ఉక్రెయిన్ సంక్షోభం పలు భౌగోళిక రాజకీయాలకే కాకుండా ఆర్ధిక పరిణామాలకు కూడా బాటలు వేస్తోంది. ఐరోపా, రష్యాల మధ్య కీలక స్ధానంలో ఉన్న ఉక్రెయిన్ ను నిస్పక్ష ప్రాంతంగా నిలిపి ఉంచడం ద్వారా నాటో దూకుడుని రష్యా పాక్షికంగానైనా నిరోధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఉక్రెయిన్ నాటో చేతుల్లోకి వెళ్లిపోవడంతో తన విదేశాంగ విధానాన్ని సవరించుకోవలసిన తక్షణ అవసరం రష్యాకు ఏర్పడింది. రష్యా శక్తి వనరులకు పెద్ద వినియోగదారుగా ఉన్న ఐరోపాకు బదులు ఆ స్ధానాన్ని భర్తీ చేయగల దేశంగా చైనా ముందుకు వస్తోంది. ఇందుకు చైనా అవసరాలు కూడా తోడవుతున్నాయి.
మరోవైపు మధ్య ఆసియా, ఐరోపాలలో రష్యా యొక్క వాణిజ్య, భౌగోళిక రాజకీయ ప్రాభవాన్ని తగ్గించడానికి చైనాను మంచి చేసుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేయవచ్చని నిపుణులు, పరిశీలకులు భావిస్తున్నారు. కానీ చైనాను ఇప్పటికే సైనికంగా చుట్టుముట్టిన అమెరికాను నమ్మే పరిస్ధితిలో చైనా లేదు. నిజానికి అమెరికా ప్రకటించిన ‘ఆసియా-పివోట్’ వ్యూహం చైనాను లక్ష్యంగా పెట్టుకున్నదే తప్ప రష్యాను కాదు. కాబట్టి అమెరికా స్నేహపూర్వక సైగలను సాధ్యమైనంతవరకు ఉపయోగపెట్టుకుంటూ రష్యాతో వ్యాపార, రాజకీయ, రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకునేందుకే చైనా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. పైగా బ్రిక్స్ కూటమిలోనూ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఓ) లోనూ ఇరు దేశాలూ ఇప్పటికే నాయక దేశాలుగా ఉన్నాయి.
ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యా, చైనాలు మరింత దగ్గరికి జరగడానికి కావలసిన పునాది ఏర్పడిపోయింది. ఒకవైపు రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిన నేపధ్యంలో అమెరికా చైనాను సైనికంగా చుట్టుముట్టగా, మరోవైపు అదే అమెరికా, రష్యాకు ఐరోపాతో గల చారిత్రక వాణిజ్య, రాజకీయ, సామాజిక సంబంధాలను తెంచివేసి ఒంటరిని చేయాలని చూస్తోంది. ఈ రెండు ప్రయత్నాలూ అమెరికా తన ప్రపంచాధిపత్యాన్ని కాపాడుకోవడానికే చేస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూనే చైనా తన అవసరాల రీత్యా రష్యాతో మరింత దగ్గరి స్నేహ సంబంధాలను పెంచుకోవలసిన పరిస్ధితిలో ఉన్నది.
ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న చైనా అవసరాలు ఏటికేడూ పెరిగిపోతున్నాయి. చైనా ఎగుమతులు దాని ఆర్ధిక వ్యవస్ధలో ఒక ప్రధాన భాగం. ఎగుమతులపై ఆధారపడడం తగ్గించుకుని దేశీయ వినియోగంపై ఆధారపడే ఆర్ధిక వ్యవస్ధను అభివృద్ధి చేసుకోవడానికి చైనా గత కొన్ని యేళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే అది అంత త్వరగా తెమిలేది కాదు. దేశీయ వినియోగం పెరగడం అంటే చైనా కార్మిక వర్గ కొనుగోలు శక్తి పెరగడం. అనగా చైనా కార్మిక వర్గానికి వేతనాలు మరింతగా పెరగాలి. కానీ చైనాకు పెద్ద మొత్తంలో వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణ అక్కడ లభించే చౌక శ్రమశక్తి. అనగా తక్కువ వేతనాలు. లేదా తక్కువ కొనుగోలు శక్తి ఉన్న చైనా కార్మికవర్గం. అలాంటి కార్మిక వర్గాన్ని (అన్నిరకాల ఉద్యోగులను వీరిలో భాగంగా చూడాలి) దేశంలో ఉంచుకుని దేశీయ వినియోగం పెంచుకోవడం సామాన్యమైన విషయం కాదు.
చైనా ఆర్ధిక వ్యవస్ధకు వనరుల అవసరాలు పెరుగుతుండగా రష్యా భారీ సహజవనరులకు నిలయం. చైనా ఆర్ధిక వ్యవస్ధకు మార్కెట్ కూడా అవసరమే. ప్రపంచ వ్యాపితంగా తన మార్కెట్ ను విస్తరించుకోవాల్సిన అవసరం చైనాకు పెరుగుతోంది. దాదాపు అన్ని ప్రాంతాలతోనూ అది వాణిజ్య సంబంధాలను నెలకొల్పుతోంది. రష్యా మార్కెట్ కూడా తనకు అందుబాటులోకి వస్తే చైనాకు అంతకుమించి కావలసింది ఏముంటుంది?
