మోడి గాలి ఉన్నట్టా లేనట్టా? -కార్టూన్


No NaMo wave

“హుర్రే… ‘మోడి గాలి లేదు’ గాలి వీస్తోందోచ్…”

గాలి పలు విధాలు. తూర్పు గాలి, పడమటి గాలి… ఇలా వీచే దిశ, కాలాల్ని బట్టి గాలి కలిగించే ప్రభావం కూడా మారుతూ ఉంటుంది. పడమటి గాలిని మనం భరించలేం. సముద్రం మీది నుండి వచ్చే గాలి చల్లగా ఉంటుందనుకుంటాం. కానీ అది మోసుకొచ్చే ఉప్పు నీటియావిరి జిడ్డుని అంటగడుతుంది.  దానితో చల్లదనం అటుంచి దేహం చిరచిరలాడుతుంది.

ఈ గాలి లాగానే ఎన్నికల గాలులు కూడా పలు విధాలు. సానుకూల గాలి ఒకటైతే, ప్రతికూల గాలి మరొకటి. సానుకూల గాలి అనేది మనం చూసి ఎరగం. ఆయా ప్రభుత్వాలు చేసిన పనులని చూసి మెచ్చుకుని జనం ఓటేసిన ఉదంతాలు చాలా తక్కువ. ఉన్న ప్రభుత్వాన్ని వదిలించుకోవడానికి వేసిన ఒట్లే ఎక్కువ. లేదా మరో ప్రత్యామ్నాయం కనబడక ఉన్నోడికే అయిష్టంగా ఓట్లు వేయడం కూడా జరుగుతుంటుంది.

ఇవేవీ కాకుండా ఒక పధకం ప్రకారం వివిధ ఇంటరెస్ట్ గ్రూపులు కట్టగట్టుకుని సృష్టించే గాలి మరొకటి ఉంటుంది. అది కృత్రిమ గాలి. మోడి గాలి అంటూ హిందూత్వ శక్తులు, వారి అభిమానులు, మరికొన్ని అదృశ్య శక్తులు కలిసి ఒక గాలిని సృష్టించాయి. అది నిన్న మొన్నటి దాకా మీడియాలోనూ, సోషల్ వెబ్ సైట్ల లోనూ తప్ప నిజంగా కనిపించలేదు.

కానీ ఎన్నికలు మొదలయ్యాక మోడి గాలి ఉందని కొందరూ, లేదని కొందరూ ఒకటే వాదులాడుకోవడం మొదలయింది. మొత్తం మీద చూస్తే వ్యతిరేకులు, అనుకూలురు ఇద్దరూ కలిసి ‘మోడి గాలి’ గురించి అదే పనిగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఒక ఉప ఉత్పత్తిగా కూడా మోడి గాలి ఒకటి వీస్తోందని ఈ కార్టూన్ సూచిస్తోంది.

గతంలో మోడి గాలి గురించి అంతగా పట్టించుకోనివారు కూడా ‘అబ్బే, మోడి గాలి అంటూ ఏమీ లేదు’ అన్న ప్రచారం వినీ వినీ అదేంటో చూద్దాం అన్న ఆసక్తి పెంచుకునేలా ఈ ఉప ఉత్పత్తి దారి తీస్తోంది.

“ఎట్లా సంపాదిస్తేనేం? సంపాదించాడా లేదా?” అన్నట్లుగా “ఎట్లా వీస్తేనేం? ఆటో, ఇటో.. మొత్తం మీద మోడి గాలి వీస్తుందా లేదా?” అనుకోవాల్సిన పరిస్ధితి అన్నమాట!

One thought on “మోడి గాలి ఉన్నట్టా లేనట్టా? -కార్టూన్

వ్యాఖ్యానించండి