ఇది మోడి వానరుల కిష్కింధకాండ -కార్టూన్


Kishkindha kanda

రామాయణంలో నాలుగో కాండం కిష్కింధ కాండ.

తెలుగు వికీపీడియా ప్రకారం కిష్కింధ కాండలోని ప్రధాన కధాంశాలు: రాముని దుఃఖము, హనుమంతుడు రామనకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ.

వాలి వధ కోసం రాముడు చెట్టు వెనక నక్కి బాణం వదులుతాడు. ఎదురు వెళ్తే తనలోని సగం బలం వాలికి వెళ్లిపోతుంది. అందువలన వాలిని చంపడం కష్టం మరి! రామ బాణం దెబ్బ తిన్న వాలి మూర్ఛపోయి, మేలుకున్నాక రాముడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తాడు. రాముడు ఏవేవో కాకమ్మ కధలు చెప్పి వెనక నుండి వచ్చి చంపడం ధర్మమే అని చెప్పుకుంటాడు. అది వేరే సంగతి.

బి.జె.పి, వి.హెచ్.పి నాయకుల ప్రేలాపనలను వర్తమాన ఎన్నికల కిష్కింధ కాండలో భాగంగా కార్టూనిస్టు పోల్చారు.

మరో సమయంలో అయితే ఎలా ఉండేదో గానీ ప్రస్తుతం అభివృద్ధి, ఉద్యోగాల కల్పన తనవల్లనే సాధ్యం అని మోడి చెప్పుకుంటున్నారు. తద్వారా 2002 నాటి నరమేధంపై ఎన్నికల్లో చర్చ జరగకుండా శాయశక్తులా నిరోధిస్తున్నారు. బి.జె.పి, ఇతర సంఘ్ పరివార్ సంస్ధలు నేతలు ఏ మాత్రం హిందూత్వ జోలికి వెళ్ళినా వ్రతం చెడిపోయే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. 

అందుకే హిందూత్వ మార్కు డిమాండ్లయిన ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, రామాలయ నిర్మాణం అంశాలను మేనిఫెస్టోలో రాసుకుని కూడా అవి ‘కల్చరల్ సెక్షన్’ లో మాత్రమే పెట్టామని, అవి తమ ప్రధాన అజెండా కాదనీ మురళీ మనోహర్ జోషి లాంటి అగ్ర నాయకులు వివరణ ఇచ్చుకున్నారు.

కానీ వానర మూకల అల్లరిని నియంత్రించడం రాములవారి వల్ల కావడం లేదు. బాధ్యతారాహిత్య ప్రకటనలు మానుకోవాలని ట్విట్టర్ లో స్వయంగా కూయాల్సిన పరిస్ధితిని రాముడికి తెచ్చిపెడుతున్నారు.

మోడిని విమర్శించేవారు పాకిస్తాన్ వెళ్లిపోవడం మేలని బీహార్ నేత గిరి రాజ్ హెచ్చరిస్తే, హిందువులు మెజారిటీగా ఉన్న ఏరియాల్లో ముస్లింలు ఆస్తులు కొంటే గనక వాటిని లాక్కుని హిందూత్వ సంస్ధల బోర్డులు పెట్టాలని విశ్వహిందూ పరిషత్ అధిపతి ప్రవీణ్ తొగాడియా పిలుపు ఇచ్చారు.

అసలు డిమాండ్లను ‘కల్చరల్ సెక్షన్’ లో దాచిపెట్టి సమయం వచ్చినపుడు (గెలిచాక) బైటికి తీద్దామని అధినాయకులు భావిస్తుంటే ఈ వానర మూకలేమో ‘విద్వేషపూరిత ప్రసంగాల’తో ముందే ఆ ఎజెండాను కక్కేస్తున్నారు.

ఫలితంగా వ్రతమూ చెడీ, ఫలితమూ దక్కకా ఎటూ కాకుండా పోతామని భయం బి.జె.పి నేతలను వెన్నాడుతోంది.

One thought on “ఇది మోడి వానరుల కిష్కింధకాండ -కార్టూన్

  1. వానర మూకల చేష్టలు ఎక్కడొ ఎందుకు మన బ్లాగ్‌ లో చూస్తున్నదే! బీహార్ నేత గిరి రాజ్ కంటే ముందే మనమంతా పాకిస్తాన్‌ పారి పోవాలని వీరు సెలవిచ్చారు. అసలు కంటె వడ్డీ పిరెం అన్నట్లు మోది తోకల్ని ప్రజలు భరించడమే కష్టం-ఆయన వస్తే గిస్తే? ఈ మద్య ఒక రచయిత్రిని పేస్‌ బుక్‌ లో బెదిరించడం చూశాం. మొత్తానికి కార్టున్‌ మెరుస్తుంది!

వ్యాఖ్యానించండి