రిఫరెండం ద్వారా రష్యాలో కలిసిపోయిన క్రిమియా వద్ద (నల్ల సముద్రంలో) డీప్ సీ పోర్ట్ ను నిర్మించగలిగితే అది చైనాకు అనేక విధాలుగా లాభం. మధ్య యూరప్, తూర్పు యూరప్ దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవడానికి చైనాకు అలాంటి పోర్టు బాగా సహాయపడుతుంది. ఈ పోర్టు, మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న దేశాలతో కూడా సాన్నిహిత్యం ఏర్పరుచుకునేందుకు చైనాకు వీలు కల్పిస్తుంది.
అలాగే ప్రపంచాధిపత్య భౌగోళిక రాజకీయాల రీత్యా భూ మార్గం ద్వారా శక్తి వనరుల (గ్యాస్, చమురు) సరఫరా పొందడం చైనాకు లాభకరం. ప్రస్తుతం ఇరాన్ పోర్టుల ద్వారా చైనాకు చమురు, గ్యాస్ ల అధికభాగం సరఫరా అవుతున్నాయి. ఇక్కడ పరిస్ధితులు ఎన్నడూ స్ధిరంగా ఉండేవి కావు. మధ్య ప్రాచ్యంలోని అనేక దేశాలు అమెరికా పలుకుబడి కింద ఉన్నందున శక్తి వనరుల సరఫరాలకు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ప్రపంచంలోని ఇతర అనేక సముద్ర రవాణా మార్గాలు సైతం అమెరికా, ఐరోపా రాజ్యాల ఆధీనంలో ఉన్నాయి. మలక్కా జలరవాణా మార్గాన్ని అమెరికా నౌకా బలగాలకు చెందిన 7th ఫ్లీట్ నియంత్రిస్తోంది. ఈ పరిస్ధితుల్లో రష్యా నుండి భూమార్గం ద్వారా శక్తి వనరులు సరఫరా అయితే అది చైనాకు మరింత శక్తి భద్రత (energy security) ను సమకూర్చుతుంది. చైనా వ్యూహాత్మక ప్రయోజనాలకు ఇది ఎంతో క్షేమకరం. రష్యాకు కూడా స్ధిరమైన గ్యాస్, చమురు మార్కెట్ చేజిక్కుతుంది. మధ్య ఆసియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇరు దేశాలకు అవకాశం వస్తుంది.
ఉక్రెయిన్ సంక్షోభం రష్యాను మరింతగా చైనా వైపుకు నెడుతోంది. అమెరికా ప్రాబల్యాన్ని, వేధింపులను నిలువరించాలంటే నమ్మకమైన ఉమ్మడి ప్రయోజనాలు ఉన్న మిత్రుడు రష్యాకు అవసరం. అదే సమయంలో రష్యాకు వ్యతిరేకంగా కూడా అమెరికా చైనాకు స్నేహ పూర్వక సంజ్ఞలు పంపే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే చైనా రెండు విధాలుగా లాభపడే అవకాశం కనిపిస్తోంది. దానికంటే ఎక్కువగా అమెరికా వ్యతిరేక ప్రయోజనాలు రష్యా, చైనాలను ఒకేవైపుకు తెస్తాయి. అమెరికా ఇప్పటికే రష్యాపై ఆంక్షలు ప్రకటించింది. ఐరోపా దేశాలు కూడా ఆంక్షలు విధిస్తామని చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో చైనాకు చేసే శక్తి వనరుల సరఫరాను 2018 నాటికి మూడు రెట్లు పెంచే విధంగా చైనాతో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికి రష్యా శక్తి వనరులు పొందే దేశాల్లో చైనాయే అతి పెద్ద దేశం అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇంత భారీ వాణిజ్యం నమ్మకమైన చెల్లింపుల వ్యవస్ధను డిమాండ్ చేస్తుంది. కానీ ప్రపంచంలో చెల్లింపుల కంపెనీలు ప్రధానంగా అమెరికా చేతుల్లో ఉన్నాయి. వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలు ప్రపంచంలోని 85 శాతం వాణిజ్య చెల్లింపులను నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్ధితుల్లో రష్యా కూడా తన సొంత చెల్లింపుల వ్యవస్ధను ఏర్పాటు చేయడానికి సమాయత్తం అవుతోంది. చైనా అయితే ‘యూనియన్ పే’ పేరుతో ఇప్పటికే ఏర్పాటు చేసుకుంది కూడా. ఇది ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్ధానాన్ని ఆక్రమించింది. అమెరికాకు చెందిన మరో కంపెనీ ‘అమెరికన్ ఎక్స్ ప్రెస్’ ను అధిగమించింది కూడా. అయినప్పటికీ అదింకా చాలా తక్కువ వాటాను మాత్రమే నిర్వహిస్తోంది. రష్యా కూడా ‘యూనియన్ పే’ ద్వారా చెల్లింపులు చేయడం, పొందడం ప్రారంభిస్తే పశ్చిమ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వవచ్చని చైనా ఆశిస్తోంది. తన కరెన్సీ యువాన్ (రెన్ మిన్ బి) ను మరింత అంతర్జాతీయకరణ చేయాలన్న చైనా ఆశలు ఉక్రెయిన్ సంక్షోభం ద్వారా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.


Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: ఉక్రెయిన్ సంక్షోభం: మరింత దగ్గరవుతున్న రష్యా, చైనా | ugiridharaprasad