టైటానియం మైనింగ్ కుంభకోణం విషయంలో నిందితుడుగా అమెరికా కోర్టులు పేర్కొన్న కె.వి.పి రామచంద్ర రావును వెంటనే అరెస్టు చేయాలని అమెరికా కోరింది. రాజ్య సభ సభ్యుడు అయిన కెవిపి ఆంధ్ర ప్రదేశ్ లో టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు ఇప్పించినందుకు గాను అమెరికా కంపెనీ నుండి లంచం వసూలు చేశారని అమెరికా ఆరోపించింది. ఆరోపణలను కెవిపి ఖండించినప్పటికీ ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్ధితి ఆంధ్ర ప్రదేశ్ లో అయితే లేదు.
టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు ఇవ్వడానికి 18.5 మిలియన్ డాలర్ల లంచం వసూలు చేయడంలో కెవిపి పాత్ర పోషించారని అమెరికా కోర్టులు చార్జి షీటు నమోదు చేశాయి. అంతర్జాతీయ రాకెటీరింగ్ కుంభకోణంలో పాల్గొన్నారని, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని కెవిపి పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో కె.వి.పి ని ప్రొవిజనల్ అరెస్టులో ఉంచాలని అమెరికా భారత ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు అమెరికాకు చెందిన నేషనల్ క్రైమ్ బ్యూరో భారత దేశ దర్యాప్తు సంస్ధ సి.బి.ఐకి లేఖ రాసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా (టి.ఓ.ఐ) తెలిపింది. ఇంటర్ పోల్ (ఇంటర్నేషనల్ పోలీస్) ద్వారా సి.బి.ఐ కి లేఖ అందినట్లు సమాచారం. రాయబార మార్గాల ద్వారా సంబంధిత పత్రాలను ఇండియాకు త్వరలోనే అందజేస్తామని అప్పటి వరకూ కె.వి.పి ని తాత్కాలిక అరెస్టులో ఉంచాలని అమెరికా ఎన్.సి.బి కోరింది.
ఇంటర్ పోల్ ద్వారా సమాచారం అందుకున్న సి.బి.ఐ వెంటనే సదరు లేఖను ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు పంపినట్లు తెలుస్తోంది. లేఖకు అనుగుణంగా కె.వి.పి పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సి.బి.ఐ కోరింది. సి.బి.ఐ కోరికను ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు మన్నిస్తారా లేదా అన్నది ఇంకా తెలియలేదు.
కె.వి.పి కి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ జారీ చేయాల్సిందిగా తాము ఇంటర్ పోల్ ని కోరామని కూడా అమెరికా సి.బి.ఐ కి సమాచారం ఇచ్చింది. రెడ్ కార్నర్ జారీ చేస్తే ఇక ఆ వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పట్టుకుని నిర్బంధం తీసుకోవాలి. ఇంటర్ పోల్ కు అనుబంధంగా ఉన్న దేశాలన్నీ ఈ రెడ్ కార్నర్ ని పాటించాల్సి ఉంటుంది. లేనట్లయితే అది అంతర్జాతీయ రాయబార సంబంధాలకు విఘాతంగా అవతలి దేశాలు భావించే ప్రమాదం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా లంచాలు ఇవ్వడానికి కె.వి.పి డబ్బు డిమాండ్ చేశారని అమెరికా ఆరోపిస్తోంది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో చక్రం తిప్పిన కె.వి.పి వై.ఎస్.ఆర్ మరణానంతరం అనూహ్యంగా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. వై.ఎస్.ఆర్ అనంతరం కూడా కె.వి.పి తన హవా కొనసాగించారని కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితులుగా మసిలారని పత్రికలు చెబుతాయి. తాజా సంక్షోభంలో ఈ పలుకుబడి అక్కరకు వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయం.

మొత్తానికి మనదేశంలో ఓ రాజకీయ అవినీతి బకాసురుడ్ని….అమెరికా అరెస్టు చేస్తే కానీ అతడి ఆగడాలు ఆగిపోయే పరిస్థితి లేదన్నమాట. వంద గొడ్లను తిన్న రాబందు సామెత లాగా…కేవీపీ అమెరికాకు దొరికిపోయాడు. బహుశా ఇప్పుడు మనదేశం ఈ విచారణకు సహకరిస్తుందా లేక….సార్వభౌమత్వం…అంటూ దేవయాని కేసు లాగే మోకాలు అడ్డుతుందా చూడాలి.