నిన్నటి వరకు పశ్చిమ దేశాల అనుకూల ఆందోళనలతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ కంటికి నిద్ర లేకుండా గడిపింది. రైట్ సెక్టార్, స్వోబోడా లాంటి మితవాద, నయా నాజీ సంస్ధలు హింసాత్మక ఆందోళనలతో యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి.
అంతటితో ఉక్రెయిన్ చల్లబడలేదు. ఈసారి ఆందోళనలు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలకు విస్తరించాయి. కానీ ఈ సారి ఆందోళనలు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగానూ, ఇ.యు, అమెరికాల మద్దతు ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఎక్కుపెట్టబడ్డాయి.
కీవ్ ఆందోళనలకు పశ్చిమ దేశాలు ప్రత్యక్ష మద్దతు ఇవ్వగా తూర్పు ఉక్రెయిన్ ఆందోళనలకు రష్యా మద్దతు ఇస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ అందుకు అనుగుణమైన సాక్ష్యాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. అలాగని రష్యా ప్రయోజనాలకు ప్రమాదం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదని రష్యా హెచ్చరించకుండా ఆగలేదు.
ఉక్రెయిన్ లో మామూలు పరిస్ధితి రావడానికని చెప్పి జెనీవాలో ఉక్రెయిన్, రష్యా, ఇ.యు, అమెరికాలు కొద్ది రోజుల క్రితం చర్చలు జరిపాయి. ఒప్పందం కుదిరిందని కూడా ప్రకటించాయి. కానీ ఆ ఒప్పందాన్ని అమలు చేసేవారు లేరు. ఒప్పందం ప్రకారం పశ్చిమ ఉక్రెయిన్ లో ఇ.యు + అమెరికా అనుకూల సాయుధ ముఠాలు, తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లలో రష్యా అనుకూల సాయుధ గుంపులు ఆయుధాలు విడిచి ప్రభుత్వ భవనాలు ఖాళీ చేయాల్సి ఉంది. అయితే ఇరు పక్షాలు ఇందుకు అనుగుణంగా ఒక్క చర్యా తీసుకోలేదు.
ఫలితంగా ఉక్రెయిన్ మొత్తం అలజడితో అట్టుడుకుతోంది. కీవ్, పశ్చిమ ఉక్రెయిన్ లలో మితవాద గ్రూపుల ఆక్రమణలకు, సాయుధ చర్యలకు చట్టబద్ధత కల్పిస్తూ ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లలోని ఆందోళనకారులను మాత్రం టెర్రరిస్టులుగా ముద్ర వేస్తూ వారిని అణచివేయడానికి సైన్యాన్ని పంపింది.
అయితే కీవ్ ప్రభుత్వం పంపిన సైన్యం అప్పగించిన పని నెరవేర్చకుండా వెనుదిరిగింది. కొన్ని చోట్ల ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో అరడజను మంది చనిపోయారు. దానితో రష్యా తూర్పు సరిహద్దులో మరింత సైన్యాన్ని పెంచి వారిని అప్రమత్తం కావించింది. ఫలితంగా ఉక్రెయిన్ సైన్యాలు వెనకడుగు వేశాయి. కొన్ని చోట్ల ఉక్రెయిన్ సైన్యాలు తమ ఆయుధాలు, ట్యాంకులతో సహా ఆందోళనకారులతో కలిసిపోయాయి.
తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లలో జరుగుతున్న రష్యా అనుకూల ఆందోళనలకు సంబంధించిన ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.























