఆయన కూడా నివాసే” అని కార్తీక్ వ్యాఖ్యానించారు.

చిరంజీవి ఒంటరిగా వచ్చి ఉన్నట్లయితే ఆయన పదవికి గౌరవం ఇచ్చి వెళ్లనివ్వవచ్చని కార్తీక్ వ్యాఖ్యానించారు. కానీ తన కుటుంబ సభ్యులతో వచ్చినందున వారితో కలిసి క్యూలో నిలబడడం తప్ప మార్గం లేదన్నారు. “రాజకీయ నాయకులు ప్రజలకు పాఠాలు చెప్పాలి గానీ ప్రజలే రాజకీయ నాయకులకు పాఠాలు చెప్పే పరిస్ధితి రాకూడదు” అని కార్తీక్ అన్నారని పత్రికలు తెలిపాయి. కార్తీక్ ను పలువురు ఓటర్లు, విలేఖరులు అభినందించారని పత్రికలు తెలిపాయి.

ప్రజాస్వామ్య ఎన్నికల పేరుతో భారీ ఎత్తున జరిగే ఓట్ల జాతరను భారత ప్రజాస్వామ్యం బ్యూటీగా ఎన్నికల అధికారులు, రాజకీయ నాయకులు, ఈ ఎన్నికల ద్వారా లబ్ది పొందే వర్గాలు అప్పుడప్పుడూ వ్యాఖ్యానిస్తుంటారు. ఆ ప్రజాస్వామ్యం సొగసు ఏమిటో కార్తీక్ లండన్ నుండి వచ్చి చెబితే గానీ మన పత్రికలకు అర్ధం కాలేదు.

4 thoughts on “ఓటెయ్యడానికి వచ్చి చిరంజీవికి పాఠం చెప్పిన ఎన్.ఆర్.ఐ

  1. మనది ఒక బతుకేనా? సందులలో పందులవలె మనం బానిసలం కధా అన్న సంగతి మన ప్రజలకు మైండ్‌ లో రికార్డ్‌ అయిపోయింది. చిరంజీవి లాంటి రాజకీయ నాయకుల కుటుంబాలు ఎలా వెళ్లాలో అలానే వెళ్లారు. ఇందులో హాశ్చర్యపోవటానికి ఏముంది? కాక పోతే ఈయన ఈ ఎన్‌ అర్‌ ఐ ప్రజాస్వామ్యం అంటే ఇదే నని పాఠాలు నేర్ప బూనటం వల్ల మనకు జ్గానో ధయం కలిగేనా? అయినా రోజు వారి జీవితంలో ఆంటాస్థుల వారిగా బతికి ఓటింగ్‌ బూత్‌ లో మాత్రం సమనత్వం కావాలనుకోవడం వెంటనే స్పుర?ణకు వస్తుందా?
    ఏమైనా జై కార్తీక్! జై జై కార్తిక్‌!

  2. అది జూబ్లీహిల్స్ లాంటి ప్రముఖ నియోజక వర్గం కావడాన…కార్తీక్ కూడా ఎన్ ఆర్ ఐ కావడం, పైగా మీడియా హడావిడి ఉన్నందున చిరంజీవి వెనక్కి తగ్గి ఉంటారు. అక్కడ మీడియా లేకపోయినా, మరే మారుమూల నియోజక వర్గమో అయి ఉంటే…పరిస్థితి మరోలా ఉండేది.
    ఏదేమైనా కార్తీక్ లాగే జనాలందరిలోనూ ప్రశ్నించే తత్వం పెరిగితే కొంతైనా పరిస్థితి మారుతుంది.

వ్యాఖ్యానించండి