ఇంకొచ్చి వోటర్ ని వెక్కిరించినట్టు… -కార్టూన్


Bye Bye voter

“సిరా తడి ఆరకముందే…” అంటుంటాం కదా. అలాంటిదే ఇది కూడా.

ఆ ఒక్క ముద్ర కోసమే కదా రాజకీయులకు ఇన్ని పాట్లు.

ఈ.వి.ఎంల రోజులు కాబట్టి, ఆ ఒక్క నొక్కుడు కోసమే కదా అనాలేమో!

రోశయ్య లాంటి తలపండిన నాయకులు కూడా “నువ్వు నాకు ఓటేశావా నీకు సమాధానం చెప్పడానికి?” అని చీరాలలో తనను నిలదీస్తున్న ఒక మహిళను ఎదురు నిలదీశారు.

ఇక మద్యం, చికెన్ బిర్యానీ, చీరలు, ఉంగరాలు, వెయ్యి నోట్లు, క్రికెట్ కిట్లు… ఇత్యాదిగా ఆశలు చూపి ఓట్లు వేయించుకుంటున్న ఛోటా నాయకులని ఏమని నిలదీస్తాం?

అడక్కపోయినా ప్రలోభ పెట్టేది వారే. ప్రలోభం వల్లనే కదా ఓటేశావ్ అని వెక్కిరించేదీ వారే.

‘వెయ్యి నోటు ఇచ్చేది రేపు కోట్లు సంపాదించుకోవడానికే అని నిజం చెప్పి ప్రలోభ పెట్టగలరా?’ అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వగలరా? అప్పుడు మరోసాకు చెప్పి తప్పించుకుంటారు.

నిజమే. చైతన్యం లేక, రాజకీయాల మర్మం తెలియక, రాజ్య పాలన లోతులు తెలియక, తమ ఓటు దోపిడీకి ఇస్తున్న లైసెన్స్ అన్న సంగతి అవగానలోకి రాక… సామాన్య జనం ప్రలోభపడవచ్చు.

కానీ రాజకీయాలు తెలిసి, అన్నన్నేళ్లు అసెంబ్లీల్లో, పార్లమెంటుల్లో గడిపి, అనేకానేక కమిటీల్లో పని చేసి, చట్టం, రాజ్యాంగం… అన్నీ తెలిసి కూడా మీరెందుకు నోట్లు పంచుతున్నారు? మీరేందుకు మద్యం తాపిస్తున్నారు? మీరెందుకు ప్రజాస్వామ్యాన్ని ప్రలోభాలిచ్చి కొనుక్కుంటున్నారు?

సామాన్యుడు ఈ ప్రశ్నలు వేసే రోజు రావాలి.

2 thoughts on “ఇంకొచ్చి వోటర్ ని వెక్కిరించినట్టు… -కార్టూన్

  1. నిజమే విశేఖర్ గారు. నేను కూడా చాలాచోట్ల అదే వాదిస్తుంటాను. కేవలం జనం డబ్బు తీసుకుని ఓట్లు వేయడం వల్లే దేశం ఈ దుస్థితిలో ఉందని కాబట్టి జనం అందరూ ఉచితంగా ఒక మంచి వ్యక్తిని…ఉత్తముడిని, ఎన్నుకుంటే అప్పుడు మంచి వాళ్లంతా మంచిగా పాలిస్తారని కొందరు మేధావులు వాదిస్తుంటారు.
    – మీరన్నట్లే జనానికంటే చైతన్యం లేక డబ్బు తీసుకోవచ్చు. కానీ రాజకీయ నాయకులు డబ్బు ఎందుకు పంచుతున్నారు. డబ్బు తీసుకుంటే మాత్రం…ఇక ఐదేళ్లు ఇష్టమొచ్చినట్లు అవినీతి చేయమని లైసెన్స్ ఇచ్చినట్లా…?
    -నాకు అర్థం కాని విషయం ఏమిటంటే…మంచి వ్యక్తిని ఎన్నుకోండి అంటుంటారు. ( రాజకీయనాయకుల్లో మంచి వాళ్లు, చెడ్డవాళ్లు అని రెండు రకాలు ఉన్నట్లు ) మరి మంచి వ్యక్తి ఎవరో తెలుసుకోవడం ఎలా…?
    – ఆ మధ్య ఓ మేధావి…రాజకీయ నాయకుల మీద కేసులు బయటపెట్టినట్లుగానే..మన రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాల్లో మంచి వ్యక్తులెవరో ఎవరైనా ( మేధావైనా) ఓ లిస్టు ప్రకటించగలరా…?
    ఇప్పుడు మంచి వ్యక్తి ఐనా రేపు అధికారంలోకి రాగానే చెడ్డవాడు కాడని గ్యారంటీ ఏమిటీ…?
    – అసలు మ్యాటరేంటంటే….మన ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య చట్టాల్లోనే లోపాలున్నాయి. వాటిని సవరించకుండా , మూలాలు మార్చకుండా…, పైపై పూతలతో ఎప్పటికీ మార్పు రాదు.

వ్యాఖ్యానించండి